చంద్రగిరి ప్రక్కన వెంకటాపురం అనే పల్లెలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతని  భార్య సరోజమ్మ. ప్రిత్రార్జితంగా వచ్చిన కుంట పొలం తప్ప, వేరే  ఆస్తిపాస్తులేమీ లేవు వాళ్ళకు. తన పొలంలో పని లేనప్పుడు ఇరుగు పొరుగు పొలాల్లో కూలికి వెళ్ళేవాడు సీతయ్య. ఇక సరోజమ్మేమో  గుట్టల మీద, గట్ల మీద పెరిగే గడ్డిని కోసి, కట్టలు కట్టి, పట్నంలో అమ్మేది. అయినా వాళ్లకు, వాళ్ల ఇద్దరు  పిల్లలకు మూడు పూటలా తిండికి జరగడానికి కష్టంగానే ఉండేది.    
   ఒకరోజు సీతయ్య పొలం నుండి ఇంటికి వచ్చేప్పటికి, అతని ఇంటి ముందు ఒక ఆవు కట్టేసి ఉంది! సీతయ్య ఆ  ఆవు దగ్గరకు వెళ్ళి " ఆహా! ఎవరిదో ఈ ఆవు. ఇది నాదైతే తిరుపతి కొండకి నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోనూ? " అని అప్రయత్నంగా అనేశాడు.      
   అంతలో భర్తను చూసిన  సరోజమ్మ  బయటకు వచ్చింది.      
   "ఎవరిదీ ఆవు, సరోజా!" అని అడిగాడు సీతయ్య.       
   "మన ఇంటి ముందున్న పచ్చగడ్డిని తినడానికి వచ్చింది.  చుట్టుప్రక్కల అందరినీ విచారించాను. 'ఎవరైనా అడుగుతూ వస్తే ఇవ్వొచ్చులే' అని కట్టేశాను" అంది సరోజమ్మ.     
   నెల రోజులు గడిచాయి. కానీ   ఆవు కోసం  ఎవరూ రాలేదు!  రోజూ సరోజమ్మే, దానికి  గడ్డి, నీరు పెట్టడం, సంరక్షించటం, పాలు పితికి అమ్ముకోవటం  చేస్తోంది.     
   సరోజమ్మ సంతోషంగానే ఉంది గానీ, ఆ ఆవు వచ్చిన రోజు నుంచీ ఎందుకో సీతయ్యకు మనసులో దిగులుగా ఉంటోంది.  'ఈ ఆవు నాదైతే కొండకు వస్తానని మొక్కుకున్నాను కదా! మొక్కు తీర్చుకోకపోవటంవల్ల నాకు దిగులుగా ఉందేమో!' అనుకుని, మర్నాడే మొక్కు తీర్చుకోవడానికి కొండకు నడవడం మొదలుపెట్టాడు.      
సాయంత్రం చీకటి పడే వేళకు కొండ మీదకు చేరుకున్నాడు.  రాత్రికి సత్రంలో బస చేశాడు.       
   ఆ రాత్రి అతనికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించాడు- "సీతయ్యా! ఏదో ఆవు నీ దగ్గరికి వస్తే, కనీసం అది ఎవరిదో  కూడా విచారించకుండా మీ ఇంట గాటకు కట్టేసుకున్నావు.  నువ్వు విచారించలేకపోతే పాయె- కనీసం  గ్రామాధికారికైనా ఆవుని అప్పగించాలి కదా!" అన్నాడు.      
   దిగ్గున లేచి కూర్చున్నాడు సీతయ్య. వేకువనే స్వామి దర్శనం ముగించుకుని ప్రసాదంతో ఇంటికి చేరాడు.  ఆవుతో బాటు కొంచెం  ప్రసాదాన్ని కూడా తీసుకొని గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు.  జరిగిన విషయాన్నంతా దాచకుండా చెప్పాడు ఆయనకు. గ్రామాధికారి సీతయ్యను మెచ్చుకొని ఆ ఆవుని ఊరి  బందెలదొడ్డిలో కట్టేయించాడు.      
   కొన్నాళ్ళు గడిచాయి. సీతయ్య, సరోజమ్మ ఆ ఆవు సంగతి దాదాపు మరచే పోయారు. అకస్మాత్తుగా  ఒకరోజున చంద్రగిరి  జమీందారుగారు  మేనాలో సీతయ్య ఇంటికి వచ్చారు, గ్రామాధికారిని వెంట బెట్టుకొని. ఊరి జనం అంతా ఆయన్ని చూసేందుకని సీతయ్య ఇంటి ముందు గుమిగూడారు. 
జమీందారుగారు మేనా దిగి వచ్చి  సీతయ్యను ఆదరంగా దగ్గరకు తీసుకొని "సీతయ్యా! మీ ఇంటికి చేరిన ఆవు మా మందలోనిది.  జరిగిన సంగతులన్నీ చెప్పారు గ్రామాధికారిగారు.  నువ్వు నిజాయితీపరుడివి  కనుకనే స్వామి నీకు కలలో కనిపించాడు. ఇదిగో! నీ మంచితనానికి, భక్తి  శ్రద్ధలకు మెచ్చి మేం ఇచ్చే చిన్న కానుక-ఈ డబ్బు తీసుకుని రెండు ఆవులను కొనుక్కో" అని డబ్బు మూటను సీతయ్య చేతిలో పెట్టారు.     
   సీతయ్య జమీందారుగారికీ, గ్రామాధికారికీ  కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. జమీందారు గారు ఇచ్చిన డబ్బుతో  రెండు ఆవులను తెచ్చుకొని సుఖంగా జీవించాడు.
