అప్పుడు దమనకుడు అన్నది: "చూడు, ఇప్పుడు తొందరెందుకు? తినేది ఎప్పుడైనా తినచ్చు. ఆహారం, నిద్ర, భయం- ఇవి అన్ని జంతువులకూ సహజంగా ఉండే ధర్మాలే. పొట్ట నింపుకుందామని చూస్తుంటే గౌరవం దక్కదు. తెలివైనవాళ్ళు రాజుగారి ప్రాపకం కోరుకునేది 'స్నేహితులకు ఉపకారమూ- శత్రువులకు అపకారమూ' చేసేందుకే ! తన ఒక్కడి పొట్ట పోసుకోవటం ఏమాత్రపు పని? ఎలాంటివాడు జీవించటం వల్ల అనేక మంది జీవించటం సాధ్యపడుతుందో, అలాంటివాడి బ్రతుకే బ్రతుకు. నిజానికి వాడొక్కడినే 'జీవిస్తున్నాడు' అనాలి.
మాంసం ఏమాత్రం లేకపోయినా, మురిగిపోయిన క్రొవ్వుతో కంపు కొడుతున్నాసరే- ఎముక దొరికందంటే చాలు- కుక్క అమితంగా సంతోషపడుతుంది- కానీ ఆ ఎముకతో 'తన ఆకలి ఏమాత్రమూ తగ్గదు కదా ' అని గుర్తించదు. కానీ సింహం?- దగ్గరలోనే ఉన్నవైనా సరే- బక్కచిక్కిన జంతువుల్ని ఆశించక, తన సొంత పంజాలోని వాడి గోళ్ల చేత చీల్చబడిన ఏనుగు తలలోని మెదడును కోరుకుంటుంది. ప్రతివాళ్ళూ తమ తమ శక్తికి తగిన ఆహారాన్నే కోరుకుంటుంటారు. కుక్క తనకు ఇంత ముద్ద పడేసేవాడి దగ్గర నిలబడి తోక ఆడిస్తుంది; నేలమీద పడి కడుపును చూపిస్తుంది. ఇన్ని పాట్లు పడ్డా దానికి ఒక్క ముద్దను మించి పెట్టరు. అదే, రెండు దంతాలు కలిగిన ఏనుగు? -గంభీరంగా చూస్తూ, మావటివాడు 'తిను తిను' అని మాటి మాటికీ బుజ్జగిస్తుంటే, మెల్లగా తనకు కావలసినంత తింటుంది. తక్కువవాడు ఎంత దీనంగా వేడుకున్నా సరే, వాడికి తనివి తీరేట్లు ఎవ్వరూ ఏమీ పెట్టరు. అదే, మర్యాదస్తుడికైతే, వినయంగా మాట్లాడుతూ, కోరికను మించి ఇస్తారు. మచ్చలేని విద్యచేతగాని, తిరుగులేని శౌర్యము చేతగాని, లేదా అపాయం లేని ఉపాయం చేతగాని- ఏదో ఒక విధంగా రాజుల్ని మెప్పించిన వాడి బ్రతుకే బ్రతుకు. ఏదో ఇంత అన్నం తిని కుక్క మాత్రం బ్రతికిపోవట్లేదా? తన గౌరవాన్ని నిలుపు-కుంటూ, ఉన్నంతలో ఇతరులకు మేలు చేసేవాడు ఒక్కరోజు బ్రతికినా చాలుగాని, తన కడుపునొక్కదాన్నీ నింపుకునేందుకు చూసే కాకి చిరకాలం బ్రతికి మాత్రం ప్రయోజనమేమున్నది? కొంచెం వాన పడినవెంటనే రాతినేలలో ప్రవాహం బయలుదేరినట్లు, కొంచెం లాభం రాగానే తక్కువవాడిలో అమితమైన సంతోషం తలెత్తుతుంది. ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలీక, చేయవలసిన పనులను వదిలి తన కడుపు మాత్రం నింపుకోవాలనుకునేవాడు జంతువుతో సమానం. అంతేకాదు- నిజంగా చూస్తే అలాంటి నరపశువుకంటే, బరువులు మోసుకుంటూ, గడ్డి పరకలు మేస్తూ, వ్యవసాయం మొదలైన వృత్తులకు అత్యంత సేవ చేస్తూ, పవిత్రపు పుట్టుక పుట్టిన ఎద్దే, చాలా నయం" అని.
ఆ మాటలు విని కరటకం - " దమనకా! మనం మంత్రులం కాము. ఇంత ఆలోచించనక్కర్లేదు- దాని వల్ల మనకేమి లాభం?" అన్నది.
అప్పుడు దమనకం అన్నది- "మంత్రి అయ్యేందుకు ఎంత సేపు పడుతుంది? గతంలో చేసుకున్న పుణ్యం వల్ల తెలివితేటలు, జ్ఞానం లభిస్తాయి. అలా జ్ఞాని అయిన పండితుడు, ప్రభువుల మెప్పు పొందుతాడు. అలా ప్రభువుల మెప్పు లభించటం వల్ల పాండిత్యం మరింత వెలుగు చూస్తుంది. దానివల్ల తనరాజ్యాన్నేగాక, ఇతర రాజ్యాలను కూడా నడిపేంత సామర్ధ్యం వస్తుంది. ఆ సామర్ధ్యం వల్ల మంత్రికి ఇంకా ఎక్కువ ఆదరం లభిస్తుంది.
పెట్టెలోపల ఉన్న రత్నం కూడా, సూర్యుడి కాంతి చూడకనే ప్రకాశించదు- పండితుడు కూడా అంతే. మనిషన్నవాడికి మంచి నడవడి ఉన్నట్లైతే అన్నిలోకాలకూ పూజనీయుడౌతాడు. లేనట్లైతే నిందల పాలౌతాడు. గౌరవంగాని, అగౌరవంగాని నడవడిని బట్టే లభిస్తుంటాయి. మంచివాడు అని పేరు పొందటం కష్టం- చెడ్డవాడు అని పేరుపొందటం అతి సులభం. పెద్ద బండరాతిని కొండమీదికి ఎక్కించటం చాలా కష్టం- కానీ దాన్ని క్రిందికి త్రోయటం ఏమంత పెద్ద పని కాదు గదా?" అని.
ఆ మాటలు విని కరటకం- "రాజుగారి ప్రాపకం ఎంత లాభమో తెలీనివాడిని కాదుగానీ- గతంలో ఇతని వల్ల పడ్డ పాట్లు తలచుకుంటే చాలు- నాకు తలనొప్పి వస్తున్నది: అందుకనే ఇట్లా అన్నాను. సేవకుల మంచి చెడులను పట్టించుకోని రాజును ఆశ్రయించి ఉండటం చాలా కష్టం. నువ్వు తెలివైనవాడివి- ఇతరులచేత చెప్పించుకోవలసిన అవసరం నీకు ఏమాత్రమూ లేదు. నీకు ఎలా తోస్తే అలా చెయ్యి. ఇంతకూ ఇప్పుడు నీకు ఏంచేద్దామనిపిస్తున్నది?" అని అడిగింది.
అప్పుడు కరటకం సంతోషించి, " మనరాజు పింగళకుడు నీళ్ళు త్రాగేందుకని కాళిందీ నదికి పోబోయాడు- అయితే అంతలోనే ఎద్దు రంకె విని, భయపడి, ఒడ్డు దిగేది కూడా మరచిపోయి, అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయి ఉన్నాడు.
'ఇతరుల మనసులోని సంగతులు ఎవ్వరికీ కనబడవు; మరి అతని మనస్సులో ఏమున్నదో నీకు ఎట్లా తెలిసింది?!" అనకు. అతను నిలబడిపోయిన తీరును చూస్తే, ఈమాత్రం సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది నాకు. తెలివిగలవాళ్లకు ఇతరుల భావనల్ని కనుక్కోవటం కష్టం కాదు. గుర్రం, ఏనుగు మొదలైన జంతువులు కూడా యజమానుల మనసుల్ని గ్రహించి, తమ విధుల్ని నిర్వర్తిస్తుంటాయి. ఇతరుల మనస్సులలోని అభిప్రాయాలను తెలుసుకొనటం ఒక్కటే పండితుని బుద్ధిలోని ప్రత్యేకత. ఆ భేదమే లేదంటే, ఇక పండితునికి-పామరునికి తేడా ఏముంటుంది?
అది అటుంచు- ఇప్పుడు చేయవలసిన పని గురించి చూద్దాం. నేనిప్పుడు రాజు దగ్గరికి పోతాను. ఆయన మనసులోని భావనకు అనుగుణంగా వ్యవహరిస్తాను. దానికి తగినట్లుగా మాట్లాడతాను. "ఈ పనిని నువ్వే చెయ్యి" అని ఆయనే స్వయంగా నన్ను ఆజ్ఞాపించేటట్లు చేస్తాను. ఆయన మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించి, ఆయన మెప్పు సంపాదిస్తాను" అన్నది.
అప్పుడు కరటకం " రాజుగారి కొలువు కోరేవాళ్ళు మెలకువతో ప్రవర్తించాలి. వాళ్ల మనస్సులెట్లా మారుతూ ఉంటాయో తెలుసుకొని, వాటికి తగినట్లు ప్రవర్తించటం చాలా కష్టం. స్వతంత్ర వృత్తి లాంటిది కాదు, ఆ పని. జాగ్రత్తగా ఉండాలి" అన్నది.
కరటకం మాటలకు దమనకం అన్నది: " ఉద్యోగికి దూర ప్రదేశమంటూ లేదు; పండితుడికి పరదేశం అంటూ లేదు; ఇష్టంగా మాట్లాడేవాడికి శత్రువనేవాడు లేడు- అలాగే తెలివిగలవాడికి అసాధ్యం అనేదే లేదు. మంచి ప్రవర్తన కలిగి, ఎల్లప్పుడూ తమను కొలిచేవాళ్లను రాజులు ఆదరిస్తారు. యజమాని కోపాన్ని-దయను కనుక్కొని, ఆ గుర్తులకు అనుగుణంగా మసలుకొనే సేవకుడంటే యజమానికి ఇష్టం పుడుతుంది" అని.
"ముందుగా రాజును గమనించుకొని ఆయనకు తగినట్లుగానే మాట్లాడాలంటే, ఇక మాట్లాడటంలో అర్థం ఏముంటుంది?" అన్నది కరటకం, కొంచెం తిరస్కారంగా.
అప్పుడు దమనకం " 'ఈ విధంగానే' మాట్లాడాలని నియమం ఏమీ లేదు కదా? ప్రతిభ కలవాడు సమయోచితంగా- యజమానిముందు- పలుకవలసిన మాటలు అనేక విధాలుగా ఉంటాయి. సేవకుడు అనేవాడు 'అణకువకు ప్రతిరూపమా' అన్నట్లు, యజమానికి ఎట్ట ఎదురు స్థానంలో నిలువక, ప్రక్కకు తొలిగి నిలబడి, యజమాని తనవైపుకు చూస్తున్నపుడు, ఆ సమయానికి అనుగుణంగా ముందు వెనుకలు చూసుకొని, యజమాని మనస్సులోని భావాన్ని ఊహించి, ఆయనకుగాని, ఆయనకు ఇష్టులైనవారికి గాని వ్యతిరేకంగా కాకుండా, నేర్పుగా తను చెప్పదలచిన విషయాన్ని చెప్పాలి." అన్నది.
అదివిని కరటకం "నువ్వు తలపెట్టిన పని నెరవేరాలని ఆశిస్తున్నాను. అదిగో, చూడు! రాజు వెనక్కి తిరిగి ఇంటికి పోతున్నాడు. ఆయన తన ఇంటికి చేరుకునేసరికి నువ్వు కూడా పోయి ఆయనను కలుసుకోవచ్చు. పో, ఇక" అన్నది.
వెంటనే దమనకుడు పింగళకుడి దగ్గరికి పోయి, చాలా అణకువతో ఒదిగి నిల్చొని, భయభక్తులు ఉట్టిపడేటట్లు కంగారు పడుతూ, నమస్కారం చేసింది. ఆ సింహరాజు అప్పుడు దానిని గౌరవం నిండిన చూపులతో ఆహ్వానించి, కూర్చొనమని, "బాగున్నావా? చాలా కాలమైంది, నిన్ను చూసి!" అన్నది.
అప్పుడు తెలివైన ఆ నక్క దమనకం ఇట్లా అన్నది:
(-తరువాయి వచ్చేమాసం.......)