సింహపురి రాజ్యాన్ని కనక మహారాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సరిగ్గా పన్నులు చెల్లించేవాళ్ళు. దాంతో ఆయన కోశాగారం ఎల్లప్పుడూ ధనంతో నిండి ఉండేది.
ఆ కోశాగారానికి సంరక్షకుడు సుబ్బన్న, ముసలివాడవుతున్నాడు. తన తరువాత కోశాగారపు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలిగే యువకుడిని ఎంపిక చేయమని సుబ్బన్న రాజుగారికి మనవి చేసుకొన్నాడు.
రాజుగారు కొంచెం ఆలోచనలో పడ్డారు. సుబ్బన్న సమర్థుడూ, విశ్వాసపాత్రుడున్నూ. తన తండ్రిగారి హయాం నుంచీ కోశాగార బాధ్యతలు నిర్వహిస్తున్న సుబ్బన్న బలంగా ఉన్నంత కాలమూ తనకు కోశాగారం గురించి ఆలోచించవలసిన పని పడలేదు. ఇప్పుడిక కొత్త వారిని వెతకటం తప్పని సరి.
అందుకని రాజుగారు చాటింపు వేయించారు:"రాజుగారికి ఆంతరంగికుడు ఒకడు కావాలి. చదువూ, బలమూ, తెలివి తేటలూ, నిజాయితీ, దురలవాట్లు లేకుండా ఉండటం- ఇవీ అవసరాలు".
ఇంకేముంది, రాజ్యంలోని యువకులు అందరూ పోటీపడ్డారు. ఆ పోటీలు అన్నింటిలోనూ ఉత్తములుగా ఎంపికైన నలుగురిని రాజుగారి సమక్షంలో నిలబెట్టారు రాజోద్యోగులు.
మహారాజుగారు వారి దేహ దారుఢ్యాన్నీ, చదువునీ, తెలివితేటల్నీ పరిశీలించారు. అన్నింటిలోనూ ఎవరికి వారే సాటి అనిపించారు.
మహారాజు గారు అడిగారు: "మీరంతా పల్లెలనుండి వచ్చినవారే కదా?!
నలుగురూ అవునని తలఊపారు.
"మరయితే మీకు విత్తనాలు నాటటం, మొక్కలు పెంచటం వచ్చా?"
"వచ్చు ప్రభూ!"
"అయితే ఇదుగో అందుకోండి. ఒక్కొక్కరికీ యాభై గ్రాముల శనగ విత్తనాలు. వీటిని మీరు మీ మీ ఇళ్లకు తీసుకెళ్ళి, వేరువేరుగా నాటండి. రెండు నెలలపాటు ఆ మొక్కల్ని జాగ్రత్తగా సంరక్షించండి. గడువు పూర్తవ్వగానే ఆ మొక్కల్ని తీసుకొచ్చి నాకు చూపించాలి. ఒక్క షరతు- మొక్కల్ని సరిగ్గా కాపాడుకోక, వాటికి ఏదో అయ్యిందని, చచ్చి- పోయాయని సాకులు చెబితే బాగుండదు- గుర్తుంచుకోండి" అన్నారు రాజుగారు, వాళ్ళు నలుగురికీ నాలుగు మూటల్లో విత్తనాలు అందజేస్తూ.
నలుగురు యువకులూ వారి వారి ఊర్లకు విత్తనాలు తీసుకెళ్ళి, తమకు తోచిన మంచి భూముల్లో, చక్కగా ఎరువు వేసి, ఈ విత్తనాలను నాటారు. వాళ్ళలో నాలుగోవాడి పేరు పోతన్న- నాటి నెలరోజులు కావస్తున్నా పోతన్న భూమిలో మొలకలు రాలేదు!
ఉండబట్టలేక, అతను మిగిలిన ముగ్గురు నివసించే ఊళ్లకూ వెళ్ళి చూశాడు- వారికి అలాంటి సమస్య ఎదురవ్వలేదు- వారు నాటిన విత్తనాలు బాగానే మొలకెత్తాయి. మొక్కలుకూడా బాగా పెరుగుతున్నై!
"నేను నాటిన విత్తనాలు ఎందుకు మొలకెత్తలేదు? రాజుగారు అడిగితే ఏం జవాబు చెప్పాలి" అని చాలా ఆందోళన చెందాడు పోతన్న.
చూస్తూండగానే రాజుగారిచ్చిన రెండు నెలల గడువూ పూర్తయింది. రాజుగారు నలుగురినీ పిలువనంపారు. పోతన్నకు ఏంచేయాలో తోచలేదు. "నాకు ఉద్యోగం అవసరం లేదు. రాజుగారి ఆగ్రహం తప్పితే చాలు. నేను అసలు రాజుగారి దగ్గరికే పోను ఈరోజు. రేపు పోయి క్షమాపణ వేడుకుంటాను. ఆలోగా వేరే వాళ్లకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చేసి ఉంటారు కనక, రాజుగారు నన్ను క్షమించకపోరు" అని ఇంటిలోనే దాక్కున్నాడు పోతన్న. కానీ భటులు ఊరుకోలేదు. రావాల్సిందేనని పట్టుపట్టి బలవంతంగా సభకు తీసుకెళ్ళారు.
సభలో మొదటి ముగ్గురూ తమ తమ మొక్కల్ని చూపించారు. అన్నీ ఆరోగ్యంగా, ఏపుగా పెరిగి ఉన్నై. "నీ మొక్కలు ఏవి?" అడిగారు రాజుగారు పోతన్నను. పోతన్న ముఖం వాడిపోయింది. గుండె కంపించింది. భయంతోవణికిపోతూ "ప్రభూ! తమరు ఇచ్చిన విత్తనాలను నేను నిజంగానే శ్రద్ధగా నాటాను! ప్రభువులు నన్ను క్షమించాలి, ఏమయిందోఏమో, అవి అసలు మొలకెత్తనే లేదు" అన్నాడు తలవాల్చుకొని.
మహారాజుగారు అతనివైపు ఒకలాగా చూశారు. ఇక తన ప్రాణాలు పోయినట్లేననిపించింది పోతన్నకు.
అంతలోనే మహా రాజు గారు నవ్వారు. ఈ పోతన్నే మాకు అంతరంగికుడు . మిగిలిన ముగ్గురూ ఇళ్ళకు వెళ్లిపోవచ్చు" అన్నారు.
మిగిలిన ముగ్గురూ తలలు వాల్చుకొని, మారు మాట్లాడకుండా సభలోంచి వెళ్లిపోయారు.
"మీరు ఈ నిర్ణయానికి ఎలా వచ్చారు ప్రభూ? మిగిలిన ముగ్గురూ తెచ్చిన మొక్కలు చక్కగా, ఆరోగ్యంగా ఉన్నాయి; కానీ పోతన్న నాటిన విత్తనాలు అసలు మొలకెత్తనే లేదు! మరి మీరు అతనినే మీ అంతరింగికునిగా ఎందుకు ఎంచుకున్నారు?" అని రాజుగారిని అడిగారు , సభికులు.
"ఈ నలుగురికీఇచ్చిన విత్తనాలు మామూలువి కావు: మేం వాటిని ఉడికించి, ఎండబెట్టి ఇచ్చాం. అవి అసలు మొలకెత్తే అవకాశం లేదు. అయితే మిగిలిన ముగ్గురూ ఎవరికి వాళ్ళు తమ మొక్కలు మొలవలేదని కంగారు పడ్డారు. ఉద్యోగం కోసం మోసానికి పాల్పడ్డారు. వేరే మొక్కల్ని తీసుకొచ్చి, 'మేం ఇచ్చిన విత్తనాలవే' అని నమ్మింప జూశారు. నిజాయితీగా వాస్తవాన్ని వ్యక్తీకరించిన పోతన్నకే, మాకు అంతరంగికుడయ్యే యోగ్యత ఉన్నది " అన్నారు రాజుగారు, చిరునవ్వు నవ్వుతూ.