అమ్మకొడుకులందరూ అన్నదమ్ములే
ఆ పిల్లల నవ్వులన్ని అమ్మ సొమ్ములే
పుట్టిన ప్రతివాడికీ దేశమే అమ్మరా
పరాయివాడు వాడు అంటూ ఎవ్వరూ అనరాదురా
"అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే"

హిందువులు, ముస్లింలు, క్రైస్తవులని విభజన
నమ్మకాలలోగాని అమ్మ కాడ కాదురా
పాల కొరకు పొదుగు కోస్తే రక్తమొచ్చురా
రెచ్చగొట్టి చిచ్చు పెడితే మతం చచ్చురా.
"అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే"

ఇరుగు పొరుగు కలిసుంటాం
బాబాయ్ పిన్నీ అంటాం
రంజానూ దీపావళి అందరి పండుగలంటాం
అనుమానపు చూపుతో అనుక్షణం గండమే
మతమారణహోమంలో దేశం సుడిగుండమే
"అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే"

కార్మికులూ కర్షకులూ ఉద్యోగులు సైనికులు
ఇంజనీర్లు డాక్టర్లు శాస్త్రజ్ఞులు మేధావులు
మతాల మర్మం వద్దని మానవ ధర్మమే ముద్దని
తమ రక్తం ధారపోసి జీవనదులు చేశారు.
"అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే"

చరిత్రలో ఏమైందో ఏరాజేం చేశాడో
తోడబుట్టినోళ్ళను కారకులుగ చూడచ్చా?
మసీదు-చర్చీల్ని కూల్చి ఖురాన్ బైబిల్ని కాల్చే
మతోన్మాదులార మిమ్ము మనుషులుగా చూడచ్చా?
"అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే"

పాటలు వినడానికి Adobe Flash Player తెచ్చుకోండి.
Download this song