ప్రకృతి ఒడిలో పిల్లలం
స్వేచ్ఛగ ఎగిరే గువ్వలం
కల్లలు ఎల్లలు లేని పిల్లలం
పంజరమందున రామచిలుకలం(?)
"ప్రకృతి ఒడిలో పిల్లలం"
ఝుమ్మని సాగే తుమ్మెద నాదం..ఝుంఝుం...
సీతాకోక చిలుకల అందం
చేతికి అందిన పరమానందం
పెనవేసుకుపోయే మా బంధం
"ప్రకృతి ఒడిలో పిల్లలం"
జొన్నదంటులూ ఏరుకు వస్తాం
ఈనెలు బెండుతొ బండులు చేస్తాం
బంకమట్టినీ మర్దన చేస్తాం
ఎద్దులు చేసీ బండికి కడతాం
"ప్రకృతి ఒడిలో పిల్లలం"
పక్షుల గొంతుతో వంత పలుకుతాం
పిల్లకోతులై చెట్లు ప్రాకుతాం
బస్సు-రైలుగ పరుగులు పెడతాం
గాలి పటాలై నింగిని తాకుతాం
"ప్రకృతి ఒడిలో పిల్లలం"
ఆడుతు పాడుతు చదివేవాళ్ళం
ఆలోచనలతో ఎదిగే హృదయం
ర్యాంకులబాణం చేసెను గాయం (?)
అయ్యెను విద్య వ్యాపార మయం (?)
"ప్రకృతి ఒడిలో పిల్లలం"
ఆటపాటలలో ఉన్నది జ్ఞానం
ఒత్తిడి పెంచితె రాదు విజ్ఞానం
చదవలేదా నాడు ఎందరొ చదువులు?
కాలేదా, శాస్త్రజ్ఞులు-గురువులు?
"ప్రకృతి ఒడిలో పిల్లలం"