అనగనగా ఒక పల్లె. ఆ పల్లెలో ఉండే సూరి, జ్యోతిల సంతానం బంటి. సూరి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. బంటి పదో తరగతి చదివేవాడు. సంక్రాంతి సెలవులు రాగానే బంటికి ఆటోడ్రైవింగు నేర్పాడు సూరి. ఒకసారి ఆటో నడపటం నేర్చుకున్నాక, బంటీ కూడా వాళ్ళ నాన్నకు అప్పుడప్పుడూ ఆటో నడపటంలో సహాయం చేయసాగాడు.
బంటి పరీక్షలు బాగా రాశాడు. పదవతరగతిలో 560 మార్కులతో పాఠశాలకు మొదటి స్థానం సాధించాడు. కాలేజిలో చేరాలని నిశ్చయించుకున్నాడు. వాళ్ల నాన్న మాత్రం 'నువ్వు ఆటో బాగా నడుపుతావురా; చదువుల్లో ఏమొస్తుంది? ఆటో తోలుకో, చాలు" అని సలహా ఇచ్చాడు. బంటి ఊరుకోలేదు. బాగా పోరి, వాళ్ల నాన్నను ఒప్పించాడు: కాలేజికి వెళ్లటం మొదలుపెట్టాడు. వాళ్ల ఊళ్ళో కాలేజి లేదు. ఆటోలు నడిపేవాళ్లంతా తనకు పరిచయస్తులే- అందుకని రోజూ ఏ ఆటో కనబడితే ఆ ఆటోలో డ్రైవరు పక్కన కూర్చొని పొరుగూర్లో ఉన్న కాలేజికి వెళ్తున్నాడు.
ఒకరోజు బంటి అట్లా ఆటోలో ప్రయాణిస్తుండగా డ్రైవర్ ఫోన్ మోగింది. ఒక చేత్తో ఆటో నడిపిస్తూనే, వేరొకచేత్తో ఫోన్ తీసి మాట్లాడడం మొదలుపెట్టాడు, డ్రైవరు. బంటి మాత్రం డ్రైవర్ పక్కన కూర్చొని పాటలు వింటున్నాడు.
అంతలో ఏమైందో తెలీదు- డ్రైవర్‌ ఆటోను వదిలేసి, ఛాతీని నొక్కుకుంటూ ప్రక్కకు ఒరిగిపోయాడు. ఆటో అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న కాలవ వైపు వెళ్తోంది! ఒక్క క్షణం పాటు బంటికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అర్థం కాగానే ఒక్క ఉదుటున ముందుకు దూకి ఆటోని అదుపులోకి తీసుకున్నాడు. డ్రైవరు నిశ్చేష్టుడై పడి ఉన్నాడు ఇంకా- ఒకసారి అతన్ని చూడగానే బంటికి అర్థమైంది- అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందని! వెంటనే ఆటోని ముందుకు దూకించి దగ్గరలోనే ఉన్న ఆసుపత్రి వైపుకు బయలుదేరాడు.

అది ఎన్నికల సమయం. ఆసుపత్రికి వెళ్తున్న దారిలోనే పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రిగారు వస్తున్నారు. అన్ని వైపులా భారీ బందోబస్తు! బంటి చిన్నవాడు- ఇంకా ఆటో నడిపే అర్హత లేదు; అందులో కూర్చున్న ప్రయాణీకులెవ్వరికీ ఆటో నడపటం రాదు! పోలీసులను చేరుకోగానే బంటి ఆటోను నిలబెట్టి, గబగబా వాళ్ల దగ్గరకి వెళ్ళాడు: "సార్ డ్రైవర్‌కు గుండెనొప్పి వచ్చింది-ఆసుపత్రి-" అని చెప్పేలోపే ముఖ్యమంత్రి గారి కార్లు అక్కడికి వచ్చి వాలాయి. అంతలోనే ముఖ్యమంత్రిగారు క్రిందికి దిగి సంగతేంటని విచారించారు. ఆటో డ్రైవరును త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లమని అధికారులను ఆదేశించారు. బంటిని కూడా తనతో పాటు రమ్మని సభకు పిలుచుకుపోయారు.
"మనం సంఘ జీవులం- అంటే పదిమందితో కలిసి బ్రతికేవాళ్లం. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. 'ఈపని నాది కాదు; ఆపని నాది కాదు' అని మడి కట్టుకొని కూర్చుంటే వీలవ్వదు. ప్రతివాడూ ముందుకొచ్చి ఈ బంటి మాదిరిగా సమయస్ఫూర్తితో అందరికీ మేలు చేసే పనులను చేపట్టిన రోజున మన దేశంలో పేదరికం అన్నదే లేకుండా పోతుంది" అని ప్రసంగించారు. ఆటో డ్రైవర్‌ను, ప్రయాణీకులను సమయస్ఫూర్తితో రక్షించి-నందుకుగాను బంటి పేరును 'సాహస బాలల పురస్కారం' కోసం సిఫారసు చేశారు.
ఆ సంవత్సరం ఆగస్టు15వ తేదీన, రాష్ర్టపతి సమక్షంలో బంటికి సాహస బాలల పురస్కారం లభించింది.