ఒక అడవిలో ఒక కుందేలు, తాబేలు ఉండేవి. ఒక రోజున కుందేలు తాబేలును ఆట పట్టించాలనుకుంది. "తాబేలూ, తాబేలూ! రేపు  మా ఇంట్లో విందు. నువ్వు ఖచ్చితంగా రావాలి" అంది.     
   "ఓఁ, అంతకంటేనా! తప్పకుండా వస్తాను" అంది తాబేలు. మరుసటి రోజున బయలుదేరి కుందేలు ఇంటికి నడుచుకొంటూ పోయింది. ఇంకా అది ఇంట్లోకి రాకనే ఎదురువచ్చింది కుందేలు. "నువ్వు లేటుగా వచ్చావు తాబేలూ! ఇప్పుడా, వచ్చేది?! నేను నీకోసం వండిన  పాయిసం అంతా అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా వస్తే తొందరగా రా!" అన్నది. తాబేలు సిగ్గు పడింది.  ఖాళీ కడుపుతోనే   వెళ్లిపోయింది.      
   ఆ తర్వాత ఒకరోజున తాబేలు కుందేలుతో "రేపు మా ఇంట్లో విందు. తప్పకుండా రా" అన్నది. కుందేలు సరేనంటూ ఇంటికి పోయింది.     
   "నేను ఇదివరకు దీన్ని మోసం చేశాను గదా, ఇప్పుడు ఇది కూడా నన్ను మోసం చేస్తుందేమో.  తొందరగా వెళ్ళి కూర్చుంటాను. దాని వంట తీరునూ చూసినట్లుంటుంది" అనుకున్నది.      
   ప్రొద్దున్నే పరుగులు  పెట్టుకుంటూ  తాబేలు ఇంటికి రాబోయింది.  దారిలో దాని కాళ్లకు బురద అంటుకున్నది. "అయ్యో! నా కాళ్ళకు బురద అంటిందే! ఇంత తెల్ల చొక్కా వేసుకొని విందుకు బయలుదేరితే ఇట్లా అయిందేమి?" అని వెనక్కితిరిగి ఇంటికి పోయి, కాళ్ళు కడుక్కొని మళ్ళీ   పరుగు పెట్టింది. అంతలోనే మళ్ళీ బురద అంటుకున్నది. "ఛీ! ఛీ! ఇట్లా బాగాలేదు- విందుకు ఇంకా చాలా సమయం ఉందిగా, మళ్ళీ వెళ్ళి కడుక్కుంటాను" అని మళ్ళీ ఇంటికి పోయింది. ఇట్లాగే  చాలా సార్లు అయ్యింది. ఎన్ని సార్లు బయలుదేరినా, ప్రతిసారీ  కుందేలుకు బురద అంటుతూనే ఉన్నది. చూస్తూండగానే విందు సమయం దాటిపోయింది. చివరికి కుందేలుకు ఆకలి, నీరసం, వాటిని మించి విసుగు- అనిపించింది. "కానివ్వు- ఈసారి బురద అంటినావెనక్కి తిరిగి రాను- ముందుకే పోతాను" అనుకున్నది. అట్లా తాబేలు ఇంటికి చేరుకొని  కాళ్ళు చూసుకున్నది. కాళ్లనిండా బురద! "అయ్యో! ఇట్లాంటి కాళ్లతో విందుకు ఏం పోతాను? అందరూ నన్ను చూసి నవ్వుతారు. నేను వెనక్కి తిరిగి పోవటమే మంచిది" అని ఇంట్లోకి పోకుండానే  వెనక్కి తిరిగింది కుందేలు. అంతలో దానికోసమే ఎదురు చూస్తున్న తాబేలు బయటికి వచ్చి, "అయ్యో! ఇంత ఆలస్యమయిందేమి? రా! రా! కాళ్ళు కడుక్కో, పాపం ఎక్కడెక్కడో నడిచి వచ్చినట్లున్నావు" అని కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇచ్చింది.  కుందేలును ఇంటిలోకి తీసుకుపోయి  పోయి చక్కని విందు చేసింది.     
   తన మనస్తత్వాన్నీ, తాబేలు మంచితనాన్నీ తలచుకొని సిగ్గు పడింది కుందేలు.  అటుపైన అది నిజంగానే తాబేలుకు మంచి నేస్తమైంది.
