ఒక గురువుగారు, శిష్యుడు ఒక బాట వెంబడి నడుస్తూ పోతున్నారు. గురువుగారు ఎందువల్లనో, భయపడుతున్నారు ఈ రోజున. శిష్యుడిని అడిగాడాయన- "దగ్గర్లో గ్రామం ఏదీ ఉన్నట్లు లేదు. కనుచూపు మేరలొ నివాసాలేమీ కనబడటం లేదు. మనం సరైన దారిలోనే వెళ్తున్నామంటావా?" అని. ఆయన గొంతులో ఆత్రుత ధ్వనించింది. రెండు నిముషాలకొకసారిఉ ఆయన తన భుజానికి వ్రేలాడుతున్న జోలెలో చెయ్యి పెట్టుకొని చూసుకుంటున్నారు- మళ్లీ మళ్ళీ గొణు-క్కుంటున్నారు- "చాలా ఆలస్యం అవుతున్నది- ఊరు ఏదీ కనబడటం లేదు. మనం దారి తప్పినట్లున్నాం" అంటున్నారు.
గురువుగారు ఏనాడూ ఇట్లా లేరు. శిష్యుడికి ఆయన ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తున్నది. శిష్యుడికి తెలిసినంతలో గురువుగారు ఎప్పుడూ ఇంత ఆదుర్దా పడలేదు. "ఇంత ఆత్రుతకు కారణం ఏమై ఉంటుంది?" అని శిష్యుడు ఆలోచనలో పడ్డాడు.
బాగా సాయంత్రం అయ్యే వేళకు వాళ్ళకొక కొలను కనబడింది. గురువుగారికి స్నానం చేయాల్సిన వేళ అయ్యింది. ఆయన స్నానానికని ఆ కొలనులోకి దిగగానే, ఒడ్డున కూర్చున్న శిష్యుడు గురువుగారి సంచీని తెరిచి చూశాడు.
గురువుగారి సంచీలో మామూలుగా ఉండే బట్టల నడుమ- రెండు బంగారు బిస్కెట్లు కనబడ్డాయి! ఇప్పుడర్థమైంది శిష్యుడికి- గురువుగారు అలా వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో- ఇదంతా బంగారపు బరువు!
ఏదో ఆలోచన తట్టి, శిష్యుడు ఆ రెండు బంగారు బిస్కెట్లనూ తీసి అక్కడే ఉన్న ఓ చెట్టు క్రింద మట్టిలో పూడ్చి పెట్టేశాడు. దాదాపుగా అంతే బరువున్న రాళ్ళు రెండింటిని తీసి, సంచీలో వేసి, ఏమీ ఎరగనట్లు మామూలుగా కూర్చున్నాడు.
స్నానం అయిన వెంటనే గురుశిష్యులిద్దరూ కాలి బాట వెంబడి నడక కొనసాగించారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు- అయినా దగ్గరలో ఎక్కడ ఊళ్లున్న జాడ లేదు. గురువుగారికి కంగారు హెచ్చింది. ఆయన యధాలాపంగా సంచీలో చెయ్యి పెట్టి, బంగారు బిస్కెట్లను తడిమి చూసుకున్నాడు- అయితే ఇప్పుడు వాటి స్పర్శ ఏదో వేరేగా ఉంది- గబుక్కున వాటిని బయటికి తీసి చూసుకున్నాడాయన- చూస్తే ఏముంది?- బంగారం పోయింది! బంగారు బిస్కెట్ల స్థానే మామూలు రాళ్ళున్నై, రెండు!
మరుక్షణం ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా పోయాయి. అయితే ఆయననే గమనిస్తున్న శిష్యుడు, వెంటనే నిజాయితీగా ఒప్పుకున్నాడు- "మీరు స్నానం చేస్తున్నప్పుడు నేనే- వాటిని తీసి, కొలను గట్టున ఉన్న ఫలానా చెట్టు క్రింద పూడ్చి పెట్టాను" అని. గురువుగారి హృదయం పెద్దది. ఆత్మ విశాలమైనది. ఆయన ఇంకేమీ మాట్లాడలేదు. శిష్యుడిని మరేమీ అడగలేదు.
వాళ్ళిద్దరూ నడక కొనసాగిస్తుండగానే పూర్తిగా చీకటి పడింది. ఆ సమయానికి వాళ్ళకు ఒక పెద్ద రావి చెట్టు కనబడింది. ఇద్దరూ ఆ చెట్టు క్రింద ఆగి, తమ సామాన్లను ప్రక్కన పెట్టుకున్నారు. నేలను శుభ్రం చేసుకొని పడుకున్నారు. రెండు నిముషాలలో ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు!
వాళ్లిద్దరూ ఇంకా ఏకాకులే; నిర్జన అటవీ ప్రదేశంలోనే ఉన్నారు; దగ్గర్లో మనుషులున్న జాడలేవీ లేవు- కానీ బంగారం పోయిన తరువాత, గురువుగారి హృదయం నుండి భయం మాయమైంది విచిత్రంగా. "భద్రత కోసం ఒక ఇల్లూ, ఊరూ ఉండాలి" అన్న అవసరం ఆయనకిక లేకుండా పోయింది. సంచీలో ఉండిన బంగారమే కద, అసలు భయం!