వెంకటంపల్లిలో నివసించే మహేంద్రది ధనిక కుటుంబం. వాడు శారదా హైస్కూల్లో చదువుకుంటున్నాడు. వాళ్ల ఇంటి ప్రక్కనే ఉన్న గుడిసెలో రాజు, వాళ్ళ అమ్మ-నాన్న నివసించేవాళ్ళు. వాళ్ళది పేద కుటుంబం. రాజు స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకుంటున్నాడు. ఒకడు ధనికుడు, ఒకడు పేదవాడు అయినా మహేంద్ర, రాజు మాత్రం మంచి స్నేహితులే. మహేంద్ర వాళ్ళ ఇంటి ప్రక్కన ఉన్న స్ధలంలోనే పిల్లలంతా క్రికెట్ ఆడుకునేవాళ్ళు.
రాజు వాళ్ళ నాన్నకు ఆరోగ్యం సరిగా ఉండదు. ఇల్లంతా గడిచేది వాళ్ళ అమ్మ రెక్కల కష్టం మీదే. ఒక రోజున పిల్లలంతా క్రికెట్ ఆడేందుకు వచ్చారు, కానీ రాజు మాత్రం ఎంతకీ రాలేదు. 'ఎందుకు రాలేదు?' అని చూడటానికి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మహేంద్ర.

అక్కడ రాజు అడుగుతున్నాడు వాళ్ళమ్మను - "అమ్మా! అన్నం పెట్టివ్వమ్మా" అని.
"అన్నం అయిపోయింది బాబూ! ఈ రోజుకు ఎలాగైనా ఈ నీళ్ళతో గడుపు. రేపు ఎవరినైనా అడిగి తీసుకువస్తాను" అంటోంది వాళ్ళమ్మ. మహేంద్ర ఇదంతా విని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఆనాటినుండీ ఒక ఆలోచన అతన్ని మళ్ళీ మళ్ళీ వేధించింది: 'ఆకలి అందరికీ ఉంటుంది,కానీ అన్నం అందరికీ ఎందుకు ఉండదు?'
ఒక రోజున వాళ్ల నాన్న కొంచెం తీరికగా కనబడితే, ఆయన్ని అడిగాడు మహేంద్ర- "ఆకలి అందరికీ ఉంటుంది గదా నాన్నా, మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు?'అని. వెంటనే వాళ్ల నాన్నకు కోపం వచ్చేసింది: "ఆ రాజుతో నువ్వు ఉండటం వల్లనే కదా, నీకు ఈ పిచ్చి పిచ్చి సందేహాలన్నీ వస్తున్నాయి? ఇప్పుడే చెబుతున్నాను- వాడితో స్నేహం వదిలెయ్యి. లేకపోతే ఊరుకునేది లేదు" అని అరిచాడు తప్పిస్తే, మహేంద్ర సందేహాన్ని మాత్రం తీర్చలేదాయన.
సందేహం తీరని మహేంద్ర ఒక రోజున తన స్నేహితులను అడిగాడు: 'ఆకలి అందరికీ ఉంటుంది గదా, మరి అన్నం ఎందుకు ఉండదు, అందరికీ?' అని. వాళ్లకీ తెలీదు, అట్లా ఎందుకౌతున్నదో! అయితే ఆ మాట విన్నారు- వాళ్ల టీచరుగారు. ఆయన మహేంద్రను పిలిచి, జవాబిచ్చారు: "ఆకలి అందరికీ ఉంటుంది- ఎందుకంటే ఆకలి అన్నది శరీర ధర్మం. మరి అన్నం ఎందుకు ఉండదు అనేది పెద్ద విషయమే- చూడు, మీ తాత చదువుకున్నాడు- కాబట్టి మీ నాన్నను చదివించాడు. మీ నాన్న కూడా, చదువుకున్నాడు కాబట్టి నిన్ను చదివిస్తున్నాడు, పోషిస్తున్నాడు..”
"కానీ ఆ రాజు వాళ్ల కుటుంబంలో చూడు, ఎవ్వరూ చదువుకోలేదు. చదువు ప్రాధాన్యత తెలీదు- గనక రాజు వాళ్ల నాన్న రాజును చదివించలేడు; రోగం కారణంగా శ్రమ చేసి కుటుంబాన్ని పోషించనూ లేడు. అందుకనే అందరూ చదువుకోవాలి."
"అంతేకాదు- చూడండి పిల్లలూ, పేదవాళ్లమీద జాలి పడి కొంచెం అన్నం పెట్టారనుకోండి, ఆ అన్నం ఒక్క రోజులోనే అయిపోతుంది. అందుకని కేవలం అన్నం పెడితే సరిపోదు- ఆ అన్నం సంపాదించుకునే మార్గం చూపాలి. చదువును మించిన దానం వేరే ఏదీ లేదు అంటారు అందుకే" అని ముగించారు టీచరుగారు.
మహేంద్ర వాళ్ళ నాన్న అతనికి ఖర్చులకు అని నెలకు రెండు వందల రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు మహేంద్ర ఆ డబ్బులను పొదుపు చేసి ఎలాగైనా సరే రాజును చదివించాలని నిశ్చయించుకున్నాడు.
ఆ సంవత్సరం రాజు పరీక్ష ఫీజును మహేంద్రే కట్టాడు. రాజు కూడా అందుకు తగినట్లు చాలా శ్రమించాడు. బాగా చదివి, జిల్లాలో మొదటి స్ధానం సాధించాడు.

ఇప్పుడు ఊళ్ళోవాళ్ళంతా రాజు తెలివి తేటల్ని ప్రశంసిస్తుంటే, 'వాడు మా మహేంద్ర స్నేహితుడే' అని గర్వంగా చెబుతుంటాడు మహేంద్ర వాళ్ల నాన్న!
తమ విద్యార్థి తోటివారికి చేయూతనివ్వటాన్ని, దాని ఫలితాన్ని ప్రత్యక్షంగా చూసిన టీచరుగారు ఈ కథను ప్రతిసంవత్సరమూ ఎంతో మంది పిల్లలకు వినిపిస్తుంటారు.