కొత్తపల్లి పాఠశాలకు హెడ్మాస్టర్‌గా బదిలీమీద వచ్చి చేరారు కామేశం గారు. మొదటిరోజు అసెంబ్లీ అయిపోయేంతలోనే ఏడో తరగతి చదివే వాసు వచ్చి, "పంతులుగారూ! నా జామెట్రీ బాక్సు కనిపించట్లేదు. రాత్రే మా నాన్నగారు కొత్తది కొని తెచ్చారు.
ఇప్పుడు అది పోయిందంటే నా వీపు బద్దలు చేస్తారండీ!" అని ఏడ్వసాగాడు. కామేశంగారు అందరినీ అసెంబ్లీలోనే నిలబెట్టి సంచులన్నీ వెతికించారు. జామెట్రీ బాక్సు మాత్రం దొరకలేదు.
తర్వాత రెండో రోజున ఆరో క్లాస్ చదివే ఆనంది "మాస్టారూ! నా కొత్త పెన్ అసెంబ్లీ నుండి వచ్చేసరికి నా బ్యాగ్ లో లేదండీ! మా అమ్మ చంపేస్తుందండీ !" అని ఆయన ఆఫీస్ గదికి వచ్చి చెప్పి, ఎక్కిళ్ళు పెట్టి ఏడ్వసాగింది.
"పాపా! నువ్వెళ్ళి క్లాస్‌లో కూర్చో. నేను వచ్చి చూస్తాను " అని చెప్పి పంపారు కామేశంగారు. వెంటనే స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులందరితోటీ ఈ విషయం గురించి చర్చించారు.
"సార్ ! మన బళ్లో ఇలాంటి దొంగతనాలు రోజూ జరుగుతూనే ఉన్నాయండీ! ఎవరు చేస్తున్నారో తెల్సుకోలేక పోతున్నాం. ఎవర్నీ దండించలేక పోతున్నాం. ఎవరినైనా అనుమానించి అడిగితే వారి తల్లిదండ్రులు వచ్చి యాగీ చేస్తున్నారు. ఇదింతే మాస్టారూ! మనం ఏమీ చేయలేం. వదిలేయాల్సిందే!" అన్నారు ఉపాధ్యాయులు.
అందరి అభిప్రాయాలూ విన్నాక కామేశం గారు చెప్పారు: "చూడండి, ఇంతవరకూ జరిగినదాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి! నాకు ఏం ఆనిపిస్తున్నదంటే, వారం రోజుల్లో మనం మన పాఠశాలలో ఒక 'ఆనెస్టీ స్టాల్ 'ని ప్రారంభిద్దాం .
దాని నిర్వహణ బాధ్యత ప్రధానంగా నాదే. అయితే మీలో ఎవరికి ఎప్పుడు ఖాళీ సమయం ఉంటే అప్పుడు వాళ్ళు దీన్ని దగ్గర ఉండి నడపండి!" అని చెప్పారు.
ఉపాధ్యాయులందరికీ అనుమానమే- అలవాటై మొద్దుబారిపోయిన దొంగలు ఆ స్టాల్‌లోని సరంజామానంతా ఒక్క రోజులో దోచేస్తారని. కానీ ప్రధానోపాధ్యాయునికి ఎదురు చెప్పలేక, అందరూ మౌనం వహించారు.
ఒక వారం రోజుల్లో కామేశంగారు 'ఆనెస్టీ స్టాల్'ను ఆవిష్కరింప జేశారు. తన వరండాలో కిటికీలోంచి తాను కనిపించేలా ఒక టేబుల్, దానిమీద అలమారలా వున్న ఒక చెక్క సాధనాన్ని చేయించారు. దానిలో వరుసగా పేజీల వారీగా నోటు పుస్తకాలున్నై.
ఆ నోటు పుస్తకాలలో ప్రతిదీ ప్రత్యేకమైన పేజీనే- ప్రతి పేజీమీద 'ఆనెస్టీస్టాల్' అని ముద్ర వేసి ఉంది. పెన్సిళ్లు, పెన్నులు, ఎరేజర్లు, జామెట్రీ బాక్సులు , పలకలు, బలపాలు- ఇలా బడి పిల్లలకు అవసరమైన సామగ్రి అంతా ఏర్పరచారు . ప్రతి వస్తువు మీదా 'ఆనెస్టీ స్టాల్' అని ముద్రవేసి, ఆ ప్రక్కగా వస్తువు వెల ముద్రించి ఉంది. ఆ టేబుల్ మీదే ఒక ప్రక్కగా డబ్బుల పెట్టె ఉంచారు.
ఆ రోజున అసెంబ్లీలో కామేశంగారు వివరించారు: "పిల్లలూ! 'ఆనెస్టీ'- అంటే ఏంటో తెలుసుగా, 'నిజాయితీ'- మనందరికీ నిజాయితీ చాలా ముఖ్యం. ఆ నిజాయితీని ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకు గాను ఈరోజు నుండి మన బళ్ళో 'ఆనెస్టీ స్టాల్ 'ని ప్రారంభిస్తున్నాం.
ఈ స్టాల్‌లో మీకు కావలసిన చాలా వస్తువులు లభిస్తాయి. ప్రతిదీ బయట దుకాణాలలోకంటే తక్కువ ధరకు లభించేలా చర్యలు తీసుకున్నాం. అయితే ఈ స్టాల్ లో 'అమ్మేవాళ్ళు' అంటూ ఎవరూఉండరు. వస్తువును తీసుకున్న విద్యార్థే, తప్పనిసరిగా ఆ వస్తువు పేరిట బిల్లు రాసుకోవాలి; తనంతట తానుగా ఆ మొత్తాన్ని పెట్టెలో వేసి వెళ్ళాలి.
దూరంగా కూర్చొని ఉన్న ఇంచార్జ్ ఉపాధ్యాయుడు , కేవలం చూపరిగా చూస్తూ ఉంటాడు; చిల్లర అవసరమైన వారికి చిల్లర అందిస్తుంటాడు-అంతే. ఆఫీస్ గదిలోంచి నేను కూడా ఒక కన్ను వేసి ఉంచుతాను.
ఏ రోజుకారోజు వస్తువుల లెక్క , సొమ్ములెక్క ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి చూస్తుంటారు. లెక్క సరిపోతుంటే మంచిదే- లేక పోతే ఎక్కడో పొరబాటు జరుగుతున్నట్లు- అలాంటప్పుడు ఇదే మనందరి నిజాయితీకి పరీక్ష అవుతుంది. మరింత కట్టుదిట్టంగా స్టాల్‌ని నడపవలసి వస్తుంది. అలాంటి అవసరం అసలు తలెత్తదనే నానమ్మకం.. అర్థం అయ్యిందిగా?" అన్నారు. పిల్లలంతా తలలూపారు.
కామేశంగారు ఇంకా చెప్పారు "మీలో ఎవరైనా మీకు అవసరమైన వస్తువులు కొనాలను-కున్నారు; కానీ డబ్బులు తెచ్చుకోడం మర్చిపోయారనుకోండి- అట్లాంటివాళ్లకు కూడా ఆనెస్టీస్టాల్ సాయం చేస్తుంది. స్కేళ్ళు, జ్యామెట్రీ బాక్సులవంటి కొన్ని వస్తువులను మన బడి పిల్లలు క్లాసుకు తీసుకెళ్ళి వాడుకోవచ్చు; ఆ తర్వాత వాటినే కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు; లేకపోతే క్లాసు తర్వాత తెచ్చి వాపసు ఇవ్వవచ్చు" అని.
వింటున్న పిల్లల ముఖాలు వికసించాయి. అటుపైన ఆనెస్టీ స్టాల్ ప్రారంభం అవ్వగానే పిల్లలంతా ఎగబడి వస్తువులను తీసుకున్నారు . అందరినీ వరుసగా ఒకరి తర్వాత ఒకరిని లోనికి పంపసాగాడు స్కూల్ లీడర్. ఉపాధ్యాయుల పని కేవలం చిల్లల అందించటమే.
ఆశ్చర్యం! ఆనెస్టీ స్టాలు లెక్క ఏనాడూ తప్పలేదు, స్టాలు వస్తువు ఏ ఒక్కటీ పోలేదు! అంతేకాదు, బడిలో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి!
"కొంతమంది పిల్లలు తమకు బళ్ళోకావల్సిన వస్తువులు ఇంట్లోనే మర్చిపోయివస్తుంటారు. తీరా వచ్చాక, ఉపాధ్యాయులు కోప్పడతారు కదా, అని వేరేవాళ్ల సంచిలోంచి తీసేసుకుంటుంటారు. అడిగితే అవి తమవే అనేస్తుంటారు. అయితే ఇప్పుడు వాళ్లకు ఆ అవసరమే లేదు- ఆనెస్టీ స్టాలులోంచి తెచ్చుకోవచ్చు; తిరిగి వాపసు ఇవ్వవచ్చు కూడాను- అందువల్ల వాళ్ళెవరూ తప్పుపని చేయట్లేదు" అని చెప్పారు కామేశంగారు, వారాంతపు ఉపాధ్యాయుల సమావేశంలో.
"అవునండీ! ఊరికే నోటితో -‘ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం నేరం - పరుల సొమ్ము పామువంటిది’ అని నీతులు చెప్పేకంటే, నీతిని పాటించే విధానాన్ని నేర్పటం; అవసరానికి కావల్సిన వస్తువుల్ని అందుబాటు లోకి తేవటం చేస్తే చాలు- ఎవ్వరికీ ఇక దొంగిలించే అవసరం ఉండదు. పిల్లలు తమ చిట్టి చిట్టి అవసరాలకు అమాయకంగా దొంగిలడం అలవాటుచేసుకుని, ఆ తర్వాత పెద్ద నేరాలు చేయకుండా, పసితనంలోనే చాకచక్యంగా ఆపేయడం కూడా ఉపాధ్యాయులుగా తమ బాధ్యత అని స్టాఫ్ అంతా తెల్సుకున్నారు. మొక్కగానే వంచాలి, మానైనాక వంగదుకదా!
ఇలా ఆనెస్టీ నేర్పడంతో పాటుగా, దొంగతనాలూ ఆగిపోడంతో ఉపాధ్యాయు-లంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపంతులు కామేశం గారు కొత్తవిషయాన్ని తమతో చేయించి నిరూపించిన విధానానికి అంతా ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.