అనగనగా  సంగాపురం అనే ఊళ్ళో  రామయ్య , సీతాలు   అనే  దంపతులు   ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక కొడుకు. వాడి పేరు గిరి.  వాళ్ళది   చాలా  బీద  కుటుంబం.  భార్యా   భర్తలు   ఇద్దరూ  కష్టపడి     పని    చేసేవాళ్ళు. ఏ పూటకాపూట   భోజనం  సమకూర్చు-కునేవాళ్ళు. కూలి    పనికి  పోయినప్పుడు  పిల్లవాడిని  కూడా వెంటబెట్టుకు పోయే వాళ్ళు.     
   గిరి చాలా చురుకైన పిల్లవాడు.  ఊళ్లో   పిల్లలందరూ  బడికి   పోవడం  చూసాడు వాడు. "నన్ను   కూడా  బడికి   పంపండి నాన్నా!"అని వేధించటం మొదలుపెట్టాడు.  "తినడానికి   తిండే  లేదురా, ఇంక నిన్ను బడికి  ఎక్కడ   పంపేది?!"అన్నాడు రామయ్య. అయితే సీతాలు కూడా   బడివైపే మొగ్గు చూపింది: "గిరిని    బడికి   పంపుదాం! ప్రభుత్వ     బడిలో    ఫీజులు    కట్టవలసిన  పనిలేదు- పైపెచ్చు  మధ్యాహ్నం  భోజనం  కూడా  పెడతారు-  పంపుదామయ్యా!"అన్నది.  'సరేలే, పంపుదాం' అని తను  కొంచెం తగ్గి, గిరిని   బడిలో   చేర్పించాడు రామయ్య.      
   బడిలో    ఉపాధ్యాయులు    చెప్పిన     పాఠాలను    ఏకాగ్రతతో    విని, ఎప్పటికప్పుడు నేర్చేసుకునేవాడు గిరి. పెద్దవుతున్నకొద్దీ అతనిలో మంచి లక్షణాలు కూడా పెరిగాయి: చాలా  మంచి పిల్లవాడు అని పేరు తెచ్చుకున్నాడు. అమ్మ-నాన్నలు, టీచర్లు, పెద్దలు చెప్పిన మాట వినేవాడు. అణకువ,  వినయ-విధేయతలు ఉన్నై- ఆలోచించి, ధైర్యంగా ప్రశ్నించే శక్తి ఉన్నది.  పాఠశాలకు       క్రమం    తప్పకుండా   పోతాడు,  అబద్ధాలు  చెప్పడు-  ఏరోజు   పాఠాలు ఆరోజు చదువుకుంటాడు. క్లాసులో   ఎప్పుడూ  కూడా  అందరి కంటే  మొదటివాడుగా   ఉండేవాడు.  చూస్తూండగానే వాడు  ఐదవతరగతి      పూర్తి      చేశాడు.  ఆరవతరగతి   హైస్కూల్లో    చేరాలి..      
   కానీ   రామయ్య  "ఇక చాలు" అన్నాడు. "నా  ఆరోగ్యం  బాగా లేదు గిరీ! నువ్వు   చదువు  మానేసి, ఏదైనా  కూలిపనికి పోవలసిందే" అన్నాడు. గిరికి మాత్రం   చదువుకోవాలన్న   కోరిక   బలంగా  ఉంది- వాళ్ల బడిలో టీచర్లందరూ వచ్చి చెప్పినమీదట, రామయ్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు. బడికి    పోయే    లోపల   గిరి  వార్తా పత్రికల్ని ఇళ్లకు చేరవేసేవాడు, పాల ప్యాకెట్లు వేసేవాడు. అలా సంపాదించిన డబ్బులతో పరీక్ష ఫీజులు కట్టుకునేవాడు.     
అన్ని    క్లాసుల్లోను మొదటి    ర్యాంకు   సాధిస్తూనే వచ్చాడు- పదవతరగతిలో   జిల్లా ఫస్టుగా నిలిచాడు! రామయ్య, సీతాలు  సంతోషించారు. కానీ వాళ్ల ఆర్ధిక పరిస్థితి ఇంకా అలాగే ఉంది- గిరిని పై చదువులు చదివించటం ఎలాగ? చివరికి    వాడు దగ్గర్లోనే ఉన్న  ప్రభుత్వ  కళాశాలలో  చేరాడు. పాల ప్యాకెట్లు, దిన పత్రికలు  ఇంటింటికీ చేరవేసే పనిని కొనసాగించాడు.  అలాగే    ఎవరైనా   ఏదైనా  పని   చెప్పినా   కూడా  చేసేవాడు.        
   పరీక్షల సమయం దగ్గర పడింది. యంసెట్ పరీక్ష  ఫీజు  కట్టాలి. సరిగ్గా అదే  సమయంలో  గిరికి    ఆరోగ్యం   బాగాలేక, ఇబ్బంది  ఏర్పడింది.  దానికి తోడు  పరీక్ష  ఫీజు   కట్టడానికి    డబ్బు    చిక్కలేదు. తను  రోజూ   పేపరు, పాలు   ఇచ్చే  ఇళ్ళలో ఎక్కడైనా అప్పు అడుగుదామనుకున్నాడు. కానీ  ఎవరేమం-టారో  అని   సందేహం! చివరి తేదీ  దగ్గర   పడుతున్న   కొద్దీ   అతనికి    అదొక   పెద్ద   సమస్యగా  మారింది.        
   వరాలయ్యగారి  ఇంట్లో రోజూ పేపరు వేస్తుంటాడు తను.  వాళ్ళు   తనని   ఆదరంగా  పలకరిస్తుంటారు. అందులోనూ    ఆయన  భార్య  కమలమ్మ గారి   మనస్సు మంచిది.  తరచూ తనకు ఏదైనా  ఫలహారం    పెట్టి   కన్నతల్లిలా   పలకరిస్తుంది. కానీ వరాలయ్యని   చూస్తేనే    గిరికి   భయం- ఎప్పుడూ    రుసరుసలాడుతుంటాడు.  వాళ్ళని అడిగితే..?       
   గిరికి   ఏమి  చేయాలో  తోచలేదు- మరునాడే ఫీజు చెల్లించేందుకు  ఆఖరు తేదీ. ఇక తప్పదన్నట్లు  ధైర్యం   చేసాడు. వసారాలో నిలబడి పేపరు అందుకున్న    వరాలయ్యను  అప్పు  అడిగాడు- ఎలాగో ఒకలా ఆ అప్పు   చెల్లించుకుంటానని  ప్రాధేయపడ్డాడు. "నా దగ్గర   ఒక్క  పైసా  కూడా  లేదు" అని  మొండిగా మాట్లాడాడు వరాలయ్య. "ఈ పిల్లలందరూ ఇంతే- డబ్బులు తీసుకుంటారు; తర్వాత అప్పు ఎగగొట్టి మాయమైపోతారు" అని  తిట్టుకుంటూ   లోపలికి    వెళ్ళిపోయాడు.       
   గిరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.  'వాళ్ళుఅయితే  కాదనరు' అనుకున్నాడు వాడు- వాళ్ళే ఇంత చిన్నబుచ్చుతారని అనుకోలేదు. అయితే  భర్త   ఎవరినో   కేకలు వేస్తుండటం విని, కమలమ్మ    బయటికి    వచ్చి   చూసింది. కళ్ళ నిండా   నీళ్ళు    పెట్టుకొని  గిరి నిలబడి  ఉన్నాడు. సంగతి అర్థంకాగానే ఆమెకు జాలి వేసింది. 'ఇప్పుడే ఇచ్చేస్తాను- ఉండు  నాయనా!'  అని   లోపలికి   వెళ్ళి   పరీక్ష  ఫీజు   తెచ్చి   ఇచ్చింది. "ఇదివరకు వరాలయ్యగారి సహాయం పొందిన వాళ్ళంతా ఆ అప్పు చెల్లించటం సంగతి అటుంచి, మళ్ళీ మొహం కూడా చూపించలేదు బాబూ! ఆయన గట్టిగా మాట్లాడారని నువ్వేమీ అనుకోకు- ఈ డబ్బు తీసుకో- నీకు వీలైతే, ఎప్పటికైనా  తిరిగి ఇవ్వు- ఈ డబ్బుని మాత్రం మంచిపనికే వాడు నాయనా- అంతే, మేం కోరుకునేది" అన్నది.      
   గిరి సిగ్గుపడుతూనే ఆమెకు మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నాడు. డబ్బులు తీసుకొని, ఆమెకు  నమస్కరించి   వెళ్ళిపోయాడు. ఆవిడ అన్న ఆ కాసిని మాటలు గిరి మనసులో నాటుకు పోయాయి. తను మాత్రం వీళ్ళ ఋణం ఉంచుకోడు- ఎలాగైనా సరే వీళ్ళ అప్పు తీర్చేస్తాడు'      అనుకున్నాడు. బాగా   చదువుకొని   మంచి    మార్కులు   తెచ్చుకున్నాడు. మెడిసిన్లో సీటు  సంపాదించాడు. సొంత ప్రతిభతో స్కాలర్షిప్పు  కూడా  తెచ్చుకున్నాడు. మంచి   డాక్టరయ్యాడు; ఇంటి పరిస్థితిని చక్కదిద్దాడు. వాళ్ళ నాన్న  ఆరోగ్యం  బాగు చేశాడు. వాళ్ళ ఊళ్ళోనే ఆసుపత్రి నిర్మించి బీద ప్రజలకు ఉచితంగా వైద్యం చెయ్యాలనుకున్నాడు.    
ఊళ్ళోకి రాగానే ముందుగా వరాలయ్యగారి ఇంటికి వెళ్ళాడు. "అమ్మా! ఇదిగోండి- మీరు నాకిచ్చిన డబ్బులు, వడ్డీతో సహా మీకు తిరిగి ఇవ్వాలని వచ్చాను.  ఆనాడు మీరు నన్ను నమ్మి, నాకు డబ్బు సాయం చేయకపోతే నేను ఏం చేసేవాడినో, తెలీదు. నా జీవితాన్ని నిలబెట్టింది మీరే.  మీకు ఏమిచ్చినా నా ఋణం తీరదు" అన్నాడు. గిరిని చూసి కమలమ్మ చాలా సంతోష పడింది- "ఈ డబ్బులు మాకు ఇవ్వనక్కర్లేదు బాబూ! నీ దగ్గరే ఉండనీ. నువ్వే వీటిని సద్వినియోగం చెయ్యి.   మంచితనమూ, తెలివి తేటలూ  ఉండి కూడా ఎంతమంది పిల్లలు తమ  పేదరికం కారణంగా  చదువులు మానేస్తున్నారో, తెలీదు. అలాంటివాళ్ళకు కనీసం ఒక్కరికైనా ఈ డబ్బు ఉపయోగపడిందని మాకు చాలా సంతృప్తిగా ఉన్నది.  ఈ డబ్బుతో ఇప్పుడు ఇంకొకరికి ఎవరికైనా సాయం చెయ్యి. మేం తరించినట్లవుతుంది" అన్నది.       
   ఆవిడ ఇచ్చిన స్ఫూర్తితో గిరి ఊళ్ళో ఆసుపత్రి నిర్మించటమే కాక, పేద పిల్లలకు ఉపయోగపడేలా ఎన్నో మంచి పనులు చేపట్టాడు.
