అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పేరు ముష్టికోవెల. ఆ ఊరిలో రాజు-సుధ అని ఇద్దరు దంపతులుంటారు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. ఒకరోజు గాలి చాలా విపరీతంగా వీస్తుంది. ఆ గాలి వానకు వాళ్ళ ఇల్లు కాస్తా పడిపోతుంది.
ఇంక అక్కడ ఉండటం ఇష్టంలేక, వాళ్ళు ఆ రాత్రికి రాత్రే ప్రయాణమై, సామాన్లన్నీ సర్దుకొని వేరే ఊరు దారమ్మట పోతా ఉంటారు.
అలా వాళ్ళు పోతూ ఉంటే పక్కనే ఒక చెరువు, చెరువుకట్ట ఉంటుంది. దాని మీద ఒక గుడిసె కూడా ఉంటుంది. ఆ గుడిసెను చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. రాజు-సుధ ఇద్దరూ అక్కడికి పోతారు.
ఆ గుడిసెలో ఒక ముసలమ్మ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆమె దగ్గరకు వెళ్లి "అవ్వా! మేము కూడా ఇక్కడ ఉండచ్చా?" అని అడుగుతారు. అవ్వ 'సరే' అని ఒప్పుకొనింది. మెల్లగా తన గురించిన అన్ని విషయాలనూ చెప్పటం మొదలు పెట్టింది అవ్వ: "నాకు తోటలు ఉన్నాయి. అలాగే నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు. మరి వాడు పెద్ద చదువు చదివి పోలీస్ అవుతాడని, నేను వాడికి పోలీస్ బట్టలు కూడా తెచ్చినాను. కానీ వాడు ఒక రోజు 'నేను పోలీసుల్లో జేరతా' అని చెప్పి ఊరి బయటకు పోయినాడు. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఎందుకంటే వాడు చేరింది పోలీసుల్లో కాదు-దొంగల జతలో జేరిపోయినాడు" అని అవ్వ చెప్పింది.
సుధ చాలా ధైర్యవంతురాలు. బాగా తెలివైనది కూడా. ఆమె అడిగింది- "ఓ అవ్వా! ప్రక్కనే ఊరు ఉంది కదా! అక్కడికి ఎవ్వరేకాని దొంగలు రారా? వాళ్లలో ఉంటాడేమో, నీ మనవడు- పోయి చూసుకొని వెనక్కి తెచ్చుకోరాదా? అట్లా దొంగల్లో ఎందుకు వదిలేస్తావు, ఊరికే?" అన్నది.
అప్పుడు ఆ అవ్వ "ఎందుకు రారు తల్లీ, రోజూ వస్తారు. అందరి ఇళ్లలోనూ దొంగతనం చేస్తూ పోతారు. చిక్కిదంటే ఏదో ఒకటి తీసుకొనిపోతారు. వాళ్లలోనే ఉన్నాడు నా మనవడు కూడా. నేను ఒకసారి పోయి వాడిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమిలాడాను- కానీ ఆ దొంగల సావాసం పట్టినవాడు వెనక్కి ఎందుకు వస్తాడు? నా మాట విననే లేదు" అన్నది ఏడుస్తూ.
"ఏడవకవ్వా! ఈసారి వాళ్ళెవరైనా నీకు ఎదురైతే 'నా ఇంట్లో ఉండేకి పోలీసు వచ్చాడు' అని చెప్పు. నీమనవడు ఇంటికి వచ్చేంతవరకు నేను పోలీసు వేషం వేసుకొనే ఉంటాను" అన్నది సుధ, అవ్వ దగ్గరినుండి పోలీసు బట్టలు తీసుకుంటూ.
ఆరోజు సాయంత్రం సుధ పోలీసు వేషంలో అడవికి దగ్గర్లో తిరుగుతుంటే, దొంగలు ప్రక్క ఊళ్ళో దొంగతనం చేసిన గొర్రెలతో ఊరికి తిరిగి వస్తూ కనబడ్డారు.
ఆమె ధైర్యంగా వాళ్లకి ఎదురుగా నిలబడి, బొంగురు గొంతుతో "రే!ఎక్కడికి రా, పోతూ ఉన్నారు? అవి ఇక్కడ ఇవ్వండి!" అని వాళ్లని బెదరగొట్టింది. అట్లా వాళ్ల దగ్గర గొర్రెలు ఇప్పించుకొని వాళ్లని ఊరి బయటి వరకు తరిమింది. అటుపైన ఆ గొర్రెల్ని అవ్వకిచ్చి "ఇవిగో, మీ మనవడి గొర్రెలు- బాగా పెంచి పెద్ద చెయ్యి" అని చెప్పింది.
దొంగలు "ఎవర్రా, ఈ పోలీసు ఎవరో మన ప్రాణానికి ఇలా చుట్టుకున్నది? మనం శ్రమపడి దొంగిలించిన గొర్రెల్ని కూడా కొట్టేసింది? ఈమె పని చెప్పాలి. ఈ రోజు రాత్రికే ఈమెని తుదముట్టించుదాం" అనుకున్నారు.
అయితే ఆ సంగతి ముందుగానే ఊహించిన సుధ అవ్వనడిగి కారంపొడి, కత్తి తీసుకొని ప్రక్కనే పెట్టుకొని ఉంటుంది. రాజుతో తడకలు అల్లించుకొని ఇంటి చుట్టూ కట్టేసి, ఒక్క చోటమాత్రం రంధ్రం విడిచి పెట్టి ఉంటుంది. ఆరోజు రాత్రి ఆమెను చంపేసేందుకని వస్తారు దొంగలు- గుడిసె చుట్టూ ఎంత తిరిగినా లోపలికి పోయేందుకని తలుపు కనిపించదు- ఒక్క చోట మాత్రం రంధ్రం కనబడుతుంది.
'గుడిసెలో ఎక్కడా లేని బొక్క ఇక్కడ ఎందుకురా, ఉంది?' అని మొదటి దొంగ బొక్కలోంచి తల లోపలికి పెట్టి చూస్తాడు. అందుకోసమే సిద్ధంగా ఉన్న సుధ వాడి ముక్కు పట్టుకొని కోసేసి కారం పొడి వేస్తుంది. వాడు గట్టిగా 'అమ్మా,అమ్మా' అని మొత్తుకుంటే, మిగిలినవాళ్లంతా 'ఏమిటిరా, ఏమైంది' అని అరుస్తారు. 'నువ్వు చూడు-నువ్వు చూడు' అంటాడు తప్పిస్తే, వాడు ఎవ్వరికీ ఏమీ చెప్పడు. అలా ఒక్కొక్కళ్ళూ తల లోపలికి పెట్టటం, సుధ వాళ్ల ముక్కు కోసేసి కారంపొడి వెయ్యటం- చివరికి అందరూ ముక్కులు పట్టుకొని అరుచుకుంటూ పారిపోతారు.
దాంతో దొంగలకు చాలా కోపం వస్తుంది. వాళ్లలో కొత్తగా చేరిన అవ్వ కొడుకు మాత్రం 'నేనింక మీతో ఉండను- వెనక్కి వెళ్ళిపోతాను' అంటాడు. దొంగలందరూ వాడితో మంచిగా మాట్లాడి 'ఈ ఒక్క సారికీ ఆగు. మనందరం కలిసి ఒక్క పోలీసు పని పట్టలేమా? రేపు రాత్రి ఆ పోలీసు నిద్రపోతుండగానే ఎత్తుకుపోదాం' అనిచెప్పి వాడిని ఒప్పిస్తారు.
అయితే సుధకు వాళ్ళు మళ్ళీ ఎలాగూ వస్తారని తెలుసు. అందుకని ఆమె ఆ రోజు రాత్రి తెల్లచీర కట్టుకొని జుట్టు విరబోసుకొని మంచం మీద హాయిగా నిద్రపోతుంది. దొంగలు మెల్లగా లోపలికి వచ్చి చూస్తారు. చీకట్లో వాళ్లకి ఏమీ కనిపించదు; కానీ మంచం మీద ఎవరో ఉన్నారు అని మాత్రం తెలుస్తుంది. వెంటనే వాళ్ళు ఆ మంచాన్ని నాలుగువైపులా పట్టుకొని బయలుదేరతారు- ఊరి బయట చెరువులోకి ఎత్తి పడేద్దామని. వాళ్ళు అట్లా మంచాన్ని ఎత్తుకొని పోతూ ఉంటే, ఆ కుదుపులకు సుధకు మెలకువ వస్తుంది.
'ఓహో ఇట్లా ఉందా, వీళ్ల పని?' అని ఆమె వాళ్ళు నలుగురి జుట్టూ తీసుకొని, మంచానికి చక్కగా ముడివేసి పెడుతుంది. వాళ్ళు నడుస్తూంటే జుట్టు కదిలినప్పుడల్లా నొప్పి పుడుతుంటుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు 'ఏమోరా, ఈ పోలీసు- ఇంత బరువు! ఇది పోలీసా దయ్యమా?' అనుకుంటూ అతి కష్టంగా ఎత్తుకుపోతారు. దారిలో వాళ్ళు ఒక మర్రి చెట్టు క్రిందినుండి పోతూ ఉన్నప్పుడు, పైనుండి అందిన ఊడల్ని పట్టుకొని సుధ చెట్టెక్కి పోయి మర్రిచెట్టు మీద కూర్చొని ఉంటుంది. వాళ్ల జుట్లు ముడివేసి ఉండటం వల్ల మంచం బరువు తగ్గినా గుర్తించలేరు వాళ్ళు. అట్లా ఇంకొంచెం ముందుకి పోయి, ఎలాగో ఒకలాగ చెరువులోకి పడేస్తారు మంచాన్ని. ఆ మంచంతో పాటు వాళ్ళూ పడతారు చెరువులో! అట్లా ఎందుకయ్యిందో కూడా వాళ్లకు అర్థం కాదు. 'అయ్యో ఎంత పొరపాటురా' అని అరుచుకుంటూ మంచం నుండి విడిపించుకొని, నీళ్ళలో ఈదుకుంటూ బయటికి వచ్చి మర్రిచెట్టు క్రింద కూర్చుంటారు.
అంతలోనే సుధ పెద్దగా అరుచుకుంటూ చెట్టు పై నుంచి దూకుతుంది వాళ్ల మధ్య! వాళ్ళు 'బాబోయ్! దయ్యం వచ్చిందిరా!' అని దిక్కుకు ఒకరు పారిపోతారు.
సుధ నవ్వుకుంటూ ఇంటికి పోయే సరికి అవ్వ మనవడు తడిసి ముద్దయి ఇల్లు చేరుకొని ఉంటాడు ముక్కుకి పట్టీ వేసుకొని. అవ్వ, సుధ, రాజు అందరూ వాడికి మంచి బుద్ధులు చెప్పి , సరైన దారిలో నడిపిస్తారు.