కొత్తగా బడిలో చేరారొక టీచరుగారు. ఆ టీచరుగారికి చాలా కథలు వచ్చు. పిల్లల్ని మంచి చేసుకోవటానికి కథల్ని మించినవి లేవు అని ఆయనకు బాగా అర్థమైంది. అందుకని, ఒకసారి, తరగతిలో పిల్లలకు నీతిబోధ చేద్దామనుకుని, "నేనిప్పుడు మీకొక కథ చెబుతాను" అన్నాడాయన.
"చెప్పండి సార్, చెప్పండి సార్!" అని ఉత్సాహంగా అరిచారు , పిల్లలంతా. ఆయన చెప్పిన కథ ఇలా సాగింది:
"అనగా అనగా అనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక వాగు- ఎప్పుడూ చాలా నీళ్లతో, ఆ వాగు చాలా అందంగా ఉండేది. దానిమీదినుంచి పోయేందుకు ఏనాడో ఒక వంతెన కట్టి ఉన్నారు. ఆ వంతెన క్రింద- టి ఒడ్డున, నివసిస్తూ ఉండేది, ఒక కప్ప.
ఒక రోజు ఆ కప్ప భోంచేసి, విశ్రాంతిగా పడుకొని ఉన్నప్పుడు, వంతెనపైనుండి టపుక్కున దాని వీపు మీద ఏదో పడింది.
"ఏంటబ్బా, ఇది?" అనుకొని, కప్ప వెనక్కి తిరిగి, వెల్లకిలా పడి, చివరికి ఆ బరువును నేలమీదికి దింపి చూసింది.
చూడగా అది ఒక యాభై పైసల నాణెం!
"అబ్బ! ఎంత డబ్బు దొరికింది, నాకు!" అనుకున్నదా కప్ప. "ఇప్పుడు నాకు చాలా డబ్బు దొరికింది! ఏ కప్ప దగ్గరా ఇంత డబ్బు ఉండి ఉండదు. ఎంత బరువున్నదో చూడు! ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతమైన కప్పను నేనే అయి ఉంటాను!" అనుకొని, అది గట్టిగా బెకబెకలాడటం మొదలు పెట్టింది.
దాని అరుపులు విని, అక్కడుండే ఇతర కప్పలన్నీ తలెత్తి చూసి, వచ్చి దాని చుట్టూ మూగాయి- "ఏమైంది, ఏమైంది?" అంటూ. మన హీరో కప్ప అప్పుడు వాటన్నిటికీ ఏం జరిగిందో చెప్పి, "ఇప్పుడు ఈ విశ్వంలోకెల్లా అత్యంత ధనవంతమైన కప్పను నేనే! నిశ్చయంగా!" అన్నది గర్వంగా, మురిసిపోతూ.
"అవును, సందేహంలేదు. నువ్వే అత్యంత ధనిక కప్పవు!" అవి వంతపాడాయి కప్పలన్నీ. ఆ ఉత్సాహంలో అవన్నీ మన కప్పను తమ నాయకుడిగా ఎన్నుకునేశాయి! ఆ కప్ప ఇంకా పొంగిపోయింది- తనను ఇలా నాయకుడిగా ఎన్నుకున్న పేద కప్పల కష్టాలన్నిటినీ తీర్చేస్తానని, కప్ప జాతి ముందున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాననీ' హామీ కూడా ఇచ్చేసిందది. "
టీచరు గారు ఈ కథ చెబుతుంటే పిల్లలంతా సంతోషంగా వింటున్నారు. అందరి ముఖాలూ విప్పారి ఉన్నాయి. టీచరు గారు కథను కొనసాగించారు:
" కొన్ని రోజుల తర్వాత, ఆ ఏరు దగ్గరికి ఒక ఏనుగు వచ్చింది. అది కడుపునిండా ఏరులోని చల్లటి నీటిని త్రాగాక, ఇక స్నానం మొదలుపెట్టింది. ఏనుగు స్నానం ఎలా ఉంటుందో తెలుసు కదా, తొండం నిండా నీళ్ళు నింపుకొని చిమ్ముతూ, లావుపాటి కాళ్లతో-బరువైన అడుగులతో నీళ్ళను తొక్కుతూ, అన్ని దిక్కులా నీళ్ళు ఎగిరేట్లు చిందులేస్తూ, అది ఏరును చిందర వందర చేస్తుంటే, అక్కడ నివాసం ఉంటున్న కప్పలన్నీ భయంతో వణికి పోయాయి. అవన్నీ తమ నాయకుడి దగ్గరికి వెళ్ళి, "నాయకా! మీరు తప్ప వేరే గతి లేదు. మీరే ఈ ఏనుగుకి బుద్ధి చెప్పాలి. మనవాళ్లని పీడించవద్దనీ, తక్షణం ఇక్కడినుండి వెళ్లిపొమ్మనీ దాన్ని ఆదేశించాలి మీరు. మీరు స్వయంగా చొరవ తీసుకుంటే తప్ప, ఇక లాభం లేదు." అని మొరపెట్టుకున్నాయి. "
టీచరుగారు కథను ఆపి పిల్లలకేసి చూశారు- పిల్లల ముఖాల్లో భయమూ, బాధ! ఆయన కథ కొనసాగించారు:
"నాయక కప్పకు తనవారిమీద చాలా జాలి వేసింది. ఏనుగు మీద చాలా కోపం వచ్చింది. అది వెంటనే ఏనుగుని ఉద్దేశించి చాలాసార్లు గట్టిగా బెక బెక మని అరిచింది. ఏనుగుకి దాని బెకబెకలు వినిపించాయి, కానీ అది వాటిని అసలు పట్టించుకోలేదు. కప్పకు కోపం హెచ్చింది.
అది ఏనుగు ముందుకి వెళ్ళి నిల్చుని, ఇంకా తీవ్రంగా అరవటం మొదలు పెట్టింది. అయినా పట్టించుకోలేదు,ఏనుగు! కప్పకి రోషం హెచ్చి, తను స్వయంగా వెళ్ళి ఏనుగు ఆటలకి అడ్డం పడింది- దాంతో ఒళ్ళు మండిన ఏనుగు తొండంతో కప్పను పట్టుకొని, పైకెత్తి, అక్కడే ఉన్న బండ మీదికి దాన్ని విసిరి కొట్టింది.
ఆ దెబ్బకు బడాయి కప్ప కాస్తా టపుక్కున చచ్చిపోయింది. అది చూసి, మిగిలిన కప్పలన్నీ భయపడి, నోళ్ళు మూసుకొని, గబుక్కున నీళ్లలోకి దూకి, బండల మాటున దాక్కున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నమైన కప్ప జీవితం, అట్లా ఒక మామూలు ఏనుగు తొండం వల్ల ముగిసిపోయింది- ఎట్లా ఉంది కథ?" అని , టీచరుగారు పిల్లల వైపు చూశారు.
పిల్లల ముఖాలు వాడిపోయి ఉన్నై. వాళ్లెవ్వరికీ ఈ కథ నచ్చలేదని తెలుస్తూనే ఉన్నది. కొంతమంది పిల్లలైతే నిశ్శబ్దంగా ఏడవటం మొదలు పెట్టారు కూడాను!
టీచరుగారికి బాధ వేసింది. పిల్లల్ని అలా ఏడిపిస్తే ఎలాగ? అందుకని ఆయన కథను కొనసాగిద్దామనుకున్నారు ఇంకా:
"కథ అయిపోయిందనుకున్నారా? అయిపోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ తర్వాత ఏమై ఉంటుందో?" అన్నారాయన, తనుకూడా 'కథను ఎలా ముగిస్తే బాగుంటుందా' అని ఆలోచిస్తూ.
అప్పుడో తెలివైన పిల్లాడు కధను ఇలా ముగించాడు:
"ఆ కప్ప అయితే ఎలాగూ చచ్చిపోయింది. కానీ, దాని ఆత్మ ? ఆ ఆత్మ నేరుగా ఎక్కడికి వెళ్ళాలో ఆ మూలకే వెళ్ళి కూర్చున్నది. అది చేరుకున్న ఆ చోటు- చెప్పాలంటే- అంత గొప్పగానూ లేదు; అంత చెడ్డగానూ లేదు. అయితే అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటే మీక్కూడా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ ఒక నలుగురైదుగురు బిర్లాలు, కొందరు టాటాలు, ఒక రాక్‌ఫెల్లర్, ఒక విక్టోరియా మహారాణి, ఇంకా- కొందరు మోడీలు, కొందరు సింఘానియాలు, కొందరు ఫోర్డులు, ఉన్నారు! నెపోలియన్, అలెగ్జాండర్, చంగీజ్‌ఖాను, నీరో చక్రవర్తి- ఇట్లాంటి గొప్పవాళ్ళు- ఇంకా చాలామంది- ప్రపంచపు ధనికుల్లో ఎంచదగ్గవాళ్ళు- అందరూ ఉన్నారక్కడే. మరి మన కప్ప కూడా, అన్ని కప్పల్లోకీ అత్యంత ధనిక కప్ప కదా, అందుకని అదికూడా హాయిగా వాళ్లందరితోటీ కలిసి ఉండిపోయిందక్కడ!" పిల్లలందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. 'ప్రతివాళ్ళూ కోరుకునేది ఇట్లాంటి అంతమే' అని అర్థమైంది టీచరుగారికి.
ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికులైన వాళ్ళకు ఈ కథ తెలిస్తే వాళ్ళు ఏమంటారో, మరి?!