అనగా అనగా ఒక ఊరిలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రంగయ్య కొడుకు మల్లయ్య- చాలా అమాయకుడు. వయసు పెరుగుతున్నది కానీ, వాడికి ఇంకా లోకపు తీరు అర్థం కాలేదు.

రంగయ్య రోజూ ఉదయాన్నే లేచి, గేదెలను తోలుకొని పొలానికి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత వచ్చి గేదెలను పశువుల పాకలో విడిచి, వాటికి మేత తెచ్చేందుకని మళ్ళీ వెళ్ళేవాడు. అయితే మల్లయ్య మాత్రం బడిలో వచ్చీ-రాని చదువు చదువుకుంటూ ఉండేవాడు తప్పిస్తే, తండ్రికి పనిలో ఏవిధంగానూ సాయపడేవాడు కాదు.

ఒక సారి, బడిలో అయ్యవారు "వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" చెప్పారు, పిల్లలకు. "వీర బ్రహ్మేంద్ర స్వామి చిన్న తనంలో పశువులు కాసేవాడు. పశువులు కాయటం ఏమంత తక్కువ పని అనుకోకండి" అని అయ్యవారు చెబుతుంటే, మల్లయ్యకు 'ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి తమ గేదెల్ని కాద్దామా' అనిపించింది. "వీర బ్రహ్మంగారు గేదెల్ని మేపేందుకని అడవికి తీసుకెళ్ళి, ఆ మంద చుట్టూ పుల్లతో ఒక గీత గీసేవాళ్ళట. ఆపైన తాను అక్కడే ఏదో ఒక చెట్టుక్రింద కూర్చొని, కాలజ్ఞానం పాడుకుంటూ ఉండేవాళ్లట. కాలజ్ఞానం ప్రభావం వల్ల, ఆ పశువులు ఏవీ ఆయన గీచిన గీతను దాటి పోయేవి కావట!"

ఇవన్నీ విన్న తర్వాత మల్లయ్యకు గేదెలంటే ఇష్టం పెరిగింది. ఆదివారం రాగానే, వాడు రంగయ్యను ఒప్పించి, గేదెల్ని వెంట బెట్టుకొని తను బయలు దేరాడు అడవికి. అక్కడికి చేరుకున్నాక, బ్రహ్మంగారిలాగా వాడు కూడా గేదెల మంద చుట్టూ పుల్లతో‌ఒక గీత గీసి, తను ఆవలగా ఓ చెట్టు క్రింద కాలజ్ఞానం పుస్తకం పట్టుకొని కూర్చున్నాడు. మధ్య మధ్య వాడు గేదెలకేసి చూసి "ఆహా! ఎంత మహిమ! ఒక్క గేదె కూడా గీతను దాటి వెళ్ళట్లేదు చూడు!" అని మురిసిపోతూ ఉన్నాడు కూడా.

అంతలో, ఎక్కడి నుండి వచ్చిందో మరి, ఒక పులి ఊడి పడింది. వచ్చీ రాగానే అది గీతలోపల మేస్తున్న గేదెలమీదికి దూకి, గబుక్కున ఒక దూడను పట్టుకొని పోయింది! గేదెలన్నీ చెల్లా చెదురయ్యాయి. కాలజ్ఞానం చదువుకుంటూ కూర్చున్న మల్లయ్యకు గేదెలు కాయటంలోని కష్ట సుఖాలు తెలిసి వచ్చాయి.

అయితేనేమి, ఇంటికెళ్ళాక రంగయ్య చేతిలో తిట్లు మాత్రం తప్పలేదు మల్లయ్యకు! ఏ పనైనా సరే, మనసు పెట్టి చేస్తే తప్ప సుఖం లేదని వాడికి అర్థమయ్యేసరికి, అలా ఒక దూడ పులి వాత పడనే పడింది, పాపం!