అనిత, స్వప్న, సృజన ముగ్గరూ మంచి స్నేహితురాళ్లు. ఒక రోజు వాళ్ళు ముగ్గరూ బడినుండి తిరిగివస్తున్నారు. అంతలో రోడ్డుమీద ఒక పాప ఏడ్చుకుంటూ కనిపించింది వాళ్లకి.

ముగ్గరూ వెళ్ళి "ఎవరు నువ్వు? ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు?" అని అడిగారు ఆ పాపను.

"నా పేరు కవిత. నాకు ఎవ్వరూ లేరు. నేను ఆ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్నాను. ఇవాళ్ళ ఉదయం ఆ ఇంట్లోవాళ్లందరూ డబ్బులు పోయాయని వెతుకుతున్నారు. నేను బండలు కడుగుతున్నాను.

అంతలో బీరువా కింద లక్ష రూపాయలు దొరికాయి నాకు! నేను వాటిని తీసుకుని అయ్యగారికి ఇవ్వబోయాను; అయితే నేనే ఆ డబ్బులు తీశానని నాపై నిందవేసి, నన్ను వెళ్ళగొట్టారు వాళ్ళు!" ఏడ్చుకుంటూ చెప్పింది కవిత.

"ఏడ్చకు కవితా, మేము నిన్ను మా ఇంటికి తీసుకవెళతాం లే. అనితా- సృజనా, నేను అనితను మా ఇంటికి తీసుకువెళతాను సరేనా?!" చెప్పింది స్వప్న, కవిత చెయ్యి పట్టుకుంటూ.

ఇద్దరూ స్వప్న వాళ్ల ఇల్లు చేరుకున్నారు.

"అమ్మా, ఈ అమ్మాయి కవిత- నా స్నేహితురాలు " స్వప్న చెప్పింది.

"నీ స్నేహితురాలా? నేనెప్పుడూ చూడలేదే?!" అడిగింది స్వప్న వాళ్ల అమ్మ.

"అవునమ్మా! కవితని ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు నువ్వు. ఆ మూలమీద ఇంట్లో పనిమనిషిగా ఉండేది కవిత. తను దొంగతనం ఏదీ‌చెయ్యకపోయినా, తన మీద ఆ నింద వేసి గెంటేశారట, ఆ ఇంటి వాళ్ళు. రోడ్డు మీద తను ఏడుస్తూ కనిపించిందమ్మా, దాంతో నాకు తనని మన ఇంటికి తీసుకు రావాలనిపించింది. "మా అమ్మ చాలా మంచిది.. ఎవర్నైనా ఇంట్లోకి పిలుచుకుంటుంది..రా" అని తనని మన ఇంటికి తీసుకు వచ్చా" చెప్పింది స్వప్న.

"ఒద్దులేమ్మా, ఇట్లా మనకు తెలీని వాళ్ళను మనం‌ ఇంట్లోకి పిలుచుకోకూడదమ్మా" నచ్చజెబుతున్నట్లు అన్నది స్వప్న వాళ్ళ అమ్మ. వింటున్న కవిత ముఖం చిన్నబోయింది.

"ఇప్పుడు నువ్వు ఒద్దంటే తను ఎక్కడికి వెళుతుందమ్మా?! ఉండనియ్యి , కొన్ని రోజులు.." బ్రతిమాలుతూ అడిగింది స్వప్న. కూతురు బ్రతిమిలాడ్డంతో ఇష్టం లేకపోయినా ఆ పాపను తమ ఇంట్లో కొద్ది రోజులపాటు ఉండనిచ్చేందుకు ఒప్పుకుంది స్వప్నవాళ్ళ అమ్మ.


మరునాడు స్వప్న బడికి బయలుదేరుతూ కవితను అడిగింది- "కవితా, నావెంట బడికి వస్తావా?" అని. "నాదగ్గర డబ్బులు లేవు కదా, ఎలా వస్తాను?" అంది కవిత.

"మా బళ్ళో ముందు ఒక్కసారి మాత్రం‌ డబ్బులు కట్టించుకుంటారు. ఆ తర్వాత మనం చదువుకుంటూ పోవచ్చు. మన చదువు పూర్తయ్యాక, మనం‌కట్టిన డబ్బుల్లో సగం వాళ్ళు వెనక్కి ఇచ్చేస్తారు మళ్ళీ! అందుకని ఏం పర్లేదు" అంది స్వప్న.

"మరి నావంతు డబ్బులు ఎట్లాగ?" అంది కవిత.

"మా నాన్న కడతారులే!" అంది స్వప్న.

వీళ్ళ మాటలు వింటున్న స్వప్న వాళ్లమ్మ "ఏంటే, ఏమిటి, 'నాన్న కడతారు' అని చెబుతున్నావు?" అంది.

"ఏం లేదమ్మా, కవితని బడిలో చేరమంటున్నాను; 'ఫీజు డబ్బులు నాన్న కడతారులే' అని చెబుతున్నా తను రావట్లేదు" అంది స్వప్న.

"ఒద్దులేమ్మా! తనకి చదువు వద్దులే. నువ్వు వెళ్ళు చాలు. తను మన ఇంట్లో పని చేస్తుంది" అంది స్వప్న వాళ్లమ్మ.

స్వప్న ఒప్పుకోలేదు. "పిల్లలందరూ చదువుకోవాల్సిందే అమ్మా, కావాలంటే ఎవరినైనా అడుగు.." అని మొదలుపెట్టింది. అంతలో వాళ్ల స్నేహితురాళ్ళు సృజన, అనిత వచ్చారు అక్కడికి. అందరూ కలిసి అడిగేసరికి, స్వప్న వాళ్లమ్మ అయిష్టంగానే కవితని బడికి పంపేందుకు ఒప్పుకున్నది.


నాలుగైదు రోజులు గడిచాయి. రోజూ కవిత కూడా స్వప్నతోబాటు బడికి వెళ్ళి వస్తోంది . ఇంటికి వచ్చాక గిన్నెలు తోమివ్వటం, ఇల్లు ఊడ్చటం, తుడవటం, వంటలో సాయం చెయ్యటం.. ఇలా చేస్తున్నది. అయినా స్వప్న వాళ్లమ్మకు తనంటే ఏమంత ఇష్టం ఏర్పడలేదు. "మన ఇంట్లో ఉంటూ బడికి కూడా పోతోంది, అది కూడా మన ఖర్చుతోటే!" అని ఉడికిపోతున్నది ఆవిడ.


ఆరోజున స్వప్న, కవిత, అనిత, సృజన నలుగురూ బడినుండి ఇంటికి వస్తున్నారు. దూరంగా స్వప్న వాళ్లమ్మ కనిపించింది- "ఏయ్ స్వప్నా! అదిగో, అమ్మగారు" చూపించింది కవిత. స్వప్న వాళ్లమ్మకేసి చూస్తుండగానే ఘోరం జరిగిపోయింది.. ఎదురుగా వస్తున్న బస్సొకటి స్వప్నవాళ్ల అమ్మను గుద్దేసింది! పిల్లలు నలుగురూ గబగబా స్వప్న వాళ్ల అమ్మ దగ్గరికికి పరుగు పెట్టారు.

స్వప్న వాళ్లమ్మ నేలమీద పడిపోయి ఉన్నది-రక్తం కారుతున్నది. అది చూడగానే స్వప్న కళ్ళు తిరిగి పడిపోయింది. కవిత మటుకు వెంటనే తమ దగ్గరున్న జేబురుమాళ్ళతో స్వప్న వాళ్లమ్మకు కట్లు కట్టింది, సపర్య చేసింది; అంబులెన్సుకు, స్వప్న వాళ్ల నాన్నగారికి ఫోను చేయించింది; ఆస్పత్రిలో చేర్పించి వైద్యం మొదలు పెట్టించింది. అందరూ ఆ పాప చొరవను, ధైర్యాన్ని ప్రశంసించారు.

స్వప్న వాళ్లమ్మకు మరునాటి రోజునగానీ తెలివి రాలేదు. మరి కొన్నాళ్ళు ఆవిడ ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది. ఆ మూడు నాలుగు రోజులూ కవిత పెద్దమ్మాయిలాగా ఇంటిని నిర్వహించటమే గాక, ఆస్పత్రికి కావలసిన వస్తువులన్నిటినీ కూడా సమయానికి అందేట్లు చూసింది. ఇంటికి వచ్చాక స్వప్న వాళ్లమ్మ కవితకు ధాంక్స్ చెప్పింది- "నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనమ్మా! ఇన్ని రోజులూ నిన్ను చిన్న చూపు చూశాను. నన్ను క్షమించు" అన్నది. "అదేంటమ్మా! మీరు నాకు ఉండటానికి చోటిచ్చారు; బడికి పంపుతున్నారు- అంతకంటే ఇంకేం కావాలి నాకు?" అన్నది కవిత.

అటుపైన కవిత వాళ్ళింట్లో ఒక భాగం అయిపోయింది. కవిత, స్వప్నల స్నేహ బంధం కలకాలం నిల్చింది.