హిరణ్య కశిపుడు చాలా పెద్ద రాక్షసుడు. ప్రపంచం మొత్తాన్నీ అదుపులోకి తెచ్చుకోవటం అంటే చాలా ఇష్టం, వాడికి. దానికోసం వాడు తనకు చేతనైన ప్రయత్నాలన్నీ చేశాడు: అన్ని లోకాలనూ గెలిచేశాడు; అన్ని దిక్కుల పాలకుల్నీ పాదాక్రాంతం చేసుకున్నాడు; గాలినీ, నిప్పునీ, నీళ్ళనీ, భూమినీ, ఆకాశాన్నీ- అన్నిటినీ వశం చేసేసుకున్నాడు. అందరూ తను చెప్పిన మాటే వింటున్నారు- తననే పూజిస్తున్నారు దేవుడిలాగా.
అయినా ఏదో వెలితి!
"వీళ్ళంతా ఏదో ఒకనాడు తనకు ఎదురు తిరగచ్చు..!
తనే చనిపోవచ్చు..!
ఇంత గొప్ప వ్యక్తి- తనూ చనిపోవాల్సిందేనా, సామాన్యులలాగా!? తనకు 'చావు' అనేదే లేకపోతే ఎంత బాగుంటుంది! కుదరదు- తను ఎన్నటికీ చనిపోకూడదు"
ఉపాయం ఆలోచించాడు-
"ఈ శక్తి తనకు ఇవ్వగలిగేది ఇద్దరే- బ్రహ్మ, విష్ణువు. ఆ విష్ణువు అల్లరి వాడు- నీతి నియమాల పట్టింపులు ఎక్కువ. అతనికంటే బ్రహ్మే నయం. ప్రాణులన్నిటినీ సృష్టించే శక్తి బ్రహ్మకే ఉంది, నిజానికి. తను ఇప్పుడు ప్రసన్నం చేసుకోవలసింది ఆ శక్తినే..."
"కానీ ఈ బ్రహ్మ కూడా నేరుగా చావు లేకుండా వరం ఇమ్మంటే ఇవ్వడు. మరెలాగ, ఏదో ఒకటి చెయ్యాలి..!"
తపస్సు చేశాడు, బ్రహ్మను గురించి: సృష్టికర్త తన విధి నిర్వహణలో ఏమేం చేస్తాడో వాటినన్నిటినీ అతి సూక్ష్మం వరకూ అర్థం చేసుకునేశాడు- "ఇప్పుడిక తన దారికి రావలసిందే, ఎంతటి బ్రహ్మ అయినా!"
నిజంగానే వచ్చాడు సృష్టికర్త. రాక్షసుడి ముందు నిలబడి, "ఏం కావాలో కోరుకో, ఇచ్చేస్తాను" అన్నాడు.
"నాకు చావు లేకుండా చెయ్యి!" అన్నాడు హిరణ్య కశిపుడు.
"కుదరదు బాబూ! అదొక్కటీ వీలవదు. వేరే ఏదైనా అడుగు- ఇస్తా" అన్నాడు బ్రహ్మ.
"ఓహో! ఇట్లా ఉందా, నీపని! నేను ముందుగానే ఆలోచించి పెట్టుకున్నానుగా? ఇప్పుడు అడుగుతాను చూడు-" అనుకున్నాడు రాక్షసుడు.
"గాలిలో గాని, భూమి మీద గానీ, మంటలోగాని, నీళ్లలోగాని, ఆకాశంలో గాని, ఏ దిక్కులోగాని, రాత్రి గాని, పగటిపూటగాని, బలం ఉండే పెద్దా-చిన్న జంతువుల చేతగాని, మనుషులు-దేవతలు, లేదా మరే ఇతర జంతువులచేత గాని, ఏలాంటి ఆయుధాలతో గాని మరణం లేకుండా వరంఇవ్వు. అంతే కాదు, నాకు ఎదురులేని శౌర్యాన్నీ, దిక్పాలకులను మించిన బలాన్నీ, మూడులోకాలపైనా గెలుపునూ ప్రసాదించు!" అన్నాడు.
సృష్టి నిర్ఘాంతపోయింది ఈ తెలివికి- అయినా సరే, కానిమ్మంది. రాక్షసుడు కోరిన వరం ఇచ్చేసింది.
ఇంకేముంది? హిరణ్య కశిపుడికి అడ్డులేకుండా పోయింది. ఇంక తనకి చావే లేదని ధైర్యం వచ్చేసింది. సృష్టికర్తనే బురిడీ కొట్టించానని పొంగిపోయింది మనసు. గర్వం, కాఠిన్యం, అతిశయం- అన్నీ వచ్చి చేరుకున్నై. ప్రపంచం అల్లాడి పోయింది. రాక్షసుడు ప్రకృతి నియమాలన్నిటినీ మార్చేశాడు- గతి తప్పి పోయింది సృష్టి. రాత్రింబవళ్ళు, ఋతువులు, కాలాలు- అన్నీ హిరణ్యకశిపుడు ఎట్లా చెబితే అట్లా వస్తున్నాయి. శ్రమ లేకుండా, అన్ని శక్తులూ రాక్షసుల స్వాధీనం అయిపోయాయి.
అయినా ప్రకృతికి, పాపం కష్టం వేసింది. రాక్షసుడిని వేధించేందుకు ఒక కొడుకు పుట్టాడు. ఈయన అవునంటే వాడు కాదనటం మొదలు పెట్టాడు. నీతి నియమాల గురించి- వయసును మించి మాట్లాడుతున్నాడు వాడు. ప్రకృతి నియమాలను మనకి తగినట్లు మార్చుకోవటం కాక, వాటికి లోబడి ఉంటేనే బాగుంటుందనటం మొదలు పెట్టాడు. హిరణ్య కశిపుడికి చికాకు పుట్టించాడు; విపరీతమైన వేదనకు గురి చేశాడు- ఏమంటే, రాక్షసుడు కోరిన కోరికల జాబితాలో 'సంతోషం' లేదు- అదొక్కటీ చేర్చటం మర్చిపోయినట్లున్నాడు !
చివరికి విష్ణువు మనిషీ-జంతువూ కాని నరసింహంలాగా వచ్చి, పగలూ -రాత్రీ కాని సంధ్యా సమయంలో, నేలా-ఆకాశం కాని తన తొడమీద పడుకోబెట్టుకొని, ఇంటా-బయటా కాని గడప మీద కూర్చొని, శస్త్రమూ-అస్త్రమూ కాని తన చేతి గోళ్ళతో చీల్చి చంపేశాడు హిరణ్య కశిపుడిని.
మళ్ళీ ఒకసారి ప్రకృతే గెలిచింది. సర్వ ప్రపంచాధినేతకి కూడా చివరికి తలవంచక తప్పలేదు.
విజ్ఞాన శాస్త్రపు ఆవిష్కరణల్ని లోకహితం కోసం, పొదుపుగా, జాగ్రత్తగా, బాధ్యతగా వాడుకోవటం మన చేతుల్లోనే ఉంది. జపాన్ ఫుకుషిమా అణు రియాక్టరు పేలుడు నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సి ఉన్నది: హిరణ్యకశిపుడిలాగా పొగరుమోతుతనానికి పోయి అన్నీ పోగొట్టుకో కూడదు.
ఈ గాలి, నిప్పు, నీరు, నేల- ఇవన్నీ మనవే! మనం వీటిని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుందాం; బాధ్యతగా కాపాడుకుందాం.
అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.
-కొత్తపల్లి బృందం.