అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా చెట్లు ఉండేవి . ఆ చెట్లల్లో సొర తీగలు, పెద్ద పెద్ద మామిడి చెట్లు ఉండేవి.
సొరతీగలు సన్నగా ఉంటాయి కదా, సోలిపోతూ? అందుకని అవి ఎప్పుడూ పెద్ద చెట్లని అల్లుకొని ఉండేవి. మామిడి చెట్లు మాత్రం గట్టిగా, బలంగా నిలబడి ఉండేవి.
వాటిని చూస్తే మామిడి చెట్లకు చులకన. "మీరు ఎప్పుడూ ఇంతేనా? ఇలానే బక్కగా ఉంటారా? చిన్న గాలి వస్తే కింద పడిపోతారు!" అని ఎగతాళి చేస్తూ ఉండేవి.
సొరతీగలకి పాపం ఏం జవాబు ఇవ్వాలో తెలిసేది కాదు.
"దేవుడు మమ్మల్ని ఇట్లా పుట్టించాడెందుకో? మామిడి చెట్లలాగా బలంగా తయారవ్వాలంటే ఏం చేయాలో!" అని అవి మౌనంగా ఏడ్చుకుంటూ ఉండేవి.
కొన్నాళ్లకు ఆ తీగలకి చక్కని అందమైన పూలు పూచాయి. ఆ పూలనుండి వచ్చే కాయల కోసం ఎదురుచూడటం మొదలు పెట్టాయి సొరతీగలు.
"అబ్బో! పిల్లలకోసం ఎదురు చూస్తున్నారా? మీ పిల్లల గురించి ఇంక ఏం అంటాంలే, మీరే ఇట్లా ఉంటే మీ పిల్లలు ఎట్లా ఉంటాయో, ఇక చెప్పినట్లే" అని దెప్పటం మొదలుపెట్టాయి మామిడి చెట్లు.
"నిజంగానే మా పిల్లలు బలహీనంగా పుడతాయేమో! మాకసలు కాయలంటూ ఏవైనా వస్తాయో, రావో" అని భయపడసాగాయి సొరతీగలు.
మెల్లగా సొర పిందెలు కాశాయి. చిట్టి చిట్టి పిందెలు..మామిడి చెట్లు వాటిని చూసి నవ్వాయి. "మేం చెప్పలేదూ? ఇంతే, బలహీనపు తల్లులు-బలహీనపు పిల్లలు!" అన్నాయి.
అంతలో పెద్ద గాలివాన వచ్చింది. ఎక్కడలేని వేగంతో గాలులు వీచాయి. భీభత్సం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ విరిగి పడ్డాయి మామిడి కొమ్మలు.
సొర పిందెలు మటుకు తీగల్ని అంటిపెట్టుకొనే ఉన్నాయి. తర్వాత వారం రోజుల్లో అవి కాస్తా పెరిగి పెద్దయ్యాయి. లావుగా తయారయ్యాయి.
అటుగా ఎగురుకుంటూ వచ్చిన సీతాకోక చిలుకలు సొర పూలపై వాలి చెప్పుకున్నాయి- "సొరకాయలు ఎంత బాగా వచ్చాయో చూడు! పాపం పొగరుమోతు మామిళ్ళ కొమ్మలన్నీ విరిగి పోయాయి. అణకువతో ఉండటం అందుకేనట, మంచిది!" అని.
అది విన్న పెద్ద చెట్లన్నీ కొమ్మలు వంచుకొని అనుకున్నాయి "నిజమే, రూపాన్ని చూసి ఎవ్వరినీ చిన్నబుచ్చకూడదు. పొగరుమోతుతనం అస్సలు మంచిది కాదు" అని.