మిరియపు గింజ- వేమన
మిరియగింజ చూడ మీద నల్లగ నుండు
గొరికి చూడ లోన జురుకు మనును
సజ్జనులగు వారి సారమిట్లుండుర
విశ్వదాభి రామ వినురవేమ
భావం: మిరియపు గింజ చూసేందుకు నల్లగా ఉంటుంది. దాన్ని కొరికి తింటే నాలుక చురుక్కుమంటుంది కూడా. కానీ అది చాలా మేలు చేసే వస్తువు! అలాగే, మన ఈ ప్రపంచంలో మంచివాళ్ళు కూడా ఆ మిరియపు గింజ లాంటివారే. పైకి కఠినంగాను, ఘాటుగాను కనిపించినా, వారు మేలే చేస్తారు.
నెరజాణ-వేమన
నేరనన్నవాడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాడు నిందజెందు
ఊరుకున్నవాడె యుత్తమయోగిరా!
విశ్వదాభి రామ వినురవేమ
భావం: 'నాకు తెలియదు' అని పనినుండి తప్పించుకునేవాడు 'మోసగాడు- అతి తెలివి వాడు' అనిపించుకుంటాడు. 'నేర్చుకుంటున్నా' అంటూ చేసేవాడు తప్పులు చేసి, నిందల పాలవుతాడు. ఏమీ అనకుండా పని చేసినవాడే ఉత్తముడు.
సజ్జనుల కోపం
పలుమరు సజ్జనుండు ప్రియ భాషల పల్కు- కఠోర వాక్యముల్
పలుక డొకానొకప్పు డవి పల్కిన గీడును గాదు నిక్కమే-
చలువకు వచ్చి మేఘుడొక జాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగునౌటు? వేగిరమె శీతల నీరము గాక భాస్కరా?!
భావం: ఒక్కోసారి మేఘాలు వడగళ్ళను రాల్చినా, అవి కరిగి చల్లని నీళ్ళయి మనకు మేలు చేస్తాయి తప్ప, రాళ్ళవ్వవు. అలాగే మంచివాడు కూడా ఒక్కోసారి కఠినంగా మాట్లాడతాడు- దాని వల్ల ఇతరులకు మేలే జరుగుతుంది తప్ప, కీడు జరగదు.