అనగా అనగా ఒక ఊళ్లో ఒక అవ్వ, తాత ఉండేవాళ్ళు. వాళ్ళకి పిల్లలు లేరు. ఒక మునక్కాయ తోట మాత్రం ఉండేది.
రోజూ అవ్వ తోటలోని మునక్కాయలు కోసుకునేది. ఒక రోజున అవ్వ ఒక మునక్కాయను కోయబోతుంటే "అవ్వా!అవ్వా! నన్ను కోయబాకవ్వా!" అని వినిపించింది.
అవ్వ అటూ-ఇటూ చూసింది.
"అవ్వా! అటూ-ఇటూ చూడబాకవ్వా! నువ్వు కోసే మునక్కాయనవ్వా!" అంది ఆ గొంతు.
అయినా అవ్వ ఆ మునక్కాయను కోసుకుని ఇంట్లో పెట్టుకుంది.
"మునక్కాయా!మునక్కాయా! నువ్వు ఇక్కడే ఉండు. నేను పోయి తాతకు అన్నం ఇచ్చేసి వస్తాను" అంది.
అవ్వ తాతకు అన్నం ఇచ్చేసి వచ్చింది. మునక్కాయ అంత సేపూ ఇంటికి కాపలా కాసింది.
ఇట్లా ఉంటే ఒక రోజు అవ్వకు ఒంట్లో బాగాలేదు. "మునక్కాయా, మునక్కాయా! నువ్వు పోయి తాతకు అన్నం ఇచ్చి రావా!" అంది అవ్వ.
"సరే" అని మునక్కాయ తాతకు అన్నం ఇచ్చేసి రాను పోయింది.
పోయి తాత దగ్గరున్న మడక తీసుకొని సాయంత్రం దాకా దున్నుతూ ఉంది.
చీకటి పడింది- మునక్కాయ ఇంక ఇంటికి పోదామనుకుంటున్నది. ఇంతలో దొంగలు వచ్చి ఎద్దులను కాస్తా తోలుకొని వెళ్ళారు.
మునక్కాయ తాత దగ్గరకు పోయి "తాతా!తాతా! ఎద్దులను దొంగలు తోలుకుని వెళ్ళారు. అయినా మీరేమీ బాధ పడకండి. నేను పోయి వెనక్కి తోలుకుని వస్తాను" అంది. అలాగే అవ్వ దగ్గరకు వెళ్ళి "దార్లో తినేకి నాకు మురుకులు నాలుగు కాల్చి ఇవ్వు" అని అడిగింది. అట్లాగే అవ్వ నాలుగు మురుకులు కాల్చి ఇచ్చింది.
మురుకులు తీసుకొని పోతూవుంటే దారిలో మునక్కాయకు ఒక ఎండ్రకాయ కనిపించింది. "మునక్కాయా!మునక్కాయా! నాకు కొంచెం మురుకులు పెట్టవా!" అంది. "నాకు సహాయం చేస్తే ఇస్తాను" అంది మునక్కాయ. రెండూ కలసి బయలుదేరాయి.
కొంత దూరం వెళ్ళాక వాటికొక తేలు కనిపించింది. "మునక్కాయా! మునక్కాయా! నాకు కొంచెం మురుకులు పెడతావా!" అంది తేలు.
"అయితే నాతో కూడారా" అంది మునక్కాయ.
తరువాత ఒక చీమ ఎదురైంది. అదికూడా మునక్కాయను అలాగే అడిగింది.
అన్నీ కలసి దొంగల ఇంట్లో చేరాయి. అప్పుడు పోయి ఎండ్రకాయ గుమ్మంలోను, చీమ లైటు స్విచ్చి దగ్గర, తేలు వంట ఇంటిలో దాక్కున్నాయి. అంతలో దొంగలు ఇంట్లోకి రాబోయారు.
గుమ్మం దగ్గర కూర్చున్న ఎండ్రకాయ మొదటి దొంగను కరిచింది.
స్విచ్చి దగ్గర కూర్చున్న చీమ రెండవ దొంగను కుట్టింది.
వంట ఇంట్లో దాక్కున్న తేలు వచ్చి మూడవ దొంగను కుట్టింది.
మునక్కాయ వచ్చి అందరి తలల మీదా తలా ఒక దెబ్బ వేసింది. దాంతో దొంగలంతా భయపడి ఎద్దుల్ని అక్కడే వదిలేసి పారి పోయారు.
మునక్కాయ మురుకులను ముగ్గురికీ పంచింది. సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.
నలుగురూ కలసి ఎద్దులను ఇంటికి తోలుకొని పొయ్యారు.
అవ్వ, తాత మునక్కాయను మెచ్చుకొని కొడుకులా చూసుకున్నారు.