అప్పుడు హంసలు రెండూ కూడా విచారపడి, కొంచెం ఆలోచించి- "ఇదెట్లా వీలౌతుంది?  ముక్కున కరచుకొని పోవాలి, లేకపోతే రెక్కలమీద ఎక్కించుకొని పోవాలి.  ఈ రెండూ మావల్ల అయ్యే పనులు కావు.  మేము దూరదేశాలకు పోవలసిన వాళ్లం.  సాహసం పనికిరాదు.  ఎటు పోయి ఎటు వస్తుందో తెలియదు.  మా మాట విను- మనసును గట్టి చేసుకొని, నీ స్థానంలో నువ్వు, కదలకుండా ఉండిపో.  అదృష్టం బాగుంటే మళ్ళీ కలుస్తాం" అని ఎన్నో రకాలుగా చెప్పాయి.  అయినాకూడా తాబేలు తను పట్టిన పట్టును వదలలేదు.  "నన్నూ మీ వెంట తీసుకొని పోండి" అని పీడించింది వాటిని.      
   చివరికి అవి నిస్సహాయతతో మరికొంత ఆలోచించి, "ఒక దారి కనబడుతున్నది- మనసుకి కొంచెం సరిపోయేట్లు తోస్తున్నది.  ఏదైనా ఒక కట్టె ముక్కను సంపాదించి, దాని చివరలను చెరొక ప్రక్కనా ముక్కుతో కరచిపట్టుకొని పరుస్తాం- నువ్వు ఆ కట్టెను మధ్యలో జాగ్రత్తగా పట్టుకొని, వ్రేలాడుతూ రాగలవా? ఏమరు పాటు కూడదు, మరి?" అన్నాయి.     
   "ఓఁ.. దానిదేముంది?!" అని సంతోషంతో ఉబ్బిపోయింది తాబేలు.  ఆ కట్టెను పట్టుకొని మధ్యలో వ్రేలాడుతూ పోయింది.     
   అట్లా ఆ హంసలు రెండూ తమ ముక్కుల్లో కట్టెపుల్లను పొందు పరచుకొని ఆకాశంలో వేగంగా ఎగురుతూ పోతుంటే, క్రింద ఒక పట్టణంలో జనాలు వీటిని చూసి ఆశ్చర్య పడి, గందరగోళంగా అందరూ వీధుల్లో చేరి అరుస్తూ, గంతులు వేస్తూ, పైకి చేతులెత్తి చూపుతూ, చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ, హడావిడి చేయటం మొదలు పెట్టారు.     
హంసలు వాళ్ళనెవరినీ పట్టించుకోకుండా తమ దారిన తాము వేగంగా ఎగురుతూ పోయాయి- కానీ వాళ్ల సందడి బాగా వినబడేసరికి తాబేలుకు కుతూహలం హెచ్చింది.  చివరికి అది తన ఉబలాటాన్ని ఆపుకోలేక, "ఏమిటా శబ్దం?” అని తన మిత్రుల్ని అడిగేందుకని నోరు తెరచింది- ఇంకేముంది?  మరుక్షణం అది పట్టు తప్పి నేలన పడటం, క్రిందనే వేచి ఉన్న మాంసప్రియులు దాన్ని వండుకొని తినెయ్యటం వెనువెంటనే జరిగిపోయాయి!      
   అందుకని, తెలివి గలవాడు అనర్థాన్ని తెచ్చిపెట్టే పనులను అసలు నెత్తికి ఎత్తుకోనే కూడదు- ఒక వేళ అనర్థం ఏదైనా వాటిల్లినప్పుడు, కనీసం ఏదో ఒక ఉపాయంతో అపాయాన్ని తప్పించుకొనే శక్తి ఉండాలి.  అంతేకానీ, ఈ రెండూ చేయకుండా దేవుడిమీద భారం వేస్తే ముప్పు తప్పదు.  నీకొక కథ చెబుతాను, విను- అది వింటే, నా మాటల్లోని సత్యం నీకే తెలిసివస్తుంది:      
   దైవపరుడికి ఆపద : 
"అనగా అనగా ఒక కొలనులో 'అనాగత విధాత, ప్రత్యుత్పన్న మతి, అద్భవిష్యం' అనే మూడు చేపలు నివసిస్తూ ఉండేవి. ఒకరోజున అనాగత విధాత మిగిలిన రెండు చేపలతో   "ఈ ఏడాది  ఎందుకో, ఇంతవరకూ వానలు  కురవలేదు.  ఇక మీదట కూడా  కురుస్తాయని  ఆశలేదు. శకునాలన్నీ వ్యతిరేకంగానే కనబడుతు-న్నాయి. ఈ కొలనులో   నీళ్లు  పూర్తిగా  అడుగంటక ముందే తెలివి తెచ్చుకోవాలి.  ఆలస్యం  చేశామంటే  అనర్థం తప్పదు. ఇక్కడికి కొంత దూరంలో   "ధ్రువోదం" అనే చెరువొకటి  ఉన్నది. అందులో  నీళ్లు  ఎప్పటికీ  అడుగంటవని ప్రతీతి.  ఈ కొలనులోకి  నీళ్లు తెచ్చే మొరవ వచ్చేది  ఆ చెరువు నుండే! ఇంకొంతకాలం గడిచిందంటే  ఆ మొరవ కూడా ఎండిపోగలదు- అందువల్ల  ఇవాళ్ల నడిరాత్రిన, మెల్లగా ఆ మొరవలోకి  ఎగిరి, ఎలాగో  ఒకలాగ  ఆ చెరువును  చేరుకున్నామంటే  ఈ కష్టాలు  తప్పతాయి: కొంతసేపటి  క్రితం  కొందరు  జాలరివాళ్లు  వచ్చారిక్కడికి - ఈ కొలనులోని  నీళ్లను  చూసి "పదిరోజుల్లో  ఇది ఎండిపోతుంది. అప్పుడు వద్దాం" అని  ఒకరితో ఒకరు చెప్పుకుంటూ పోయారు! అది విన్నప్పటి నుండీ నా మనసు మనసులో లేదు" అన్నది.      
   అనాగత విధాత చెప్పినది  విని, ప్రత్యుత్పన్నమతి "దీనికి ఇంత ఆందోళన  ఎందుకు? అంతగా  మీదపడితే, అప్పుడే చూసుకుందాములే!"  అన్నది. ఇక  అద్భవిష్యుడైతే  ఏమీ అనను కూడా అనలేదు.     
అయినా ఆ రోజు రాత్రి చీకటి పడగానే అనాగత  విధాత కొలనులోనుండి  బయటపడి, మొరవలోకి  దూరి, మెల్ల మెల్లగా ప్రయాణించి ధ్రువోదాన్ని చేరుకున్నది.      
   రానురాను ఎండలు అధికమయ్యేసరికి, కొలనులో నీరు  ఇంకిపోసాగింది. అడుగున ఇక ఏ కొద్ది పాటి నీళ్లో  మిగిలాయి- అది గమనించిన జాలరులు  ఒకనాడు  వల, ఎత్తెల, కొడమ, గర్రె, మావు  మొదలైన సాధనాలన్నీ  తీసుకొని వచ్చిపడ్డారు. చాలా సంబరంగా కొలనులోకి  దిగి, వలవేసి, చేపలన్నిటినీ పట్టుకొనటం మొదలు పెట్టారు. అద్భవిష్యం  వలలో  చిక్కుకొని  ఎగిరెగిరి పడటంతో, వాళ్లు  దాన్ని  వేరుచేసి, చంపి, ప్రక్కన పడేశారు! 
   ప్రత్యుత్పన్నమతి అప్పటికప్పుడు ఒక ఉపాయం ఆలోచించింది. చచ్చినదానిలాగా  నీళ్లలో వెల్లకిలా పడి, తేలసాగింది. చేపలవాళ్లు దాన్ని చూసి, 'నిజంగానే చచ్చింది' అనుకున్నారు. దాన్ని తీసి నీటి అంచుకు దగ్గరగా పారేసారు.  ఆ పైన కొలనులోని చేపలన్నిటినీ ఒక్కటీ  మిగలకుండా  పట్టుకొని పోయారు. తెలివిగల ఆ చేప మెల్లగా  కొంచెం కొంచెం జరిగి, నీళ్లలో పడి, తప్పించుకొని పోయింది!"       
   ఆడ పక్షి ఈ కధను చెబితే విని,  మగపక్షి - "అయ్యో! నువ్వు  దీని కోసం అంత బాధపడవెందుకు?  'వీడువట్టి అబద్ధాలకోరు' అనుకోకు.  అవసరం  పడ్డప్పుడు  నా శక్తి సామర్థ్యాలను చూపించి, నీ మెప్పు పొందుతాను- ప్రస్తుతానికి  ఊరుకో'  అన్నది.  ఆడపక్షి  భర్తకు  ఎదురుచెప్పటం ఇష్టం కాక, ఊరుకున్నది.
ఆ తర్వాత  కొన్ని రోజులకు పక్షి  గుడ్లు పెట్టింది. అది చూసి సముద్రుడు  అనుకున్నాడు- "ఓహో!  ఈ మగపక్షి ఎన్నెన్ని మాటలన్నది! ఇప్పుడు చూపమంటాను, దీని శక్తి ఏపాటిదో!" అని  భయంకరంగా అలలు  రేపాడు. అవి నిజంగానే ఆకాశమంత ఎత్తుకు ఎగసి, ఒక్కసారిగా  చెట్టును ముంచెత్తాయి. పక్షి గుడ్లన్నీ  సముద్రుడి పాలబడ్డాయి!        
   "నేను ఎంత చెప్పినా వినలేదు కదా, నువ్వు?! చూడు  ఏమైందో! ఇక  నేనేమి చెయ్యాలి?!" అని బొటబొటా కన్నీళ్లు కార్చింది  ఆడపక్షి. మగపక్షి  దానిని  ఊరడించింది.  పక్షిజాతులను అన్నిటినీ ఒక్క చోటికి పిలిచింది.  సముద్రుడు తనను కావాలని ఏ విధంగా బాధించాడో వివరించింది: "మిత్రులారా! ఈ ప్రపంచం మొత్తాన్నీ- దాన్ని ఆవరించి ఉండే నీటితో సహా అంతటినీ-  పుక్కిలించేసేంత  పరాక్రమవంతుడు గదా, మన రాజు-గరుత్మంతుడు?! ఆ సంగతి తెలీదు కాబోలు, సముద్రుడికి.   ఇప్పుడు అతనికి ఆ సంగతి తెలియజెప్పాలి. లేకపోతే  ఇక  అతని  గర్వానికి  హద్దులుండవు. 'ఇంత చిన్న  విషయానికి  అంత  ఉద్యమం  ఎందుకు?'  అని  తీసిపారేయకండి.  ఇవాల్టికి ఇది  గోరంతనే, రేపటికి ఇదే  కొండంత  సమస్య అవుతుంది- మనందరం మనసు పెట్టి, వినతా సుతుడైన  ఆ గరుత్మంతుడిని ప్రార్థిద్దాం. ఆయనే మన ఆపదల్ని పోగొట్టి సముద్రుడికి  బుద్ధి చెబుతాడు" అన్నది.       
   పక్షులన్నీ  తమతోటి పక్షికి కలిగిన  ఆపదను, దాని స్వభావాన్ని గుర్తించినై. అన్నీ  భక్తితో  తమ ప్రభువు గరుత్మంతుడిని  ధ్యానించగానే  ఆ స్వామి ప్రత్యక్షమై "మీకందరికీ ఏదో పెద్ద సమస్యే వచ్చినట్లుంది. నన్నెందుకు  తలచుకున్నారో చెప్పండి. మీ సమస్యను పరిష్కరిస్తాను" అన్నాడు.  
తమకు సముద్రుని వల్ల  కలుగుతున్న కష్టాన్ని  వివరించినై, పక్షులన్నీ.  అది విని ఆయన చాలా బాధపడి, వెంటనే సముద్రుడిని  అక్కడికి రప్పించాడు: "వీళ్లంతా నా వాళ్లు! ఇకమీద  మా వాళ్లకెవరికీ  హాని చెయ్యకు! నీకిది  సమంజసం కాదు. ఇప్పటికి   జరిగినదాన్ని   క్షమిస్తున్నాను- అయితే  ఇకమీద  ఇటువంటివి జరగరాదు" అని సముద్రుడికి  చెప్పి, గరుత్మంతుడు  మాయం అయిపోయాడు. సముద్రుడికి అట్లా గర్వం అణిగింది"      
   -అని చెప్పింది దమనకం.      
   అదివిని ఎద్దు-సంజీవకం  "దమనకా! విను. మనం ఎల్లకాలమూ  బ్రతకం కదా! ఏదో ఒకనాడు  చావు తప్పదు. మన కళ్లముందే పుట్టి, చచ్చిపోయిన  వాళ్లు  ఎందరు లేరు? నిన్న ఉన్నవాడు  ఈరోజు ఉండాలని లేదు. ఇవాళ్ల  శత్రువుకు వెన్ను చూపవచ్చు, కానీ రేపు మృత్యువుకి  వెన్ను  చూపలేము కదా? పారిపోవటం వల్ల  అపకీర్తి  తప్ప  వేరే  ఏమి వస్తుంది? శత్రువు  బలాన్ని ఎంచక మాట్లాడే వాడిని  కాదు, నేను. ఆ శతృవు బలం చాలా  ఎక్కువ అవ్వటం వల్లనే గదా, నేను  ఇలాంటి  నిర్ణయానికి వస్తున్నది? చివరిమాట ఒకటి  చెబుతాను, విను! నా ప్రాణం  పోయినా  సహిస్తాను గానీ, నా వ్యక్తిత్వం మీద  ఒక్క మచ్చ పడ్డా సహించను- నిజంగా చెబుతున్నాను-  నువ్వు  ఇక  నా నిర్ణయానికి  అడ్డురాకు.  నేను నీ వెనువెంటనే  వచ్చేస్తాను- 'సిద్ధంగా  ఉండమని  ప్రభువుకు  చెప్పు. త్వరగా పో! లే, లేచిపో! వెంటనే!"  అన్నది  దానిని త్వరపెడుతూ.      
   దమనకుడు అక్కడి నుండి  లేచి పరుగున సింహం దగ్గరికి  పోయేది కాస్తా ,  రాజమహలు ద్వారం దగ్గరే తచ్చాడుతున్న  కరటకుడిని  చూసి, ఆగి "లోపలికి పోవచ్చా? తగిన సమయమే  గదా!" అన్నది."  ఓహా!పోవచ్చు! సరైన సమయమే! ప్రభువు నీ రాక కోసమే  వేచి చూస్తున్నాడు.  ఇంతకీ పోయిన పని ఏమయింది?" అని అడిగింది కరటకం. "వేరేది ఎందుకవుతుంది? వెళ్ళిన పనిని పండించుకొని వచ్చాను. సంగతంతా మళ్ళీ చెబుతాను.  నువ్వు పోయి ప్రభువుల వారి దగ్గర నిలబడు.  కొంచెం సేపటికి నేను వస్తాను" అన్నది దమనకం.       
   కరటకం లోపలికి  వెళ్లాక  కొంతసేపటికి మెల్లగా అది  లోపలికి వెళ్లింది. దాని కోసమే  ఎదురుచూస్తున్న  సింహం  దాన్ని  పిలిచి "రా, కూర్చో! ఏమైంది?" అని అడిగింది. కరటకం  సింహం  దగ్గరకు  పోయి  మోకాళ్లపై  కూర్చొని "నేను  వెళ్లే సరికి  సంజీవకుడు  ఇంటి లోపల  కాటక పాటకులతో  మాట్లాడుతూ  ఉన్నాడు.  నన్ను  చూడగానే అతను  వాళ్లతో  మాట్లాడటం  ఆపి, నన్ను  ఆహ్వానించి, కూర్చోబెట్టి కుశల  ప్రశ్నలు  వేశాడు. సందర్భానికి  తగినట్లుగా నేనూ  ఏవో  కొన్ని  మాటలాడాను. మేం ఇద్దరం  ఏకాంతంగా ఏవో చర్చించాలని  గుర్తించి,  కాటకపాటకులు  ఇద్దరూ కొంచెం ఎడంగా  పోయారు.        
అప్పుడు  నేను  ఏమేమి  చెప్పాలో  అవన్నీ  నయానా, భయానా చెప్పాను. అతను కూడా  తను చెప్పాలనుకున్న  వాటిని చెప్పేశాడు- మొండిగానూ,  సాహసంగానూ.  అవన్నీ  నేను  చెప్పాల్సినవి కావు; మీరు  వినాల్సినవీ కావు- లాభం కూడా  ఏమీ  లేదు. అతను మాట్లాడిన  తీరును బట్టే  'అతని  ప్రయత్నం మొత్తం మనకు వ్యతిరేకంగా  ఉన్నది' అని అర్థమైపోయింది.       
   అయినా చాలా కాలంగా  అతనితో  స్నేహంగా  మెసిలిన  వాడిని  కనుక,  అతని  మాటలను, అతను చేయతలపెట్టిన పనులను భరించలేక, అతనికి ఏది మేలో , నాకు తోచినంతగా ఒత్తి చెప్పాను. ఎంత  చెప్పినా అతను మాత్రం  "తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు" అంటున్నాడు.      'వినాశకాలే విపరీత బుద్ధి:'- పోగాలంలో  పాడుబుద్ధి పుడుతుందట- నిజమే అనిపించింది, అతన్ని చూస్తే.  చివరికి  అతను తన  తెగింపును, యుద్ధానికి దిగాలన్న నిశ్చయాన్నీ  స్పష్టంగా  చెప్పి - "ఇక నా  నిర్ణయానికి  అడ్డురాకు! నేను  నీ  వెనువెంటనే  వచ్చేస్తున్నాను; సన్నద్ధంగా ఉండమని  ప్రభువుకు చెప్పు! లే! పో!" అన్ని ఎంతో  పొగరుమీరగా చెప్పాడు. ఈసరికి అతను పోరాటానికి  ఇక్కడికి  వచ్చేస్తూ  ఉంటాడు. ఇప్పుడిక అతనిని  ఏం చేయాలో  దేవరవారికి తెలుసు" అన్నది.       
   అదివిని  సింహం "అహహా! ఎంత సాహసం! ప్రళయకాలపు మంటలపైకి  మిడుత దూక బూనింది! ఔరా! ఎంత పొగరు!" అని  అరిచింది. ఆ ఆలోచనకే  దాని  మనసులో  చెప్ప వశం కాని కోపం  చెలరేగింది. శతృవును శిక్షించాలన్న  నిశ్చయంతో  అది  ఒక్క  ఉదుటున లేచి,  బయటికి  పరుగెత్తి నిలబడింది. అంతలో  గిట్టల  తాకిడికి  దుమారం  ఆకాశమంత  ఎత్తుకు లేస్తూ పోతుంటే, 'మేఘాలు నిరాటంకంగా పైకి లేస్తున్నాయేమో' అనిపించేట్లు, భూమి అదిరేట్లు,  పరమ భీకరమైన  ఆకారంతో  పరుగు  పరుగున  వస్తూ  కనబడ్డది  సంజీవకం . ఆ సమయంలో  సింహం  అరచిన  అరుపుకు  కొండలన్నీ  కంపించి  ప్రతిధ్వనించాయి. కోపంతో  ఎర్రబారిన దాని  పసుపు పచ్చకళ్ళలో  నిప్పు కణికలు  చెలరేగాయి.  గుహలాంటి తన నోటిని  పూర్తిగా  తెరచి, వంకర తిరిగిన  కోరలన్నిటినీ చాపి, మెత్తని  నాలుకను అల్లల్లాడిస్తూ  ఆ సింహం ఒక్క పెట్టున ఎద్దు మీదికి  దూకింది. 
   సంజీవకం  ఆ దెబ్బనుండి తప్పించుకొని, తోకను  గిరగిరా తిప్పుతూ, వెనక కాళ్లతో  నేలను తాటిస్తూ, ఎగిరెగిరి దుముకుతూ,  భూమికి -ఆకాశానికి  మధ్య గల  వాతావరణం  అంతా  దద్దరిల్లి పోయేటట్లు  గొప్ప శబ్దంతో  రంకె వేస్తూ, తలవాల్చి, కొమ్ముల్ని  ఏటవాలుగా  వంచి, మెరుపు  మెరిసినట్లు  పరుగెత్తి వచ్చి,  సింహాన్ని  కొమ్ములతో  కుమ్మింది.  ఆ దెబ్బకు సింహరాజంతటిదే  సొమ్మసిల్లి  పడిపోయింది.       
అయితే అది అంతే త్వరగా తేరుకొని, కోపం  ఆవేశించగా ఫెళ్లుమని  గర్జించి, ఒక్క  ఉదుటన  దూకి, వజ్రాలతో  సమానమైన  గోళ్లను  చాపి,  పంజాతో ఎద్దు మూపురాన్ని  చరిచింది.  ఆ వేటుకు పెల్లుబికిన ఎద్దు రక్తం- కొండమీది  నుండి  పారే  సెలయేళ్ల  ధారల్ని  తలపించింది!  అయినా సంజీవకుడు  ప్రక్కకు  తొలగక, క్రిందికి  వంగి, వాడి కొమ్ముల్ని  ఒక్క పెట్టున సింహం  కడుపులో  గుచ్చింది.  సంజీవకుని  ఆ వేటుకంటే,  'అతను తనను  అవమానించాడే' అన్న  భావన గుండెల్ని  అదిరించగా  సింహరాజు బలహీనుడై, కట్టె దెబ్బ  పడిన త్రాచు పాము  మాదిరి  రొప్పుతూ  నిలబడిపోయింది!       
   అది చూసి  కరటకుడు దమనకుడితో  "చూశావా? నీ  దురాలోచనను విన్నందుకు  ఫలితం  ఇప్పుడు  మన రాజు అనుభస్తున్నాడు! మొదట నువ్వే  సంజీవకుడికి  సింహరాజుతో  స్నేహం పుట్టించావు. తర్వాత వాళ్లిద్దరి  స్నేహానికీ కళ్లు కుట్టి, నువ్వే వాళ్లిద్దరి మధ్యనా చిచ్చుపెట్టావు; ముందు చూపు లేనట్లు  వ్యవహరించావు. పండితుడు కాకపోయినా  తనను  తాను  'పండితుడు' అనుకునేవాడు తనకే కాదు, తన యజమానికి  కూడా  ప్రమాదం తెచ్చి పెడతాడు. అయ్యయ్యో! మన రాజు ఇప్పుడు  గొప్ప ఆపదలో ఉన్నాడు.  ఆయనను  ఈ కష్టం  నుండి  గట్టెక్కించే మార్గం కనుగొంటేనే కదా, సమర్థులమయ్యేది!       
   బింకం కొద్దీ  డాంబికంగా ఎన్నిమాటలైనా చెప్పచ్చు కానీ, నిజంగా కష్టం వచ్చినప్పుడు పనిని  నెత్తిమీద వేసుకొని సంబాళించటం అంత సులభం కాదు.      
   కమలాలతో  ఎంత  అందంగా  ఉన్న  సరస్సునైనా సరే,  మొసళ్లు ఉన్నాయంటే  చాలు, అందరూ విడచి పెడతారు.  అదే విధంగా  రాజు ఎంత  మంచివాడైనా సరే, దుర్మార్గుల సహవాసం చేస్తున్నాడంటే  ఆయనకు దగ్గరయ్యేందుకు  ప్రజలందరూ  భయపడతారు-..” అన్నది.        
   (...మిగతాది మళ్ళీ..)
