గత  ఆరు రోజులుగా ఎడతెరపి  లేకుండా వర్షాలు. ఫలితంగా తెగి పడిన కరెంటు తీగలు, స్తంభాలు, నేలకొరిగిన వృక్షాలు! ఎలాగ?- మరొకగంటలో  ఊరికి దూరంగా ఉన్న స్టీల్ ప్లాంట్  హైస్కూల్‌కి  చేరుకుని,  నగర స్థాయి టాలెంట్ టెస్టులో పాల్గొనాలి! అమ్మా,నాన్న  ఇద్దరూ  డాక్టర్లు కావడంతో  ఉదయం ఎనిమిది గంటలకే క్లినిక్‌కు వెళ్లిపోయారు. ఎనిమిదిన్నరకు కారు పంపిస్తామన్నారు; కానీ  తొమ్మిదవుతున్నా  కారు రాలేదు!     
   సరిగ్గా అప్పుడే ఆపద్బాంధవుడిలా వచ్చాడు రాధాకృష్ణ  మామయ్య.  ఆయన కూడా డాక్టరే. నా గోడంతావిని, "నేనూ  అటే వెళ్తున్నా. నా కారులో   డ్రాప్ చేస్తాను- పద" అన్నాడు. 'హమ్మయ్య' అనుకుంటూ వెళ్ళి కూర్చున్నాను మామయ్య  కారులో . ఇంకా హైవే కూడా చేరుకోకముందే  ఆగిపోయింది మా కారు! ఒక్క మా కారే  కాదు- చాలా  వాహనాలు ఆగిపోయివున్నాయి... కారణం? తుఫాను  తాకిడికి  రోడ్డుకు  అడ్డంగా నేలకొరిగిన వేపచెట్టు!     
   చేసేదేమీ లేక, నేను కూడా అక్కడే నిల్చున్నాను.  కానీ నిలబడి ఏం ప్రయోజనం? ఏదో చెయ్యాలి..ఏం చేయాలో తెలీదు.. అంతలో నా మనసులో  తళుక్కుమంది ఓ ఆలోచన. 'హెల్ప్' అని అరుస్తూ, రోడ్డు మధ్యగా  వెళ్లి, చెట్టును గట్టిగా పట్టుకుని కదిలించబోయాను. అరంగుళం  కూడా  కదల్లేదు ఆ చెట్టు.     
   కానీ 'ఏమైంది? ఏమైంది?' అంటూ నా దగ్గరకు పరుగు పరుగున వచ్చారు ఓ నలుగురు. నాకేం  కాలేదంకుల్- అటు చూడండి, ఓ సారి! చచ్చిన ఆ బల్లిని  చీమలన్నీ  కలిసి ఎలా లాక్కుపోతున్నాయో?! అలాగే  మనమంతా  కలిసి  ఈ చెట్టును పక్కకు నెట్టలేమా?' అడిగాను నేను.      
   వాళ్లలో కదలిక మొదలైంది. మామయ్యతో  పాటు మరో  నలుగురు  నాకు సాయంగా చెట్టును కదిలించసాగారు. తరువాత  మరో  నలుగురు..ఆపైన  ఇంకోనలుగురు..కొంచెం కొంచెంగా చెట్టు కదలటం మొదలు పెట్టింది. అంతలో  మరింతమంది  యువకులు చేరారు. అందరి బలం ముందు చెట్టు బరువు ఏపాటిది? అడ్డం తొలగిపోయింది. క్షణాల్లో  క్లియరైపోయింది  ట్రాఫిక్ జామ్.      
   "శెహభాష్ రా, వాసూ! నీ టాలెంట్‌ని ఇక్కడ కూడా చూపించావ్!" నా భుజం తడుతూ అన్నాడు రాధాకృష్ణ  మామయ్య.     
   గర్వంతో  మెరిసాయి నా కళ్లు.      
   కొద్ది సేపట్లో మేమెక్కిన కారు కదిలి ముందుకు దూసుకుపోయింది.
