"నా దెంత నైపుణ్యం! ఎంత ఆకర్షణీయంగా ఈ గూడు కట్టాను! నన్నెవరూ మెచ్చుకోరేం?" నొచ్చుకుంది సాలీడు, చెట్టుకి సాలెగూడు కట్టి.
పక్కగా ఎగిరే పిచుక- "ఈ సాలీడు ఎంత పన్నాగం పన్నిందో! ఆకలిని తీర్చుకోడానికి కుట్రలెందుకో! నాలా కష్టపడి నేరుగా వేటాడవచ్చుగా!" అంటూ కనిపించిన పురుగును చటుక్కున నోట కరచుకొని గూడు కేసి తుర్రుమంది.
ఈలోగా ఓ తేనెటీగ అటువైపు వచ్చింది. "ఇవాళ ఎలాగైనా నేనే ఎక్కువ తేనె సేకరించాలి!" అనుకుంటూ, అందర్నీ వదిలి ఒంటరిగా వస్తూ, ఏమరపాటుగా సాలెగూడులో చిక్కుకుపోయింది.
గూడులో అలికిడి కాగానే మధ్యలో వున్న సాలీడు అటుగా గబగబా పాకి వచ్చింది. తన వైపు వచ్చే సాలీడుతో "దయచేసి నన్ను తినకు. నీకు పుణ్యం వుంటుంది" అంది తేనెటీగ, జాలిగా.
"పిచ్చిదానా! నా గూట్లో చిక్కాక బయటపడ్డం అసాధ్యం" అంది సాలీడు సంతోషపడుతూ.
"అలా కాదు! ఈ చెట్టు కొమ్మకే మేం పెట్టిన పెద్ద తేనె పట్టువుంది, నీకు కావలసినంత తేనె ఇస్తా, నన్నొదిలెయ్ " అంది దీనంగా తేనెటీగ.
"నాకు తేనె సయించదు, నాకు నువ్వే ఎంతో రుచి!" అంటూ గూడులో గిలగిల లాడుతున్న తేనెటీగని నోట్లో వేసుకోవాలని నాలుగడుగులు ముందుకి వేసింది సాలీడు.
సరిగ్గా అప్పుడే తేనెటీగలు మూకలావచ్చాయి తప్పిపోయిన తేనెటీగని వెతుక్కుంటూ. ఆ మూక బరువుగా వేగంగా దూసుకొచ్చేసరికి - సాలెగూడు చెదిరిపోయింది. బతుకు జీవుడా అని సాలీడు ఓ సాలెదారం పోగు వెంట నేలకు జారింది.
చావు నుంచి బయటపడిన తేనెటీగ తోటినేస్తాలకి మప్పితాలు చెప్పింది.