అనగా అనగా నలుగురు బిచ్చగాళ్ళుండేవాళ్ళు. సన్యాసులకుమల్లే కాషాయ బట్టలు వేసుకొని, వాళ్ళు ఊరూరా తిరిగి అడుక్కునేవాళ్ళు.

ఒకసారి వాళ్లకు ఆ దేశపు రాజుగారిని యాచించాలని కోరిక పుట్టింది. అయితే వాళ్ళు ఏ శాస్త్రాలూ చదువుకోలేదు. పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాదాయె! రాజుల్ని ఏనాడూ చూడలేదు; వాళ్లని కలిశాక ఏమనాలో, వాళ్లని ఎలా సంబోధించాలో, ఏమని ఆశీర్వదించాలో- ఏమీ తెలీలేదు వాళ్ళకు. ఒక పొలం ప్రక్కన నిలబడి ఆ సంగతినే చర్చించటం మొదలు పెట్టారు వాళ్ళు. అంతలో వాళ్లకొక పందికొక్కు కనబడింది. దాన్ని చూడగానే మొదటివాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది- "నాకు తెలిసిపోయింది! రాజును ఎలా సంబోధించాలో నాకు అర్థమైంది! రాజును కలిసి నేనంటాను, 'పందికొక్కులు! చూడు, మట్టిని ఎట్లా తోడి పోస్తున్నాయో! పరపర! కిరకిర!' అని!" అన్నాడు వాడు సంతోషంగా.

మిగిలిన ముగ్గురికీ ఇంకా ఏమీ ఆలోచనలు రాలేదు. కానీ 'నడుస్తూపోతే అవే వస్తాయిలె'మ్మని, వాళ్ళంతా రాజధాని వైపుకు నడవటం మొదలుపెట్టారు. ఇంకొంచెం దూరం వెళ్ళే సరికి, ఒక చెరువు గట్టున కూర్చున్న కప్పలు కొన్ని కనబడినై, వాళ్లకు. వీళ్లు వచ్చేంత వరకూ బెకబెకమంటూ ఉన్నవల్లా, వీళ్లని చూడగానే అరవటం మానేసి అవి అన్నీ బుడుంగున నీళ్లలోకి దూకినై.

వాటిని చూడగానే రెండోవాడికి తను రాజుగారితో ఏమనాలో తెల్సిపోయింది!‌ ' తనంటాడు-" లావుపాటి కప్ప, బెకబెక కప్ప! దిగబడింది చూడు, బంక బంక కప్ప! ' అని! వాడు ఆసంగతే చెప్పాడు తోటి వాళ్లకు.

ఇంకొంత దూరం పోయాక, పంది ఒకటి బురదలో పడి పొర్లుతూ కనబడింది వాళ్లకు. దాన్ని చూడగానే మూడోవాడికి రాజుగారితో తను ఏమి అనబోతున్నాడో తెల్సిపోయింది: తనంటాడు-"ఇంకా రుద్దు! ఇంకా రుద్దు! ఇంకొన్ని నీళ్లతో రుద్దు! నాకంతా తెలుసు బిడ్డా, నువ్వు ఏం చెయ్యబోతున్నావో" అని!

నాలుగో వాడికే, ఇంకా ఏ ఆలోచనా రాలేదు. వాడు ఆ విషయమై విచార పడేంతలోగా వాళ్ళకు నగర పొలిమేరలు కనబడ్డాయి. "నాకు తెల్సింది! రాజుగారికి నేను చెబుతాను-'చిన్న రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు! కొత్వాలుది ఎంత పని! తిరుగు తిరుగు కొత్వాలూ!' అంటాను నేను!" అన్నాడు వాడు. ఆపైన వాళ్ళు దారిన పోయే దానయ్యనొకడిని దొరకపుచ్చుకొని, ఈ నాలుగు ముక్కలూ రాసి పెట్టమన్నారు. 'రాయనిదే వదిలేట్లు లేరు దేవుడా' అనుకొని, ఆయన తనే ఓ కాగితం తెచ్చుకొని, ఈ నాలుగు వాక్యాలూ రాసిచ్చి చక్కాపోయాడు.

నలుగురు బిచ్చగాళ్ళూ దాన్ని పట్టుకొని నేరుగా రాజుగారి దగ్గరికి పోయారు. కాగితాన్ని ఆయన చేతిలో పెట్టనైతే పెట్టారు కానీ, ఎవరికి వాళ్ళు తాము ఏమనాలో మర్చిపోయి, ఊరికే నిలబడ్డారు! రాజుగారు ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, 'ఏం రాసుందో' అని చదివారు. ఎంత చదివినా తలా తోకా లేని ఆ వాక్యాలు ఆయనకు ఏమాత్రమూ అర్ధం కాక బిక్కమొఖం వేశాడాయన.

రాజుగారు అట్లా బిత్తరపోవటం చూసి మనవాళ్ళు నలుగురికీ భయం వేసింది- 'రాజుగారు ఆ కాగితాన్ని తమకిచ్చి చదవమంటాడేమో! మనకేమో చదవటం రాదు! మనం ఒకటి చెబితే దానయ్య ఒకటి రాసాడల్లే ఉంది!" అని, నలుగురూ కూడబలుక్కున్నట్లు, అప్పటికప్పుడు పంచెలు ఎగకట్టి, వెనక్కి తిరిగి చూడకుండా బయటికి పరుగు తీశారు. "ఆగండి! ఆగండి!" అని రాజుగారు ఎంత అరిచినా ఆగకుండా వాళ్ళు ఆఘమేఘాలమీద పరుగెత్తిపోయారు, ఎలాగైనా తప్పించుకుంటే చాలుననుకుంటూ.

ఈ రాజుగారికి ఒక దొంగ మంత్రి ఉన్నాడు. రాజుగారికి గడ్డం గీసేందుకు వచ్చే మంగలివాడూ చెడ్డవాడే. సరిగ్గా మన 'సాధువులు' నలుగురూ కాగితాన్ని రాజుగారి చేతికిచ్చి పారిపోయిన రోజునే. మంత్రి మంగలిని కలిసి, వాడిని తనవైపుకు తిప్పుకున్నాడు. "మరునాటి రోజు ఉదయం రాజుగారికి గడ్డం గీసేటప్పుడు, అదే చాకుతో రాజుగారిని చంపెయ్యాలి" అని నిర్ణయించుకున్నారిద్దరూ.

అంతటితో ఆగక, దొంగ మంత్రి వెళ్ళి, ఆ రాజ్యపు కొత్వాలునూ తనవైపుకూ తిప్పుకున్నాడు. "రాజుగారి అంత:పురానికి ఈ రోజే కన్నం వేసి, రాత్రికి రాత్రే అంత:పురంలోని సంపదనంతా కొల్లగొట్టాలి" అని కొత్వాలునూ ప్రేరేపించాడు మంత్రి.

అనుకున్న ప్రకారం ఆరోజు రాత్రి మంత్రీ, కొత్వాలూ ఇద్దరూ రాజుగారి అంత:పురానికి ఉన్న మట్టిగోడకు కన్నం పెట్టటం మొదలెట్టారు. అయితే వాళ్ళిద్దరూ ఊహించని విధంగా, రాజుగారు లోపలే కూర్చొని ఉన్నారు- మేలుకొని! ఊరికే లేరు; "నలుగురు సాధువులు ఈరోజు ఉదయం నాచేతికి ఇచ్చి పోయిన కాగితంలోని వాక్యాల అర్థం ఏమై ఉంటుంది?" అని ఆలోచిస్తూ, పదే పదే ఆ వాక్యాల్ని గట్టిగా చదువుకుంటూ ఉన్నారు!!

మంత్రీ, కొత్వాలూ గోడను సగం త్రవ్వేసరికి, వాళ్ళకు రాజుగారి గొంతు వినబడ్డది ఉరుముతున్నట్లు- "పందికొక్కులు! చూడు, మట్టిని ఎట్లా త్రవ్విపోస్తున్నాయో! పరపర! కిరకిర!" అని. మరుక్షణం వాళ్ళిద్దరూ త్రవ్వటం ఆపేసి, క్రిందికి నక్కి కూర్చున్నారు అక్కడే.

అంతలోనే రాజుగారు అన్నారు- "లావుపాటి కప్ప! బెక బెక కప్ప! ఎలా దిగబడిందో చూడు! బంక బంక కప్ప!" అని. అది వినగానే మంత్రికి చెమటలు పోసినట్లు అయ్యింది. ఆ మంత్రి పాపం, లావుగా, గుండ్రంగా- కప్పలాగే ఉంటాడు మరి! "అరే, రాజుగారు నన్ను చూసినట్లున్నారు!" అని అతను కొంచెం వెనక్కి తగ్గాడు.

కానీ కొత్వాలు ధైర్యంగా ముందుకు జరిగి, గోడ సందుల్లోంచి లోపలికి నిక్కి చూశాడు. అంతలో రాజు గారు అన్నారు గట్టిగా-"చిన్న చిన్న రోడ్లు! పెద్ద పెద్ద రోడ్లు! కొత్వాలుది ఎంత పని! తిరుగు తిరుగు కొత్వాలూ!" అని. ఇది వినేసరికి కొత్వాలుకు ఉన్న ప్రాణాలు ఊడినట్లైంది. మరుక్షణం కొత్వాలూ, మంత్రీ ఇద్దరూ తాము వచ్చిన పనిని పక్కన పెట్టి, ఒకటే పరుగు తీశారు! "రాజుగారినుండి పిలుపు వస్తుంది, తామిద్దరికీ జైలు జీవితం తప్పదు!" అని వాళ్ళిద్దరికీ బెంగపట్టుకున్నది.

మరునాడు ఉదయం మంగలి రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికి, ఆయన ఇంకా ఆ కాగితంలోని రాతల గురించే ఆలోచిస్తున్నారు. రాజుగారి మెడను కోసేసేందుకని మంగలి తన కత్తికి సాన పట్టుకుంటుండగా, గడ్డం పనికి తయారై కూర్చున్న రాజుగారు అరిచారు బిగ్గరగా-"ఇంకా రుద్దు! ఇంకా రుద్దు! ఇంకొన్ని నీళ్లతో రుద్దు! నాకంతా తెలుసు బిడ్డా, నువ్వు ఏం చెయ్యబోతున్నావో" అని. ఒక్క క్షణం నిర్ఘాంతపోయిన మంగలి, రాజుగారికి తన పధకం మొత్తం తెలిసిపోయిందనుకున్నాడు. "దొంగ మంత్రి పట్టుబడి, నేరం మొత్తాన్నీ నామీదికే నెట్టినట్లుంది" అని వాడికి ఏడుపు వచ్చింది. వెంటనే వాడు రాజుగారి కాళ్లమీద పడి, "నా తప్పేమీ లేదు ప్రభూ! అంతా దొంగ మంత్రి పన్నాగమే!" అని మళ్లీ మళ్ళీ పాడుతున్నట్లు ఏడవటం మొదలుపెట్టాడు. రాజుగారు వాడిని నోరు మూసుకొమ్మని, 'వాడినీ మంత్రినీ బంధించేందుకు సరైనవాళ్ళు ఎవరా' అని ఆలోచించి, కొత్వాలును పిలువనంపారు!

"తనపని ఐపోయింది" అనుకొని వణుక్కుంటూ వచ్చాడు కొత్వాలు. అతను వచ్చేసరికి, మంగలి ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు- రాజుగారు అంటున్నారు- కాగితంలోకి చూస్తూ "పందికొక్కులు! చూడు, మట్టిని ఎట్లా త్రవ్విపోస్తున్నాయో! పరపర! కిరకిర!" అని. రాజుగారు నిన్న రాత్రి తాము జరిపిన 'దోపిడీ' గురించే చెబుతున్నారనుకున్నాడు కొత్వాలు. గబుక్కున రాజుగారి కాళ్ళు పట్టేసుకొని, రాత్రి ఏం జరిగిందో సర్వం చెప్పి, తప్పు ఒప్పేసుకున్నాడు.

రాజుగారికి ఇదంతా చాలా కొత్తగా ఉంది. వెళ్ళి చూస్తే, నిజంగానే గోడకు సగానికి పైగా కన్నం వేసి ఉన్నది! వెంటనే ఆయన భటులను పిలిచి, మంగలినీ, మంత్రినీ, కొత్వాలునూ బంధించమన్నాడు. ఆ తర్వాత ఆయన తీరిగ్గా తన చేతిలోని కాగితాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకొని మురిసిపోయాడు. తనను కాపాడేందుకే వచ్చిన ఆ "నలుగురు మహాత్ముల్నీ" వెతికి సగౌరవంగా పిలచుకు రమ్మని మనుషులను పురమాయించాడు.

కానీ వాళ్ళెక్కడ దొరుకుతారు? రాజుగారి భయంతో పరుగు పెట్టిన ఆ నలుగురూ ఎంత దూరం పోయారో మరి, ఎవ్వరికీ దొరకలేదు!