అనగా అనగా ఒక రాజు, రాణి ఉండేవాళ్లు. వాళ్లకు పిల్లలు లేరు. రాణి రోజూ తమ ఉద్యానవనానికి పోయినప్పుడు అక్కడున్న దేవతను ప్రార్థిస్తూ ఉండేది. చివరికి ఆ దేవత కరుణించి, ఆమెకు ప్రత్యక్షమై, 'నీకు ఒక కొడుకు పుడతాడు. అతనికి ఒక వరం ఉంటుంది. పన్నెండేళ్ళు వచ్చాక అతను నన్ను తలచుకొని ఏది కోరితే అది జరుగుతుంది' అని చెప్పి అదృశ్యం అయిపోయింది.
ఆమె చెప్పినట్లుగానే కొన్నాళ్ళకు రాణి గర్భం ధరించింది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు రాజు. నెలలు నిండగానే ఆమెకు ఒక మగ పిల్లవాడు పుట్టాడు. రాజు-రాణి ల ఆనందానికి మేరలేదు. యువరాజు పుట్టినందుకు రాజ్యం అంతటా ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. రాణి తన కొడుకును రోజూ ఉద్యానవనానికి తీసుకెళ్ళి, అక్కడ తాజాగా ఊరిన నీటితో స్నానం చేయించేది.
ఒకరోజున, ఆమె పిల్లవాడికి స్నానం చేయించాక, వాడిని ఒడిలో పడుకోబెట్టుకొని, అక్కడే నిద్రలోకి జారింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు- దుర్మార్గుడైన వంటవాడు ఒకడు! వాడు మెల్లగా రాణి దగ్గరికి వచ్చి, ఆమె ఒడిలోని పిల్లవాడిని ఎత్తుకెళ్లిపోయి ఏదో రహస్య ప్రదేశంలో దాచి పెట్టేశాడు. ఆపైన వాడు కోడి రక్తం తీసుకొచ్చి రాణి చీరకు పూసి, రాజు దగ్గరికి పరుగెత్తాడు- "ప్రభూ! రాణిగారు నేనెంత చెప్పినా వినలేదు. రాజకుమారుడిని తోడేలుకు ఆహారంగా వేసేశారు" అని దొంగ ఏడుపులు ఏడ్చాడు.
రాజు వెళ్ళి చూసే సరికి, ఏముంది? రాజకుమారుడి జాడ లేదు. రాణి చీరమీదంతా రక్తపు మరకలు! రాణి ఎంతచెప్పినా వినలేదు రాజుగారు- ఆమెను కఠినంగా శిక్షించమని ఆజ్ఞాపించి, తను బాధగా అంత:పురానికి వెళ్ళిపోయాడు.
దుర్మార్గుడైన వంటవాడు, రాజ్యపు మంత్రులు కుమ్మక్కై, రాణికి కఠిన కారాగార శిక్ష విధించి, ఆమెను ఒక చీకటి గదిలో బంధించారు. 'ఆమెకు భోజనం, నీళ్ళు ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతుంది?' అనుకున్నారు వాళ్ళు. కానీ పావురాలు రెండు, ఆమె పరిస్థితిని చూసి జాలిపడి, ఆమెకు రోజూ ఆహారమూ, నీళ్ళు తెచ్చి ఇవ్వసాగాయి. అలా ఆమె ఆశలన్నీ తన కొడుకు పైననే పెట్టుకొని, ఏనాటికైనా 'మంచి రోజులు వస్తాయి లే' అని బ్రతుకుతూ ఉన్నది.
ఇక రాజకుమారుడు, వంటవాడి ఇంట్లోనే అనామకుడుగా పెరగసాగాడు. వంటవాడు వాడిని తమ ఇంట్లో పనిమనిషిగా పెట్టుకొని, వాడి చేత అన్ని పనులూ చేయించేవాడు. యువరాజుకు వాడు చదువు కూడా నేర్పించలేదు. అయితే, అడవిలో గొర్రెల్ని మేపుతూ, యువరాజు తనంతటతానే చాలా యుద్ధవిద్యలు నేర్చుకున్నాడు.
అలా వాడికి పన్నెండేళ్ళు వచ్చాక, ఒకరోజున అడవిలో తిరుగుతుండగా అతనికి ఒక పాడుపడిన ఉద్యానవనం కనిపించింది. అందులో దేవత విగ్రహం ముందు మోకరిల్లి, అతను "తల్లీ! నాకు తోడు నీడగా ఉండేటట్లు ఎవరైనా నేస్తాన్ని ఇవ్వు" అని కోరుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణం అతనంత వయస్సులోనే ఉన్న ఒక అమ్మాయి అక్కడికి నడుచుకొని వచ్చింది! ఆమె సహాయంతో యువరాజు చదువు నేర్చుకోవటమే కాక, అనేక విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు.
మొదట్లో వాళ్ల స్నేహాన్ని వంటవాడు అస్సలు పట్టించుకోలేదు- కానీ యువరాజు బలం పెరుగుతున్న కొద్దీ వాడికి భయం పట్టుకున్నది. యువరాజుకి నిజం ఎక్కడ తెలిసిపోతుందో, తన తండ్రిని ఎక్కడ కలిసి, తనకు ఎదురు తిరుగుతాడో అని, వాడు 'ఇప్పుడే యువరాజుని చంపేయాలి' అని నిశ్చయించుకున్నాడు.
ఈ పనిని యువరాజు స్నేహితురాలికే అప్పగించాలనుకున్నాడు వాడు! అందుకని వాడు ఆమెనొకరోజున బెదిరించి, 'మారు మాట్లాడకుండా యువరాజును చంపేయమ'ని ఆదేశించాడు. "యువరాజును నువ్వు చంపకపోతే, ముందుగా నిన్ను, ఆపైన యువరాజును నేనే ఎలాగైనా చంపేస్తాను" అనేసరికి, ఆ పాపకు భయం వేసింది. ఆమె తెలివిగా అందుకు ఒప్పుకున్నట్లు నటించి, ఆ సంగతి యువరాజుకు చెప్పేసింది.
మరునాడు వంటవాడు వచ్చేసరికి ఆమె ఒక మేక గుండెను, నాలుకను ఒక పళ్లెంలో పెట్టి ఉంచి, 'అవి యువరాజువే' అన్నట్లు చూపింది వాడికి. తన అడ్డు తొలగిందని, వాడు చాలా సంతోషపడి, బాగా సారాయి త్రాగి, ఆ మత్తులో తను చేసిన తప్పులన్నీ చెప్పేశాడు ఆమెకు. ఇదంతా చాటునుండి విన్న రాజకుమారుడు దేవతను తలచుకొని, 'ఇన్ని తప్పులు చేసిన ఈ దుర్మార్గుడు ఇకపైన నల్లకుక్కగా మారి, బంగారు గొలుసు వేసుకొని, నిప్పులు తింటూ, జీవితమంతా మనిషి చెప్పుచేతల్లో బ్రతకాలి " అని కోరుకున్నాడు. తక్షణం వంటవాడు కుక్కగా మారిపోయాడు!
ఆ పైన యువరాజు తన తండ్రిని కలుసుకొని, తనెవరో చెప్పాడు. మొదట్లో అతన్ని నమ్మని రాజు, అతను ఆధారాలు చూపించేసరికి, ఒప్పుకోక తప్పలేదు. ఆపైన వాళ్లంతా కొన ఊపిరితో ఉన్న రాణిని చెరవిడిపించి, కాపాడారు. అటు తర్వాత రాకుమారుడు రాజై, తన స్నేహితురాలి సహాయంతో రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు.