అప్పుడు దమనకుడు "చెడిపోనున్న పనిని బాగుచేసుకునేందుకు, రానున్న లాభాన్ని పొందేందుకు, జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కూడాను, అవసరపడేది ఉపాయమే తప్ప, వేరుకాదు. కాబట్టి ఇప్పుడు మనం వెతుకవలసినది ఆ ఉపాయాన్నే. పింగళకానికి, సంజీవకానికి మధ్య తగవు పుట్టించేందుకు తగిన ఉపాయం ఆలోచించాలి ఇప్పుడు. అలా వాటి మధ్య భేదం(తగవులాట) పుట్టిస్తే మన కోరికలన్నీ‌ నెరవేరతాయి. మనం ఇప్పుడు ఆ సంగతిని పట్టించుకోకుండా వదిలివేస్తే, ఆనక మనకు పింగళకుడిని ఆశ్రయించి ఉండటమే కష్టం అయిపోతుంది" అన్నది.

"అదెట్లా సాధ్యం?" అని అడిగింది కరటకం.

"వంద విధాలుగా పరాక్రమించి సాధించలేని దానిని కూడా ఒక్క ఉపాయంతోటి సాధించవచ్చు. ఒకప్పుడు మామూలు కాకి ఒకటి, తనకు హాని చేస్తున్న భయంకర సర్పాన్ని ఉపాయం చేతనే కదా, నాశనం చేసింది? నీకు ఆ కథ చెబుతాను విను" అని దమనకం కాకి-పాము కథ చెప్పసాగింది:

కాకి-పాము

యమునా నది ఒడ్డున ఉన్న అడవిలో, మర్రి మ్రాను మీద- గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది- ఒక కాకి జంట. ఆ చెట్టు క్రింద పుట్టలో ఒక పాము నివాసం ఉండేది. కాకి పెట్టిన గుడ్లనన్నిటినీ అది ఎప్పటికప్పుడు చక్కగా తినేసి పోతుండేది. కాకికి చాలా బాధ వేసింది. చివరికి అది తన స్నేహితుడయిన నక్క దగ్గరికి పోయి, త్రాచుపాము వల్ల తనకు మాటిమాటికి కలుగుతున్న నష్టాన్ని చెప్పుకొని బాధపడ్డది.

అప్పుడు నక్క దాన్ని ఓదార్చుతూ "చెరువులో ఉన్న చేపలనన్నిటినీ మోసం చేసి తినేసిన కొంగను, ఒక మామూలు ఎండ్రి ఉపాయంతోటే గదా, తుదముట్టించింది? నీకు ఆ కథ చెబుతాను విను" అని, దానికి కొంగ-ఎండ్రి కథ చెప్పసాగింది:

కొంగ-ఎండ్రి

బదరికా వనంలో 'సారోదం' అనే చెరువు ఒకటి ఉండేది. ఒకసారి అక్కడికి ఒక ముసలి కొంగ వచ్చింది. కొన్ని రోజులపాటు అది కళ్ళు సగం మూసుకొని, ఆహారం తినకుండా, తీవ్రమైన తపస్సు చేసేదాని మాదిరి, నీళ్ళలో‌ఒంటి కాలిపైన నిలబడి ఉన్నది.

ఒక ఎండ్రి దాని పద్ధతిని గమనించి, చాలా ఆశ్చర్యపడి, దాని దగ్గరికి పోయి, "ఓ కొంగరాజా! నువ్వు చాలా కృశించిపోతున్నావు. నీ ప్రక్కగా పారాడే చేపల్ని కూడా కనీసం కన్నెత్తి చూడటంలేదు నువ్వు. నీ ఈ ప్రవర్తనను చూస్తే, ఏదో మహాద్భుతమైన కోరికను సాధించటంకోసం నువ్వు చేపట్టిన నిరాహార దీక్షేమో ఇది- అని నాకు అనుమానం కలుగుతున్నది. విచిత్రమైన నీ కథను వివరించి, నా చెవులకు సంతోషాన్ని కలిగించు" అన్నది. అప్పుడు ఆ కొంగ చల్లగా "ఓ కర్కటోత్తమా! నువ్వు చాలా తెలివి గలవాడివి. ఆకారాన్ని చూసి మనసులోగల భావనలను చదవగల సమర్థుడివి. కోరికలను వదిలిపెట్టి, మౌనాన్ని ఆశ్రయించిన మాలాంటి వాళ్ళకు కూడా, నీ మాటల తీరును చూసి, మాట్లాడాలని ఉత్సాహం కలుగుతున్నది.

నేను పుట్టినప్పటినుండీ నా కడుపున పడి మరణించిన జంతువులు ఇన్ని అన్ని అని చెప్పలేను. అట్లా మా జాతి సహజంగా ప్రాణిహింస చేసి, తద్వారా నా శరీరాన్ని పోషించుకుంటూ చాలా కాలం గడిపాను. ఒకసారి నేను గంగానదికి ఉత్తరపు గట్టున, ఒక మర్రిచెట్టు మీద కూర్చొని ఉండగా, ఆ చెట్టు క్రింద ఒక యోగి శ్రేష్ఠుడు, తన శిష్యులకు అనేక ధర్మాలను ఉపదేశిస్తూ 'మోక్షాన్ని కోరేవాళ్ళు తప్పక ఆచరించాల్సిన ధర్మాలను చెబుతాను, వినండి:

అన్ని పాపాలకు మూలం అయినది దురాశయే- కనుక మొదట దాన్ని వదిలిపెట్టాలి. అన్ని ప్రాణుల పట్లా దయ కలిగి ఉండాలి. లోభం లేకపోవటం, భూతదయ లేకపోవటం అనే గుణాలు ఎవరికైతే ఉంటాయో, వాళ్ళు మిగతా ఎన్ని ధర్మాలను పాటించినా ఫలితం ఉండదు. మన జీవితం క్షణంలో నశిస్తుంది- ఇది శాశ్వతంగా ఉండేది కాదు. అందువల్ల, మనిషన్నవాడు కాలాన్ని వృధా చేసుకోకుండా, ఊరికే పొద్దు పుచ్చకుండా, ఉత్తమ ధర్మాలను పాటించాలి ' అని చెప్తుండటం విన్నాను. ఏ పుణ్యం చేసుకున్నానో గాని, ఆనాటినుండీ ఆ మహానుభావుడు చెప్పిన ధర్మాలు నా మనసులో‌ నాటుకొని, ఇక నిద్రలోకూడా మరపుకు రాలేదు. అదిగో- ఆనాటినుండే నేను పురుషార్థాలమీద మనసు నిలిపాను. హింసతో కూడిన పనులంటే రోత పుట్టింది నాకు. నీళ్ళు, నాచు మొదలైనవి తింటూ నా యీ శరీరాన్ని నిలుపుకుంటున్నాను. మోక్షాన్నే కోరి, ముని మాదిరి జీవితం గడుపుతున్నాను" అన్నది.

అక్కడ నివసించే చేపలు ఈ మాటలు విని, చాలా సంతోషించినై: "ఆహా! ఈ మహానుభావుడు నివురు గప్పిన నిప్పులాంటి వాడే, మామూలు కొంగ కాదు!" అని, అవి దాని దగ్గరికి పోయి, "ఓ మహానుభావా! నీ దయను కాస్త మాపైన కూడా ప్రసరింపజేయి. కల్మషంలేని బుద్ధితో‌నిన్ను సేవించుకునేందుకు వచ్చాం" అన్నాయి.
అప్పుడా కొంగ వాటిని ఆదరపూర్వకమైన చిరునవ్వు ఒలకగా చూసి, క్రీగంటనే వాటి ప్రార్థనను స్వీకరించి, ఆనాటినుండి వాటితో స్నేహం చేసింది.

అలా కొంతకాలం గడిచాక ఒక నాడు ఉదయాన్నే "బాగా నిద్ర పట్టిందా?" అని అడిగేందుకు వచ్చిన చేపలకు ఆ కొంగ- దీనవదనంతో, కన్నీళ్ళు నిండిన కనులతో, నిట్టూర్పులు విసురుతూ కనబడ్డది. అట్లా అది ఆ చేపలను కన్నీళ్ళతోటే సమాదరించి, తల ఊపి, కొంచెం ఆగి ఆగి మాట్లాడుతూ- "కాలం బలమైనది. కాలమహిమను ఎవ్వరు కాదనగలరు?" అన్నది.

అప్పుడా చేపలు "తపోధనా! చాలా కాలంనుండీ‌ నిన్ను ఎరిగినవాళ్ళం. నువ్వు 'నిత్యసంతోషివి' అనిపించావు మాకు. అట్లాంటి నీకు- ఈరోజున ఇంతటి దు:ఖం‌ ఎందుకు కల్గుతున్నది?" అని అడిగాయి.

అప్పుడా టక్కరి కొంగ, జీరబోయిన గొంతుతో " 'నాకు రోజులు దగ్గర పడ్డాయి గదా, అందువల్ల ఇక ఊరికే ఉండకూడదు' అని, 'బంధుమిత్రులు, పిల్లా పాపలు' అనే బంధాలన్నిటినీ‌ విడిపించుకొని ఉన్నాను. 'సుఖంగా ఉన్నాను కదా', అనుకునేంతలో‌ నా ప్రారబ్ధం కొద్దీ మీరొకరు, నాకు తగులుకున్నారు! ఇప్పుడు 'మీకు ఆపద రానున్నదే' అని నా మనసు తల్లటపడుతున్నది. నేనేం చేసేది?" అంటూ, బొటబొటా కళ్ళనీళ్ళు కారుస్తూ, "ఇంతకు ముందు కొందరు జాలరులు వచ్చారిక్కడికి. ఈ కొలనులో‌ కొన్ని నీళ్ళే ఉండటాన్ని గమనించి, వాళ్ళు 'ఈ నీళ్ళు ఇంకొంచెం ఇంకాక వద్దాం!' అనుకుంటూ‌ పోయారు. ఆ మాటలు విని నా గుండెలు బ్రద్దలైనాయి. అప్పటినుండీ‌నేను విషాదంలో‌మునిగిపోయి ఉన్నాను" అన్నది.

అదివిని ఆ చేపలు భయపడి "మమ్మల్ని ఈ కష్టం నుండి ఒడ్డెక్కించే సామర్ధ్యం నీకొక్కడికే ఉన్నది. దు:ఖం ఎక్కువవ్వటం చేత విషాదంలో మునిగి ఉన్నావు తప్ప, నీకు తోచని ఉపాయం అంటూ ఉండదు. కొంచెం తేరుకొని ఆలోచించు" అన్నాయి.

అప్పుడా కొంగ కొంచెంసేపు ఊరుకొని, "ఇక్కడికి కొంత దూరంలో 'నిత్యాపం' అనే పేరుగల సరస్సు ఒకటి ఉన్నది. ఒక్కరోజులోనే మిమ్మల్నందరినీ అక్కడికి చేర్చగల శక్తి నాకు లేదు గానీ, నా ఓపిక కొద్దీ రోజూ కొన్నిటిని తీసుకెళ్ళి వదులుతాను" అని రోజూ తనకు కావలసినన్ని చేపలను ముక్కున కరచుకొని పోయి, ఒక కొండమీద పెట్టుకొని తింటూ, కొద్ది రోజులలో ఆ కొలనులోని చేపలన్నిటినీ ఖాళీ చేసేసింది.

అప్పుడు దాని తొలి స్నేహితుడైన ఎండ్రి దాని దగ్గరికి వెళ్ళి "ప్రియ మిత్రుడా! ఇక్కడి చేపలన్నింటినీ కష్టం నుండి తప్పించావు. అదే విధంగా నన్ను కూడా కాపాడు" అని ప్రార్థించింది. అప్పుడా దొంగ కొంగ 'సరే' అని, దాన్ని కూడా తన ముక్కుతో కరచుకొని, ఆకాశానికి ఎగిరి, అంతకు ముందు తాను చేపలను తిన్న కొండ శిఖరం వైపుకే సూటిగా పోసాగింది.

అది పోయే విధానాన్ని చూసి, ఎండ్రికి అనుమానం వచ్చింది-"ఇప్పుడు ఈ కొంగ నన్ను తీసుకొని పోతున్నది ఈ కొండశిఖరం మీదికే తప్ప, వేరే ఎక్కడికీ‌ కాదు. ఈ కొండ శిఖరం మీద నీళ్లెక్కడివి? "ఈ‌ కొండ మీదగాని, దీని చుట్టు ప్రక్కల గానీ అసలు నీళ్లే లేవు" అని మిత్రులు చెప్తుండగా విన్నాను. ఈ కపటపు కొంగ మోసంతో చేపలన్నిటినీ ఇక్కడికి పట్టుకొని వచ్చి తిన్నది కాబోలు! అయ్యో! తెలియక ఈ దుష్టుడి మాటలు విని మోసపోయానే! తెలివైనవాడు మోసగాళ్ళతోటి మోసంగానే ప్రవర్తించాలి తప్ప, తిన్నగా ఉండకూడదు. అందువల్ల ఎలాగైనా దీన్ని మోసంచేసి తప్పించుకునే ఉపాయాన్ని ఆలోచిస్తాను" అని బాధపడింది.

ఆపైన అది త్వరగా ఉపాయాన్ని ఆలోచించి, మనసులో నిలుపుకొని, కొంగతో "ఓ బకోత్తమా! నువ్వు నన్ను జారిపోకుండా ఆట్టే దూరం తీసుకెళ్ళలేవు. ఎక్కడైనా జారి పడ్డానంటే, భూమి మీద తిరిగే జంతువులు నన్ను వెంటనే చంపి తినేస్తాయి- నీ కోరిక నెరవేరదు. అందువల్ల నేను ఒక ఉపాయం చెబుతాను, విను. నేను నీ గొంతును కౌగలించి పట్టుకొని వస్తాను. గమ్యస్థానం చేరేంతవరకూ‌ నా పట్టు విడువను. అయినా నీకు చెప్పవలసిన పనిలేదు- నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి" అన్నది.

అప్పుడా కొంగ 'సరే దానిదేముంది?' అని, ఎండ్రిని తన గొంతుకు కరిపించుకొని, కొండమీదికి ఎగిరిపోయింది. అక్కడ అది క్రిందికి కాళ్ళూనబోయేంతలో ఎండ్రి పదునైన తన గిట్టలతో దాని మెడను కరుక్కున త్రుంచి, నేలమీద పడి, ప్రాణాలు కాపాడుకొని, తనదారిన తను పోయింది-

అందువల్ల నువ్వు కూడా మంచి ఉపాయాన్నొకదాన్ని ఆలోచించి, నీ శత్రువును చంపు" అని నక్క చెప్పింది. నక్క చెప్పిన కథను విని, కాకి దాన్ని మెచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చింది. (తరువాయి వచ్చే మాసం..)