ఊళ్లో ఒక కిరాణా దుకాణం నడిపిస్తాడు మోహన్‌సింగ్.  అతను ఏమంత ధనికుడు కాదు; కానీ అతనిది జాలిగుండె. దాంతో ఎప్పుడూ ఏదో ఒక మంచిపనిని  నెత్తిన వేసుకొనే ఉండేవాడు.  ఊళ్లో జనాలందరికీ  ఉపయోగపడే పని ఏది ఉన్నా, ప్రతిసారీ  అతను ముందుపడి, దాని కోసం  ఎంతో కొంత  ఖర్చు చేసేవాడు. అంతేకాదు, అలాంటి పనుల- కోసమని తన సంపాదనలోంచి  కొంత డబ్బును తీసి ప్రక్కన  వేసేవాడు కూడా.     
   పట్టణానికి పోయే తారురోడ్డు ఊరి నుండి  అర్ధ కిలోమీటరు  దూరంలో ఉంది. ఆ దారిన పోయే వాళ్లకు ఎవరికైనా దాహం వేస్తే  ఆ అర కిలోమీటరూ నడిచి  ఊళ్లోకి రావలసిందే-  అక్కడికి దగ్గర్లో  త్రాగు నీటి సౌకర్యం వేరే ఏదీ లేదు మరి!  దీన్ని  గమనించిన  మోహన్‌సింగ్, తారు రోడ్డుకు  దగ్గరగా ఒక బావి  త్రవ్వించాలనుకున్నాడు.       
   బావి చాలా  ఖర్చుతో కూడుకున్న పని కదా, దానికోసం ప్రత్యేకంగా మోహన్‌సింగ్  కొంత కాలంపాటు  పొదుపు చేయాల్సి వచ్చింది.  చివరికి  ఎలాగైతేనేమి, తారురోడ్డును  ఆనుకొనే  చక్కని  ఊటబావి ఒకటి తయారైంది. వచ్చే పోయే బాటసారులకి  ఆ బావి  చాలా సాయమైంది.  ఊళ్లో  వాళ్లకూ చాలా ఉపయోగపడింది ఆ బావి. పశువుల్ని తోలుకొని వెళ్లే కాపరులకు కూడా దాహం తీర్చుకునేందుకు  ఒక చక్కని  వసతి  అయ్యింది. పశువులకు  మధ్యలో నీళ్లు పెట్టటం  సులభమైంది ఇప్పుడు.  ముఖ్యంగా  నాట్ల సమయంలోనూ, కోతల  సమయంలోనూ అటు వైపున పొలాలున్న  రైతులందరికీ చాలా  సమయం కలిసి వచ్చినట్లయింది. ఊళ్లో ప్రతి ఒక్కరూ మోహన్‌సింగ్ చేసిన  మంచిపనిని  గురించి  గొప్పగా చెప్పుకున్నారు.  కొందరు అతని ఇంటికి వెళ్లి మరీ చెప్పారు- ఆ బావివల్ల  తమకు ఎంత మేలు జరిగిందీ. అందరూ అతన్ని ఎంతగానో పొగిడారు.     
   మోహన్‌సింగుకు ఇదంతా  చాలా సంతోషాన్నిచ్చింది. అయితే  మంచిపనులు  చేయటం అతనికి ఏమంత  కొత్తకాదు గనక,   ఈ పొగడ్తలకు అతను  పెద్దగా ఉబ్బి పోలేదు.      
   కొన్నాళ్లకు  అనుకోని  సంఘటన ఒకటి జరిగింది. రోడ్డు మీద పోతున్న  ప్రయాణీకుడెవరో ఆ బావిలో పడి, మునిగి పోయాడు. అతనికి ఈత రాదేమో- మరి అతని కంటి  చూపు సరిగా లేదో, లేకపోతే తప్ప తాగి ఉన్నాడో ఏంజరిగిందో  ఎవ్వరికీ తెలీదు- ఊళ్లో వాళ్లంతా  వెళ్లి బావినీ, అతని శవాన్నీ చూశారు. చూసిన ప్రతివాళ్లూ చాలా బాధపడ్డారు. చనిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. మోహన్‌సింగ్  కూడా పాపం చాలా బాధపడ్డాడు.     
   అయితే అదే సమయంలో అతని దు:ఖాన్ని మరింత పెంచే మాటలు  కొన్ని మొదలయ్యాయి.  ఊళ్లో జనాలు కొందరు మోహన్‌సింగును  విమర్శించటం మొదలు పెట్టారు- "ఇదంతా మోహన్‌సింగ్ తప్పే. అతను ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సింది. ఊరికి  ఇంత  దూరంగా, రోడ్డుకు అంత దగ్గరగా  బావిని  త్రవ్వటం మొదటి తప్పు. బావి చుట్టూ గోడను సరిగ్గా కట్టకపోవటం రెండోతప్పు. అసలు ఇవన్నీ చేసేముందు అతను గ్రామ పంచాయితీ అనుమతినైనా అడిగాడా, అసలు? లేదు! అసలు అతను కేవలం గొప్ప పేరు సంపాదించుకోవటం  కోసమే ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. తను చేసే పనులవల్ల  ఎందరు అమాయకుల ప్రాణాలు పోతాయో అతనికి పట్టదు" అని.       
   ఈ మాటలకు మోహన్‌సింగ్ మరింత  క్రుంగి పోయాడు. ఎవ్వరితోటీ  మాట్లాడకుండా ఇంట్లోనే ముడుచుకొని ఉండిపోయాడు చాలా రోజులు. 
   అయితే  లోతుగా ఆలోచించిన  మీదట అతనికి ఒక సంగతి బాగా అర్థమైంది- "మామూలు జనాలకి ఆలోచనాశక్తి కంటే,  విషయాలకు అప్పటికప్పుడు స్పందించేసే అలవాటు చాలా బలీయంగా ఉంటుంది. ఏ సంఘటన పట్లా  వాళ్లకి  స్పష్టమైన ఆలోచనా ఉండదు; నిశ్చితమైన అభిప్రాయమూ ఉండదు. అందువల్ల  వాళ్ల స్పందనలు కూడా  అటూ ఇటూ  ఊగిసలాడుతూ ఉంటాయి. ఇక, ఇప్పుడు జరిగిన  ప్రమాదం లాంటివి  మన జీవితంలో  ఒక భాగం. ఎన్నెన్ని  జాగ్రత్తలు తీసుకున్నా,  ఇలాంటివి  జరిగే అవకాశాన్ని మటుకు పూర్తిగా తుడిచి వెయ్యలేం! అందుకని, మనం  మంచి పనులు చేసేందుకు  ఏ మాత్రం జంకకూడదు: అయితే  పొగడ్తల్నీ, విమర్శల్నీ రెండింటినీ ఒకే రకంగా తీసుకోవటం  అలవరచుకోవాలి. అది గనక జరిగితే ఇక ఏ సమస్యా ఉండదు.”     
   ఒకసారి ఈ నిశ్చయానికి  వచ్చాక, మోహన్‌సింగ్ మరిన్ని  మంచి పనుల్ని ధైర్యంగా చేపట్టాడు.
