చాలా సంవత్సరాల క్రితం మా ఊళ్ళో బడిలో కృష్ణవేణి, గీతిక అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ బాగా ఆడుతూ, పాడుతూ, కొట్లాడుకుంటూ, చక్కగా స్నేహితుల్లాగా కలిసి మెలిసి ఉండేవాళ్ళు. కొంచెం పెద్దయ్యేసరికి ఇద్దరూ దగ్గర్లోనే అడవి ప్రదేశంలో ఉన్న ఒక గురుకుల పాఠశాలలో చేరారు.

ఆ బడి చాలా పెద్దది. అక్కడి వాతావరణం చాలా బాగుండేది. చల్లటి గాలి శరీరాన్ని తాకుతూ, చక్కలిగిలి పెట్టేది. ఆ బడిలో‌ ఆటపాటలను, చదువులను సమానంగా ప్రోత్సహించేవాళ్ళు. చదువులు చెప్పటంతో- బాటు, పిల్లలందరికీ చెక్కభజన, కోలాటం, పండరి భజన, సంగీతం, మరెన్నో కళలు నేర్పించేవాళ్ళు.

అయితే గీతికకు ఇవేవీ పెద్దగా ఇష్టం కాలేదు. ఆ పాపకు ఎప్పుడూ కూర్చొని చదవటమే ఇష్టంగా ఉండేది. 'ఎందుకు, అట్లా ఎప్పుడూ చదువుతూనే ఉంటావు?' అని అడిగిన వాళ్ళకు గీతిక- 'నేను పెద్దయ్యాక డాక్టరునవుతాను. డాక్టరవ్వాలంటే, మరి చాలా పుస్తకాలు చదవాల్సి ఉంటుంది' అని చెప్పేది.

కృష్ణవేణికి మాత్రం ఆట, పాట, అభినయం చాలా ఇష్టం. వీటన్నిటితోపాటు కృష్ణవేణి చదువులు కూడా ఒక మోస్తరుగా- బాగానే చదివేది.

బడి చదువులు పూర్తవ్వగానే అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. గీతిక, కృష్ణవేణిలు కూడా విడిపోయారు. మొదట్లో ఇద్దరూ 'తమ స్నేహితులందరూ ఏం చేస్తున్నారో' అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు; కానీ రాను రాను బడి సంగతుల్ని వెనక్కి నెట్టి, తమ జీవితాల్లో తాము ముందుకు సాగారు.

కాల క్రమంలో గీతిక నిజంగానే చక్కని డాక్టరు అయ్యింది. డాక్టర్ గీతికకు ఇప్పుడు ఆ పట్టణంలో చాలా మంచి పేరుంది. ఆమెకొక పాప. ఆ పాప పేరు విశ్విత. గీతిక తన బిడ్డను ఆ పట్టణంలోకెల్లా పేరున్న పెద్ద బడిలో చేర్పించింది. డాక్టర్ గీతిక విశ్వితకు ఎప్పుడూ చెబుతూ‌ఉండేది: "సమయాన్ని వృధా చేసుకోకూడదు, బాగా చదువుకోవాలి, చదువే మనకు పెట్టుబడి" అని. విశ్విత కూడా గీతిక ఆశలకు అనుగుణంగా చక్కగా చదువుకునేది. ఎప్పుడూ తన తరగతిలో ఫస్టు వచ్చేది.

అయితే విశ్వితకు తీరని కోరిక ఒకటి ఉండేది: అదేంటంటే, నాట్యం నేర్చుకోవటం. తను ఎప్పుడు నాట్యం నేర్చుకుందా-మనుకున్నా, వాళ్ల అమ్మ గీతిక ఒప్పుకునేది కాదు- సమయాన్ని వృధా చేసుకోవద్దనేది.

ఒకసారి విశ్విత వాళ్ల బడిలో వార్షికోత్సవాలు జరిగాయి. డాక్టర్ గీతికను ఆ ఉత్సవాల్లో బహుమతులిచ్చేందుకు ఆహ్వానించారు బడివాళ్ళు. ఉత్సవాల సందర్భంగా పెట్టిన వ్యాసరచన, వక్తృత్వం, పద్య పఠనం వంటి అనేక పోటీల్లో విశ్వితకు మొదటి బహుమతి వచ్చింది. అందరూ ఆ పాప తెలివిని అభినందిస్తుంటే, గీతిక ఉప్పొంగిపోయింది. ఆ తర్వాత చివరగా, పిల్లలంతా కలిసి ఒక నాట్య రూపకాన్ని ప్రదర్శించారు.

ఆ రూపకంలో ప్రధాన పాత్ర వహించింది విశ్విత. స్టేజీమీద విశ్వితను చూసిన డాక్టర్ గీతికకు ముందు తనెవ్వర్ని చూస్తున్నదో‌ అర్థం కాలేదు. తెలిశాక, 'విశ్విత నాట్యం ఎప్పుడు నేర్చుకున్నది? ఎప్పుడూ చదువుకుంటూనే ఉన్నది గదా?' అని ఆశ్చర్య పోయింది.

ఆ రూపకంలో విశ్విత నటన అద్భుతంగా ఉండింది. ఆమె నాట్యం చూసిన ప్రతివాళ్ళూ ఆమెను ఎంతో‌ మెచ్చుకోవటం మొదలు పెట్టారు. రూపకం పూర్తయ్యేసరికి, బడి యాజమాన్యం మొత్తం వచ్చి విశ్వితను, గీతికనూ అభినందించటం‌ మొదలు పెట్టింది!

'నీకు నాట్యం ఎవరు నేర్పారే, నాకు ఎప్పుడూ చెప్పలేదు?' అని అడిగింది గీతిక, మురిపెంగా విశ్వితను దగ్గరకు తీసుకుంటూ . దూరంగా ఎవరితోనో మాట్లాడుతున్న తమ డ్యాన్సు టీచరును చూపించింది విశ్విత- ఆవిడ కూడా వృత్తి రీత్యా డాక్టరేనట. అయితే ఆమెకు నాట్యం అంటే చాలా ఇష్టం. అనేక దేశాల్లో నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చిందావిడ. డాక్టరుగా ఎంత ఒత్తిడి ఉన్నాకూడా, ప్రతిరోజూ మధ్యాహ్నంపూట రెండు గంటల పాటు విశ్విత వాళ్ళ బడికి వచ్చి పిల్లలకు నాట్యం నేర్పుతున్నదట!

ఆ తర్వాత ప్రధానోపాధ్యాయుడు స్టేజీనెక్కి, 'పిల్లలకు నాట్యాన్ని పరిచయం చేసి, మా బడికి ఇంత చక్కని నృత్య రూపకాన్ని అందించి, కళల పట్ల మాకందరికీ అభిమానం కల్గించిన డాక్టర్ కృష్ణవేణిని సన్మానిస్తున్నాం, అది మా అదృష్టంగా భావిస్తున్నాం' అనగానే గీతిక నివ్వెర పోయింది. చూడగా, విశ్వితకు నాట్యం నేర్పింది ఎవరో కాదు- తన చిన్ననాటి స్నేహితురాలు కృష్ణవేణే!

స్టేజీ దిగిరాగానే గీతిక వెళ్ళి కృష్ణవేణి ముందు నిలబడింది. తన చిన్ననాటి స్నేహితురాలు గీతికను గుర్తుపట్టిన కృష్ణవేణి కూడా ఆశ్చర్యానందాలకు లోనైంది. 'విశ్విత తల్లి గీతిక' అని తెలుసుకొని ఆమె ఎంతో సంతోషపడ్డది.

ఆపైన గీతిక-కృష్ణవేణిల స్నేహం కలకాలం వర్ధిల్లింది.

ఇక విశ్విత నాట్యం సాధన చేస్తానంటే ఏనాడూ అభ్యంతర పెట్టలేదు డాక్టర్ గీతిక!