పూర్వం ఆరావళి పర్వత ప్రాంతంలో సౌశీల్యుడనే గురువుగారు ఒకరుండేవారు. భార్య, కుమారులతో కలిసి ఒక గురుకులాన్ని నడిపేవారు ఆయన. ఆయన మేధా సంపత్తి, పాండిత్యం నిరుపమానం. అన్నింటినీ మించి- విద్యార్థులకు ఆయన విద్య నేర్పించే తీరు చాలా ప్రత్యేకంగా ఉండేది. అనేక దేశాల రాజులు తమ కుమారులని విద్యాభ్యాసం కోసం ఆయన గురుకులానికి పంపేవాళ్ళు. సౌశీల్యుడు ఎంతో ప్రేమగా వారికి విద్యలన్నీ నేర్పించేవాడు.
వారికి ఆయన నేర్పే విద్యల్లో మొదటిది, సహనాన్ని- మంచితనాన్ని అలవర్చుకోవటం. 'ఎన్ని గొప్పవిద్యలు నేర్చినా; వాటిలో ఎంతగా రాణించినా; మంచి బుద్ధి, మంచి నడవడిక లేకపోతే అవన్నీ వ్యర్ధం' అని ఎప్పుడూ శిష్యులకు చెప్పేవాడాయన.
ఈ మధ్యనే భార్గవుడనే రాకుమారుడు విద్యనభ్యసించడానికి సౌశీల్యునివద్దకొచ్చాడు. భార్గవుడు తెలివైనవాడే కాని , మిగతా వారితో పోలిస్తే అతనికి విషయ గ్రహణ శక్తి తక్కువ. అది గ్రహించిన సౌశీల్యుడు భార్గవుడికి అర్థమయ్యేలా నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టాడు.
అంతలోనే సౌశీల్యుడికి పొరుగు రాజ్యానికి వెళ్ళాల్సిన పని పడింది. తాను తిరిగిరావడానికి పక్షం రోజులైనా పడుతుందని, అందాకా శిష్యులను, గురుకులాన్ని జాగ్రత్తగా చూసుకోమని భార్య దేవకికి చెప్పి, పొరుగు రాజ్యానికి పయనమయ్యాడు సౌశీల్యుడు.
పక్షం రోజుల తరువాత ఆశ్రమానికి తిరిగివచ్చిన సౌశీల్యునికి ఆశ్రమ వాతావరణంలోను, తన శిష్యుల నడవడికలోను మార్పు కానవచ్చింది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, హుషారుగా-ఆనందంగా- సంతోషంతో వెలిగిపోయే శిష్యుల ముఖాలలో ఇప్పుడు విచారపు ఛాయలు కనబడటం ఆయన్ని ఆశ్చర్య పరచింది.
అంతేకాక, ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటూ 'కల్మషం'అనే పదాన్ని కూడా తమ మధ్యకు రానివ్వని రాకుమారుల మధ్య మునుపటి మైత్రీ బంధం కనబడకపోవడం ఆయన్ని కలవరపరచింది. అసలేం జరిగిందో తెలుసుకుందామని దేవకి దగ్గరకు వెళ్ళిన సౌశీల్యుడు దిగాలుగా కూర్చున్న దేవకిని చూసి మరింత ఆందోళన పడ్డాడు- "దేవకీ! అసలేం జరిగింది? నీ ముఖంలో అంత ఉదాసీనతకు కారణం ఏమిటి? మన శిష్యుల ప్రవర్తనలో మార్పు రావడానికి కారణమేమిటి? వివరంగా చెప్పు!" అన్నాడు.
అప్పటివరకూ సౌశీల్యుడు రావటాన్నే గమనించలేదు దేవకి. ఆయన మాటలకు ఒక్కసారి ఉలిక్కి పడి- "స్వామీ! మీ రాకకోసమే ఎదురుచూస్తున్నాను. అసలు ఈ మార్పుకంతటికీ కారణం భార్గవుడే అనిపిస్తున్నది. 'ఎప్పుడూ మంచి బుద్ధితో, మంచి నడవడికతో బ్రతకాలి' అని మీరు చెబుతుంటారు కదా; మీ శిష్యులు చాలామంది ఆ బాటలోనే నడుస్తున్నారు.
కానీ భార్గవుడిలో సద్గుణాలు లేవు; సరికదా అతడిలో అన్నీ దుర్గుణాలే, అన్నీ చెడ్డ ఆలోచనలే! తనకంటే బాగా చదివేవారిపట్ల ఈర్ష్య, అసూయ; తనకన్నా ముందున్న వారిపట్ల కోపం; తనకి మంచి చెప్పే వారిపట్ల శత్రుత్వం- కనబరుస్తూ అందరినీ బాధ పెడుతున్నాడు.
తోటి వారెవరైనా 'ఇది తప్పు' అని చెబితే వారి మీద దాడికి దిగుతున్నాడు. అయినా నాకు భార్గవుడంటే కోపం ఏమీ లేదు. వాడు నా కుమారుడిలాంటి వాడు. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న పిల్లవాడు, ఇలా పెడదోవన పయనించకుండా అతనిలో మార్పు తీసుకురావల్సిన బాధ్యత మనదే కదా!" అన్నది దేవకి.
"బాధపడనక్కరలేదు, దేవకీ! భార్గవుడు మన వద్దకు వచ్చింది ఈ మధ్యనేగా? కొన్నాళ్ళపాటు అతనిలో పాత సంస్కారాలు బలంగా ఉంటాయి. క్రమంగా అతనూ మిగిలిన వారి మాదిరి సద్గుణ సంపన్నుడవుతాడు. ఇక అతన్ని గూర్చిన దిగులు వదిలేయి!" అన్నాడు సౌశీల్యుడు చిరునవ్వుతో.
భార్యకు మాట అయితే ఇచ్చాడు గానీ, ఆయన భార్గవుడిని ఏమీ అనలేదు. మునుపటి లాగే అతనికి విద్యను బోధించ సాగాడు.
పైపెచ్చు, మిగతా విద్యార్థు-లందరికంటే భార్గవుడితోటే ఎక్కువ సమయం గడపటం మొదలు పెట్టాడు. అతనికి ఒక్కడికే ప్రత్యేకంగా రకరకాల కథలు చెప్పేవాడు. ఆ కథల్లోని నీతిని కనుక్కొనమనేవాడు.
కొన్నాళ్ళలోనే ఆ అద్భుతం జరిగింది: భార్గవుడు నిజంగానే మారిపోయాడు! తన మంచి గుణాలతోటీ, మంచి నడవడికతోటీ తోటివారి ప్రేమను సంపాదించుకున్నాడు. మొదట్లో అందరితోటీ శత్రుత్వం మూట-గట్టుకున్న భార్గవుడు ఇప్పుడు దేవకి ఆశించినట్లుగానే, అందరితోటీ ప్రేమగా మెలగసాగాడు! భార్గవుడిలో వచ్చిన ఈ మార్పుకు ఎంతగానో సంతోషించిన దేవకి అదెలా సాధ్యమైందని అడిగింది సౌశీల్యుడిని-
"దేవకీ! స్వతహాగా మనుషులందరూ మంచివాళ్ళే. సందేహంలేదు. సాధారణంగా ఎవరిలోనైనా దుర్గుణాలు కలగడానికి ఒక కారణం వారిలో ఆత్మస్థైర్యం లోపించడం: తనమీద, తన శక్తి మీద తనకే నమ్మకం లేకపోవడం; మరొక కారణం కష్టపడే తత్వం లేకపోవడం-" "భార్గవుడూ అంతే. అతనూ స్వతహాగా మంచివాడే; కానీ, అతనిలో విషయ గ్రహణ శక్తి తక్కువ.
అందువల్ల మిగతావారిలా తొందరగా విషయాన్ని గ్రహించలేడు. అతను అందరికన్నా వెనకబడటానికి కారణమూ అదే. ఎంత ప్రయత్నించినా అతను అందరితోటీ సమానంగా ఉండలేకపోయేవాడు.
అట్లా 'ఇతరుల స్థాయిని తను అందుకోలేడు' అన్న ఆలోచన వల్ల తన మీద తనకే నమ్మకం తగ్గింది అతనికి. తనకు లేనిది ఇతరులకు ఉందన్న బాధకన్నా, ఇతరులలా తాను లేడన్న బాధతోనే అతని మనసు క్షోభ పడింది. అతనిలోని అసూయకు, ఈర్ష్యకు కారణమైంది అదే. తనలోని లోపమేమిటో తెలియజెప్పకుండా అందరూ గుడ్డిగా అతడిని మారమని చెప్పారు; దాంతో అతను మరింత అయోమయానికి గురయ్యాడు. అందరినీ శత్రువుల్లా చూడటం మొదలు పెట్టాడు-"
"నేను చేసిందల్లా అతనిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నించటం. భార్గవుడిలో కష్టపడే తత్వం ఉంది. ఒకసారి నా ప్రయత్నంలోని నిజాయితీ అతనికి అర్థం అవ్వగానే, అతడు రేయింబవళ్ళూ కష్టపడ్డాడు; శ్రద్ధతో, పట్టుదలతో నేను నేర్పిన విద్యలన్నీ చక చకా నేర్చుకున్నాడు. దాంతో తోటి విద్యార్థులకన్నా తనేమీ తక్కువకాదని నమ్మకం కలిగింది అతనికి- అతని ఆత్మస్థైర్యం మరింత వృద్ధినొందింది. అందరిలాగే తానూ ఏదో ఒక పనిని విజయవంతంగా చేయగలుగుతానని నమ్మినప్పుడు, ఇంక ఇతరులపై ఈర్ష్యకు, అసూయకు చోటేది? అందరికన్నా తాను ఏ విధంగానూ భిన్నంగా లేనప్పుడు, ఇక వేరేవారితో గొడవకు తావేది?" అన్నాడు సౌశీల్యుడు, జరిగినది వివరిస్తూ.