అనగనగా ఒక ఊళ్లో పూజ అనే అమ్మాయి ఉండేది. ఆ ఊరి బళ్లో చదువుకునేది ఆ పాప.
ఆ పాపకు పుస్తకాలు చదవటం అంటే మహా ఇష్టం. కానీ వాళ్ల అన్నకూ, అమ్మా నాన్నలకు మటుకు పుస్తకాలంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. అయితే పూజకు పుస్తకాలపట్ల ఉన్న ఇష్టాన్ని గమనించి, వాళ్ల బడిలోని ఉపాధ్యా-యుడు ఒకాయన ఆ పాపకు ప్రతివారమూ కొన్ని పుస్తకాలు ఇంటికి ఇచ్చేవాడు.
అయినా పూజ పుస్తకం చదవటం మొదలు-పెట్టేసరికి వాళ్ళ అమ్మ "తర్వాత చదువు-కోవచ్చులేమ్మా!" అంటూ ఆ పనులకూ, ఈ పనులకూ పిలిచేది. అవన్నీ పూర్తి చేసి పుస్తకం తెరిచే లోపు, పూజ వాళ్ళ అన్న టీవీ శబ్దాన్ని బాగా పెంచి టీవీ చూసేవాడు.
ఇక పూజకు పుస్తకాలు చదివేందుకు వీలయ్యేది కాదు! చివరికి చదివే సమయం చిక్కక, తను తెచ్చుకున్న పుస్తకాలను చదవకుండానే మాస్టారికి ఇచ్చెయ్యాల్సి వచ్చేది పాపం.
కొన్నిసార్లు అట్లా జరిగాక, ఒకనాడు పూజ తన కష్టాన్ని వాళ్ళ ఉపాధ్యాయుడితో చెప్పుకున్నది. మాస్టారు ఒక ఉపాయం ఆలోచించారు. తన పథకం ప్రకారం మొదట పూజ వాళ్ల అన్నకు పుస్తకాలపట్ల ఇష్టాన్ని పెంచాడు ఆయన. త్వరలోనే పూజ వాళ్ల అన్న కూడా బడి నుంచి పుస్తకాలను ఇంటికి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. అప్పుడు పూజ కావాలని టీవీ సౌండు బాగా పెంచి పెట్టటం మొదలు పెట్టింది. వాళ్ల అన్నని అస్సలు చదువుకోకుండా చేసింది.
దాంతో పూజ వాళ్ల అన్నకు తెలిసి వచ్చింది- చదువుకుంటున్న సమయంలో టీవీ శబ్దం ఎక్కువగా ఉంటే చదువుకోవడానికి ఎంత ఇబ్బందో! ఇక అప్పటినుండి అతను మారిపోయాడు- ఇప్పుడు అసలు టీవీ పెట్టటమే మానేశాడు. ఎప్పుడన్నా టివి పెట్టినా, తక్కువ శబ్దంతో, పూజకు ఇబ్బంది కలగకుండా పెట్టటం అలవాటు చేసుకున్నాడు.
అంతే కాదు, ఇప్పుడు అతనికి కూడా పూజలాగా పుస్తకాలు చదవటం అలవా-టయింది కదా, వాళ్ల అమ్మకు కూడా ఆ విషయం చెప్పాడు- చదువుకునేటప్పుడు మధ్యలో పిలవొద్దని చెప్పాడు!
"మరి మీరు పనులు ఎట్లా నేర్చుకుంటారు రా?" అన్నది అమ్మ.
"అప్పుడప్పుడు మేమే వచ్చి సహాయం చేస్తాంలే" అని అన్న, పూజ ఇద్దరూ అట్లా మధ్య మధ్యలో వాళ్ళే వెళ్ళి అమ్మకు ఇంటిపనిలో సాయం చేయటం మొదలు పెట్టారు.
అట్లా పూజ బాధ తీరింది. అప్పటినుండీ ఆ పాప మంచి మంచి పుస్తకాలు చదువుతూ, చాలా విషయాలు తెలుసుకుని గొప్ప రచయిత్రి
అయ్యింది. చాలా పేరు సంపాదించుకున్నది!