పెద్దవాళ్ళు కథలు చెప్తారు; పిల్లలు వింటారు. అలాగే పెద్దవాళ్ళు పిల్లలకోసం కథలు వ్రాస్తారు-  ఇది మామూలుగా జరిగేదే;  కానీ కొత్తపల్లిలో  పిల్లలు కూడా కథలు వ్రాయటం, వాటిని  చిన్నాపెద్దా అంతా చదువుకోవటం బాగుంది.  పిల్లలకిదో అద్భుతమైన అవకాశం-'మీరేనా ఏంటి, మేమూ వ్రాయగలం, చూస్కోండి!' అని గొప్పలు పోడానికి.    
   ముందుగా కొత్తపల్లి ముఖచిత్రాల గురించి, సంపాదకీయం గురించి.    
   అట్టమీద బొమ్మలెప్పుడూ ప్రత్యేకంగానే ఉంటున్నాయి- కొత్తపల్లి స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ.  సంపాదకీయం మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించేట్టు, ప్రతిసారీ అంతే కొత్తగా ఉంటోంది; మనసును చిన్నగా కదుపుతోంది.   'శ్రమశక్తి' లోని సేవక చీమలకు తెలీదు- అవి దోచుకోబడుతున్నాయని.  అలాగే ఎంతోమంది పిల్లలకూ తెలీదు- వాళ్ళ బాల్యం దోచుకోబడుతోందని.  బాల్యంలో ఆనందాలు అనుభవిస్తేనేకదా, అవి కోల్పోతున్నామని తెలిసేదీ; బాధ కలిగేదీ? చల్లటి ఏటిగట్టున, ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టుకుంటున్న పిల్లల్లో కనిపిస్తున్న తీరిక, ప్రశాంతతల రుచి కూడా వాళ్లకు తెలీదుగా! వీరాంజనేయులు బొమ్మ మనసుకు హత్తుకున్నది.     
    'ఎవరు గొప్ప'(వ్రాసింది నికితా, నిఖితా?) చదివి తీరిగ్గా కూర్చొని ఆలోచించా- పాపం, అమాయకపు జంతువులన్నీ మనిషిని గొప్పవాడని ఒప్పేసుకున్నాయిగానీ, అసలు సంగతి మాత్రం మనిషి వాటన్నిటికంటే తెలివైనవాడు.  తన లాభం కోసం దేన్నైనా వాడుకోగల, దేన్నైనా నాశనం చేయగల చావు తెలివితేటలున్నవాడు..గొప్పవాడేం కాదు గదా, నిఖితా?      
     పట్నం గురించి   ప్రగతికి బాగా తెలుసనుకుంటా- అక్కడి మనుషులు కాలుష్యాన్ని తప్పించుకు తిరగడానికీ, దానితో సహజీవనం చేయడానికీ నానా ప్రయత్నాలూ చేస్తారుగానీ, దాన్ని లేకుండా చేయడానికి మాత్రం ఏమీ చెయ్యరని.  అందుకే మల్లయ్యని వెనక్కి పంపెయ్యడమే కరెక్టనుకుంది.  ఈ కథ, దానికి వేసిన బొమ్మలేమో రాజుల కాలానికి చెందినవిగా ఉన్నై.. ఇంగ్లీషు పదాలు (బాటిళ్ళు..స్పూన్లు) వాడకుండా ఉంటే బాగుండేది ప్రగతీ!      
   చదువుతున్నది మూడో తరగతైనా, సొంతంగా చేస్తే ఏదైనా చక్కగా అర్థమౌతుందని చక్కగా చెప్పింది  నందన.  మీబళ్ళో నువ్వు అలాగే చదువుకుంటున్నావు గదూ, నందనా?      
   ఆమని పుట్టించిన  వరాల పాము  సీత, గీతలను బడికి పంపిందిగానీ, అసలు అలాంటి పిల్లలకి బడి మానాలనే అనిపించనివ్వని సరదా బడులని సృష్టిస్తే మరీ బాగుండేది.  బళ్ళే గనక అలాగుంటే సీత, గీతలు బడి ఎందుకు ఎగ్గొడతారు, మరి?      
   హైమవతి గారి 'కాకి'  కథ  పెద్దదిగా ఉన్నా, చివరికంటా చదివించింది.  'పారిన ఉపాయం',   'పేరు మరచిన ఈగ'లు ఇదివరకే చదివిన కథలు. వాటిని  అలాంటి కథలను స్వీయ రచనలుగా కాక, తిరిగి చెప్పినట్టు చెబితే బాగుండేదనిపించింది.      
    'అమ్మచెట్టు'  కథలో బజరా (బమ్మిడి జగదీశ్వరరావు- బొమ్మిడి కాదు)గారి మార్కు  కనిపించింది.  చాలామంది  కథలు వ్రాస్తారు కానీ, అవి ఏవయసు పిల్లల్ని ఉద్దేశించి వ్రాశారో ఆ వయస్సు పిల్లలకి  చదివి వినిపిస్తే వాళ్లకి అర్థమయ్యేలా ఉండవు.  'అమ్మచెట్టు' మాత్రం నా ఐదేళ్ల కూతురికి చదివి వినిపిస్తే, ఎక్కడా అర్థం వివరించకుండానే పకపకమని నవ్వుకుని, మళ్ళీ చదవమని అడిగింది.  బజరాగారికి ఇది అభినందనేగా!?      
   నాగలక్ష్మిగారి  'గమ్యం'  చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది.  అలాగే 'గులాబీ గర్వభంగం' కూడా.  అనుసరణ ఏ భాషనుంచో చెబితే బాగుండేది.      
   నారాయణగారి  'కాపాడండి!'  ఎవరిని? డైనోసార్లనా? వాటినుంచి మనుషుల్నా, అర్థం కాలేదు గాని కథనం మాత్రం స్పీల్‌బర్గ్  సినిమా తరహాలో కొత్తగా  అయితే ఉంది.      
   కష్టపడి ఆప్యాయంగా ఈ పుస్తకాన్ని అందించిన బృందమంతటికీ అభినందనలు.
