చూస్తూ చూస్తూ ఉండగానే ఆరు నెలలూ గడిచి పోతున్నై- ఇంకొక్క రోజే మిగిలింది గడువు తీరేందుకు.
అప్పటివరకూ బ్రాహ్మడు ఆశించింది ఏదీ జరగలేదు- ఒక్కటి తప్ప!
గుర్రం చనిపోలేదు: నిజానికి అది ఇంకా బలంగా తయారై చెంగు చెంగున ఎగురుతున్నది!
రాజుగారూ చనిపోలేదు: ఇప్పుడు ఆయన ఇంకా బలంగా, ఆరోగ్యంగా ఉన్నారు. గూఢచారుల ద్వారా బ్రాహ్మడి ఆలోచనలన్నీ కనుక్కొని ఉన్నారాయన. ఎప్పుడు గడువు పూర్తవుతుందా, ఎప్పుడు బ్రాహ్మడిని పిలిచి తల తీయించేద్దామా అని ఎదురు చూస్తున్నారాయన!
బ్రాహ్మడూ పోలేదు: బ్రాహ్మడు నిరాశతోటీ, ఆశతోటీ ఊగిసలాడి బక్కచిక్కి పోయాడు- కానీ ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు!
గుర్రమూ ఎగరలేదు:( పాపం, గుర్రం చాలా మంచి జాతిది. అయితే ఇన్నాళ్ళలోనూ బ్రాహ్మడు దాన్ని ఒక్కసారికూడా ఎక్కనూలేదు; దానికి ఏదీ నేర్పనూ లేదు. రోజూ ఇష్టం వచ్చినంతసేపు అడవిలో తిరుగుతూ, అక్కడి పచ్చికను మేసి మేసి, అది ఇంకా బాగా, బలంగా తయారైంది.
బ్రాహ్మడూ, అతని కుటుంబమూ మాత్రం కడుపునిండా తిండి తిన్నారు ఈ ఆరు నెలలూ.
చివరిరోజు రాగానే బ్రాహ్మడి భార్యకు గాభరా హెచ్చింది. బ్రాహ్మడికీ ప్రాణం మీద ఆశ మొదలైంది. 'ఎలాగైనా బ్రతకాల్సిందే' అనుకున్నారిద్దరూ.
మరునాడు ప్రొద్దునే- తెల్లవారుజామున- గుర్రానికి జీను తగిలించి, నమస్కారం పెట్టుకున్నారు. ఆపైన దానిమీదకి ఎక్కి కూర్చున్నారు ఊరికే. అది ఎటు తీసుకుపోతే అటు పోదామనుకున్నారు. బ్రాహ్మడికి గుర్రపు స్వారీ రాదు. బ్రాహ్మడి భార్యకు అసలే రాదు. రాజుగారికి దొరక్కుండా పారిపోవటమే ఇద్దరి లక్ష్యమూ! ఇద్దరూ కళ్ళెం వదిలి, పదపదమని ప్రార్థించుకుంటూ కూర్చుంటే, పంచకల్యాణి గుర్రం తనంతట తానుగా పరుగందుకుంది. రాను రానూ వేగం హెచ్చింది.. ఇంకా ఇంకా పెరిగిపోతున్నది..చివరికి పతాకస్థాయిని చేరుకున్నది. ఆశ్చర్యం! ఇప్పుడు గుర్రం కాళ్ళు నేలమీద ఆనటం లేదు! అది ఎగిరిపోతున్నది, నిజంగానే!! క్రింద, నేలమీద, నిలబడి రాజుగారూ, మంత్రిగారూ, సైనికులూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు.
బ్రాహ్మడి భార్యకైతే ఇప్పుడు నిజంగా ఉత్సాహం వచ్చింది-
"పదండీ, పదండీ! గుర్రాన్ని క్రిందికి దింపండి! రాజుగారికి మీ మహిమను చూపించండి! మన అదృష్టం పండింది!" అంటోంది.
"నాకు రాదే, గుర్రం ఇష్టం గుర్రానిది. దానికి ఇష్టమైతే ఎగురుతుంది, లేకపోతే నడుస్తుంది-లేకపోతే, ఊరికే పడుకుంటుంది- ఇందులోనేనెవ్వరు, నువ్వెవ్వరు, రాజెవరు?" అన్నాడు బ్రాహ్మడు, వివేకంతో. వాళ్ల మాటలు విన్నట్లుగానే, గుర్రం వేగం తగ్గించింది. చివరికి అది నేల దిగి, రాజు ముందరికి వచ్చి నిలుచున్నది.
రాజుగారు బ్రాహ్మడిని అభినందించారు. సన్మానించారు. సగం రాజ్యం ఇస్తామన్నారు. కానీ బ్రాహ్మడు వద్దన్నాడు. బదులుగా రాజుగారు ఇచ్చిన అపారమైన ధనాన్ని తీసుకొని, వెను వెంటనే పెట్టే-బేడా సర్దుకొన్నాడు. భార్యను వెంటబెట్టుకొని వేరే దేశానికి వెళ్ళిపోయాడు- ఎవరు ఎంత చెప్పినా వినకుండా.
మరునాడు రాజుగారు గుర్రం ఎక్కారు, హుందాగా. "గాలిలోకి ఎగురు" అని ఆదేశించారు- లాభం లేదు. గుర్రాన్ని తన్నారు. కొట్టారు- ఏంచేసినా గుర్రం పరుగు పెట్టింది తప్ప, గాలిలోకి మాత్రం ఎగరలేదు. సాయంత్రం వరకూ ప్రయత్నించి, ప్రయత్నించి- చివరికి రాజుగారు అలిసిపోయారు.
గుర్రాన్ని వెనక్కి తెచ్చి, క్రిందికి దిగారు-కోపంగా. సేవకులు దాన్ని పట్టుకొని, జీను తొలగించారు-
మరుక్షణం గుర్రం కట్లు తెంచుకున్నది. గోడలు దాటుకుంటూ పరుగు మొదలుపెట్టింది..ఇంకా ఇంకా వేగంగా పరుగెత్తింది..చూస్తూండగానే అది గాలిలోకి ఎగిరింది! పడమటన మెరిసే చుక్కలాగా, చివరికి అదృశ్యమైపోయింది!