చిన్నపల్లి లో సుబ్బయ్య మాస్టారంటే తెలీని వాళ్ళు లేరు.

తెల్లని ధోవతి, ఎర్రంచు కండువాతో ఆయన రోడ్డు వెంబడి నడుస్తుంటే, ఊరు ఊరంతా తెల్లగా మెరిసిపోయినట్లుండేది.

మాస్టారుకొక కొడుకు.

కొడుకు కూడా మా బళ్ళోనే చదువుకునేవాడు.

వాడూ, నేనూ పోటీ పడి చదివేవాళ్లం. ఎప్పుడూ వాడికంటే ఒక మార్కు ఎక్కువే వచ్చేది నాకు. అలాంటిది, ఐదవ తరగతి మెయిన్ పరీక్షకు వచ్చేసరికి, నాకంటే వాడికి ఎనిమిది మార్కులు ఎక్కువొచ్చాయి.

నేను రోజంతా ఏడుస్తూ మూలన కూర్చున్నాను.

సుబ్బయ్య మాస్టారు కొడుకు పట్ల దురభిమానం ప్రదర్శించాడని, లేకపోతే నాకే ఎక్కువ మార్కులు వచ్చి ఉండేవని ఏడ్చాను. సుబ్బయ్య మాస్టారికి పక్షపాత బుద్ధి ఉందన్నాను- తన కొడుకంటే ఆయనకు విపరీతమైన ప్రేమ అని, వాడికంటే బాగా చదివే పిల్లలంటే కుళ్ళు అని- ఏవేవో అన్నాను.

నేనన్నవన్నీ సుబ్బయ్య మాస్టారికి చేరాయేమో-

మరునాడు మాస్టారు నన్ను పిలిచారు వాళ్ళింటికి.

నేను వెళ్ళే సరికి సుబ్బయ్య మాస్టారు మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. ఇంట్లో చాలా పూల మొక్కలు ఉన్నాయి. ఇంటి గోడకు ఆనుకొనే ఒక వేప మొక్క పెరుగుతున్నది. ఇంటి బయట, ఎదురుగా, రోడ్డుకు అవతలివైపున- ఇంకో వేప మొక్క ఉన్నది. మాస్టారు ఆ చెట్టుకు కూడా నీళ్లు పోసి, నన్ను అడిగారు- "ఒరే, ఈ లోపలి మొక్కను, ఆ బయటి మొక్కను నేను ఒకేసారి నాటాను. కానీ ఇదేదో ఒకలాగా పెరిగింది, అది ఇంకోలాగా పెరిగింది- ఎందుకో?" అన్నారు. ఇంట్లో మొక్క నిటారుగా పెరుగుతోంది. బయటి మొక్క మీద పశువులు దాడి చేసినట్లున్నాయి, పొడుగ్గా కాకుండా కొమ్మలు కొమ్మలుగా పెరిగి ఉన్నదది.

"రోడ్డు మీది పశువులన్నీ దీన్ని కొరికినట్లున్నాయండీ" అన్నాను నేను.

"కానీ నేనైతే వీటన్నిటికీ ఒకే ప్రేమను పంచానురా. ఒకే లాగా నీళ్లు పోశాను. ఇంటి లోపల ఉన్న చెట్లనూ, బయట ఉన్న వాటినీ ఒకే లాగా చూసుకున్నాను. ఆ వేప చెట్టు ఏమనుకుంటోందో ఏమో మరి, నాగురించి!" అన్నారు సుబ్బయ్య మాస్టారు.

నేను ఏమీ మాట్లాడలేదు.

"ఇంట్లో కూడా, రకరకాల చెట్లు పెంచానురా. ఏ చెట్టు ఎత్తు దానిదే. కొన్నేమో పూలిస్తాయి, కొన్ని కాయలు కాస్తాయి, కొన్ని పండ్లిస్తాయి, కొన్ని కేవలం నీడనిస్తాయి. దేని ప్రత్యేకత దానిదే. దేన్ని చూసినా నాకు సంతోషం వేస్తుంది. ఇవన్నీ నా శ్రమవల్ల ప్రాణం పోసుకున్నవే. 'ఇన్ని రకాల మొక్కలు, చెట్లు నావల్ల ఎదిగాయీ అనే సంతోషం చాలా బాగుంటుంది- కదూ?" అన్నారాయన.

"అవునండీ" అన్నాను నేను, తలవాల్చుకొని.

ఆ తర్వాత నేను ఎప్పుడూ మార్కులకోసం వెంపర్లాడలేదు. నాకు తక్కువ మార్కులు వేసి అన్యాయం చేశారని ఎవ్వరినీ నిందించలేదు. తక్కువ మార్కులొచ్చిన వాళ్ళని చిన్నచూపు చూడలేదు. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్లని కొండెక్కించి చూడనూ లేదు-

"దేని ప్రత్యేకత దానిదే" అన్న సుబ్బయ్య మాస్టారి మాటలు ఈనాటికీ గుర్తున్నాయి నాకు.

ఈ సంగతి చెబుతున్న రవి కళ్ళలో సుబ్బయ్య మాస్టారు తళుక్కున మెరిశారు.

పిల్లలకు మానవీయమైన చదువులు అందించాలనీ, అర్థవంతమైన చదువుల వల్లనే పిల్లలు సంపూర్ణ వ్యక్తులుగా ఎదగగల్గుతారనీ‌ తపనపడే గురువులందరికీ నమస్కరిస్తూ, ఆ స్ఫూర్తికి దీపస్థంభమై నిలచిన గిజుభాయి బడేకాను ఈ మాసం గురుపూజోత్సవ సందర్భంగా స్మరించుకుంటూ-

మీకందరికీ అభినందనలతో- కొత్తపల్లి బృందం