చాలాకాలం క్రితం శ్రావస్తిలో 'ధనదత్తుడు' అనే వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతను మహా ధనికుడు. మహారాజులకు కూడా అతనికి ఉన్నంత వైభవం ఉండదని ప్రజలు అనుకునేవాళ్లు. ధనదత్తుడు కూడా అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేస్తూ ధర్మంగా ప్రవర్తించేవాడు; అలా అందరి మన్ననా పొందేవాడు. అయితే వింత ఏమిటంటే, యువకుడిగా ఉన్నప్పుడు ఇదే ధనదత్తుడు ఎన్నో కష్టాలు పడ్డాడు.
అప్పట్లో ఎంత వెతుక్కున్నా అతనికి పనే దొరికేది కాదు. పెట్టుబడి మాట దేవుడెరుగు, తినేందుకే ఏమీ లేక పస్తులుండేవాళ్ళు అతనూ, అతని కుటుంబమూ. ఆ సమయంలోనే అతని భార్య మరణించింది. ఒక్కగానొక్క కొడుకు తప్పిపోయాడు.
అంతలో ఇక వేరే ఏ దారీ కనబడని ఆ చీకటిరోజుల్లోకి అకస్మాత్తుగా వెలుగు ప్రవేశించింది. బండిమీద చిన్న వ్యాపారం పెట్టుకునేందుకు వీలు చిక్కింది. చూస్తూ చూస్తూండగానే ధనదత్తుడు ఓడల మీద వర్తకం చేసే స్థాయికి చేరుకున్నాడు; అపర కుబేరుడు అయ్యాడు.
భౌతికంగా చాలా డబ్బు సంపాదించినా, ధనదత్తుడి మనసు మాత్రం అశాంతితో కొట్టు- మిట్టాడేది. "ఇదంతా ఎందుకు, ఎవరికోసం?" లాంటి ఆలోచనలు అతన్ని నిరంతరం పట్టి పీడించేవి. తప్పిపోయిన కొడుకు కోసం అతని మనసు తహతహలాడేది. ఏదో శక్తి తన కొడుకుని తన దగ్గరికి చేర్చినట్లు అనిపిస్తూండేది అతనికి ఒక్కోసారి. అసలతను ఆ ఆశతోటే బ్రతుక్కుంటూ వచ్చాడు.
కొడుకుని వెతకటం కోసం అతను చేయని ప్రయత్నమంటూ లేదు. రానురాను ధనదత్తుని శక్తి సన్నగిల్లింది. ముసలివాడౌతున్నాడు..
ఆ సమయంలో- ఎట్టకేలకు- అతని ఆశ ఫలించినట్లు తారసపడ్డాడు, కొడుకు సోమదత్తుడు! పెద్దవాడైతే అయ్యాడు కానీ, పరమదరిద్రుడిగా బ్రతికాడతను ఇన్నేళ్ళూ! వాడిని పెంచిన బిక్షగాళ్ళు వాడికి భిక్షం ఎత్తుకోవటాన్ని మించి మరేమీ నేర్పలేదు!
ధనదత్తుడు చెప్పిన గుర్తుల ఆధారంగా వాడిని గుర్తించిన పనివాళ్ళు, వాడికి ధనవంతులకు తగిన బట్టలు వేయబోతే వాడు వేసుకోలేదు; ధనదత్తుడి దగ్గరికి రమ్మంటే వాడు ఓపట్టాన రాలేదు. చివరికి సేవకులు వాడి కాళ్ళూ చేతులూ కట్టిపడేసి ఎత్తుకొచ్చారు తండ్రిదగ్గరికి!
ధనదత్తుడు వాడిని చూడగానే గుర్తించాడు. 'సందేహంలేదు- వీడు తనకొడుకే'.
వాడిని చూసిన ఆనందంలో ధనదత్తుడికి నోట మాట రాలేదు. వాడి పరిస్థితి చూస్తే అతని గుండె తరుక్కుపోయింది. ఆనందంతోటీ, దు:ఖం తోటీ కళ్లలోంచి నీళ్ళు కారగా లేచి కొడుకును కౌగలించుకో-బోయాడు ధనదత్తుడు.
అయితే సోమదత్తుడి స్థితి మరోలాగా ఉన్నది. 'తను భిక్షగాడు' అని తప్ప మరేదీ తెలీదు వాడికి. ధనదత్తుడిని, అతని సేవకులని చూస్తేనే వాడికి వణుకు పుట్టుతున్నది. ధనదత్తుడి మహలులో వాడు కనీసం లేచి కూడా నిలబడలేకపోయాడు.
సేవకులు ఏమి చెప్పారో వాడికి అసలు అర్థమే కాలేదు. దాంతో వాళ్లు కట్లు విప్పిందే తడవు- వాడు లేచి, ఏడుస్తూ, గబుక్కున బయటికి పరుగు పెట్టాడు.
అతని వెంటపడి పట్టుకోబోయిన పనివాళ్ళను వారించి, ఆపాడు ధనదత్తుడు. "పారిపోతున్న వాడిని పట్టుకోవటం వృధా, దానివల్ల ప్రయోజనం లేదు.. ఇప్పుడున్న యీ పరిస్థితులలో వాడు తన కొడుకే అయినప్పటికీ, వాడిని పట్టుకోవటం వల్ల తనకు ఒనగూరే లాభం ఏదీ లేదు" అనుకున్న ధనదత్తుడు ఒకరిద్దరిని నియోగించి, వాడు ఏం చేస్తున్నాడో చూడమన్నాడు.
సోమదత్తుడు అక్కడి నుండి పారిపోయి యధాప్రకారం అడుక్కోవటం మొదలెట్టాడు. తన బట్టలని చింపుకొని, బురద పట్టించుకొని, మకిలిగా తయారయ్యాడు. ఊళ్ళోవాళ్ళు జాలిపడి వేసిన ఎంగిలి మెతుకుల్ని ఏరుకొని ఇష్టంగా తినసాగాడు!
ఆ సమయంలో ధనదత్తుడిని ఊరడించాడు, అతని వద్ద పనిచేసే మిత్రపాలుడు. "మీరేమీ కంగారు పడకండి. నాకు కొంత సమయం ఇవ్వండి. పరిస్థితిని నేను చక్కదిద్దుతాను" అని మాట ఇచ్చాడు ధనదత్తుడికి.
తగిన పథకాన్ని సిద్ధం చేసుకున్నాక, ఒకరోజున సోమదత్తుడు తన వద్ద అడుక్కోవటానికి వచ్చినపుడు, మిత్రపాలుడు వాడికి అన్నం పెట్టి, "ఒరే! నీకు నేను రోజూ అన్నం పెట్టగలను- కానీ నాకేం లాభం?! రాత్రిపూట నా దుకాణానికి కావలిగా పడుకుంటానంటే రోజూ అన్నం పెట్టి, మూడు రూపాయలు కూడా ఇస్తాను, చూడు!" అన్నాడు, ముందుగానే ఒక రూపాయి చేతిలో పెడుతూ.
సోమదత్తుడికి ఆ ఆలోచన నచ్చింది. వాడు రోజూ ఉదయం పూట అడుక్కొని, రాత్రిపూట ధనదత్తుడి దుకాణం ముందు పడుకోవటం మొదలెట్టాడు.
ఇలా కొన్నాళ్ళు గడిచాక, మిత్రపాలుడు వాడిని పిలిచి, "ఒరే! ఉదయం పూట ఇక్కడే నిలబడి వచ్చే పోయే బరువులు మోయరాదురా?! నాకు పని జరుగుతుంది, నీకూ నాలుగు డబ్బులు రాలతై?" అన్నాడు.
అట్లా కొన్ని నెలలు గడిచాక, మిత్రపాలుడు వాడికి దుకాణంలో సరుకులందించే పనిపెట్టి, ఉండేందుకు వసతిగా ఒక చిన్న గది చూపించాడు. ఇలా కొన్ని నెలలయ్యాక, అతను వాడికి యీ సారి లెక్కలు చూసుకోవటం నేర్పి, రెండేళ్ళ తర్వాత నమ్మకం చిక్కగానే దుకాణంలో డబ్బు పనిలో పెట్టాడు. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఆ సరికి సోమధత్తుడు పనిలో బాగా ఆరతేరటమే గాక, మంచి నమ్మకస్తుడు కూడా అయ్యాడు. అప్పుడుగానీ మిత్రపాలుడు వాడిని ధనగుప్తుడి దగ్గరికి తీసుకుపోలేదు.
ధనగుప్తుడు యీసారి వాడిని బాగా పరిశీ-లించి, వ్యాపారం గురించి రకరకాల ప్రశ్నలడిగి, "నిన్ను నా ఆంతరంగికునిగా పెట్టుకుంటాను- జీతంతో పాటు నా వ్యాపారంలో వాటా కూడా ఇస్తాను" అని ఆశ చూపించి, అలా తన వ్యాపారాన్నంతా కొద్దికొద్దిగా అప్పగించాడు.
ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆయన ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి, "సోమదత్తుడు తన కొడుకే" అని పదిమంది ఎదుటా ప్రకటించే సరికి, ఒకప్పటి బిచ్చగాడైన సోమదత్తుడు నివ్వెరపోయాడు: "నాది కాని సంపద, ఏదో దేవుడి చలవ వల్ల అకస్మాత్తుగా నామీద వర్షించింది!" అని అశ్చర్య పోయాడు-
అంతే తప్ప, "తనకు దొరికిన సంపదంతా అసలు ఏనాటికీ తనదే" అని అతనికి అర్థం కాలేదు!