గంగినపల్లిలో నివసించే సోమిరాజుకు శరీరం అయితే బాగా బలంగా పెరిగింది గానీ, వాడికి మా చెడ్డ బద్ధకం. సొంతగా ఏ పనీ చేసేవాడు కాదు. పుట్టగానే తండ్రి చనిపోవటం; 'తండ్రి లేడు గదా' అని, తల్లి వాడిని అతి గారాబం చేయటం జరిగింది. ఆ అతి గారాబం వల్ల వాడు ఇట్లా సోమరిపోతుగా తయార-య్యాడు.
వాడి సోమరిపోతు తనం గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. 'సోమరిపోతుల రారాజు' అని, వీలైతే కొన్ని సంవత్సరాల వరకు వాడు ఒక్క అడుగు కూడా క్రింద వేయకుండా బ్రతుకుతాడనీ రకరకాలుగా చెప్పుకునేవాళ్ళు అంతా.
వాడి సోమరిపోతుతనం గురించి తెలుసుకున్న రాజుగారు, ఒకరోజు వాడిని పిలిపించారు: "ఎందుకలా సోమరిగా కూర్చుంటున్నావు? ఏదైనా పని చెయ్యాలి. నేను నీకు చక్కని పని ఒకటి ఇస్తాను- చేస్తావా?" అని అడిగారు.
సోమరిపోతుకి ఏం చెప్పాలో తోచలేదు. రాజుగారి మాటను తీసెయ్యటం ఎలాగ? అందుకని వాడు నీళ్ళు నములుతూ "మా అమ్మను అడిగి చెపుతా" అన్నాడు. రాజుగారు నవ్వారు. "మీ అమ్మే నాయనా, నీకు పని ఇమ్మన్నది! ఇప్పుడు చెప్పు, ఏం పని చేస్తావో" అన్నారు.
" 'సోమరిపోతు పని' లాంటిది ఏదైనా ఉంటే ఇప్పించండి" అని అడుగుదామనుకున్నాడు సోమిరాజు. కానీ ఏం సమస్యో గాని, వాడి నోరు పెగలనే లేదు!
"సరే, నువ్వేమీ తేల్చుకోలేకుండా ఉన్నావు గనక, నీకు తగిన ఉద్యోగాన్ని మేమే నిర్ణయిస్తాం- నువ్వు ఈ రోజు నుండి మా సైనికుడివి" అని రాజుగారు వాడిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. సైన్యాధికారి వాడికి ఒక గుర్రాన్ని చూసుకునే బాధ్యతను అప్పగించాడు-"నీకు నచ్చిన గుర్రాన్ని నువ్వే ఎంపిక చేసుకో" అని.
సోమరిపోతు సోమిరాజు ఆలోచించాడు: "గుర్రాన్ని చూసుకోవటం అంటే మామూలు సంగతి కాదు. పైగా యుద్ధాలు అవీ వచ్చినప్పుడు వాటివెంట మనమూ పోవాల్సి వస్తే కష్టం. ఆ కష్టం నుండి తప్పించుకోవాలంటే ఇప్పుడు వీలైనంత చెత్త గుర్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఏదైనా కుంటి గుర్రం దొరుకుతుందేమో చూస్తాను. దాన్నే ఎంపిక చేసుకుంటాను.." అని.
రాజుగారి గుర్రాల శాలలో వాడికి ఖచ్చితంగా అలాంటి గుర్రమే ఒకటి కనబడింది. ఒక కాలును పైకి ఎత్తి గడ్డి మేస్తున్నదది. దాన్ని చూడగానే సోమిరాజు ముఖం వికసించింది. వెంటనే దాన్ని ఎంచుకున్నాడు.
అతనినే గమనిస్తున్న రాజుగారి అశ్వపాలకుడు వెంటనే రాజుగారికి కబురు పంపాడు: "మహాప్రభూ! ఇతను సామాన్యుడు కాడు. అన్ని చెత్త గుర్రాల నడుమ, వాడు మన పంచకల్యాణినే ఎలా ఎంపిక చేసుకోగలిగాడో నాకు అంతు చిక్కకుండా ఉంది!" అని.
నిజంగానే అది గొప్ప మేలుజాతి గుర్రం మరి!
అది విన్న రాజుగారికి చాలా సంతోషం వేసింది. అందరూ సోమరిపోతు అనుకునే సోమిరాజు ఏమంత తెలివిలేని వాడు కాదనీ, అవకాశం ఇస్తే బాగా అభివృద్ధిలోకి రాగలడనీ ఆయనకు నమ్మకం కుదిరింది.
అంతలోనే పొరుగు దేశపు రాజు ఒకడు వారి రాజ్యం మీదికి దండెత్తి వచ్చాడు. ఇరు రాజ్యాలకూ యుద్ధం మొదలైంది. సైనికులందరికీ యుద్ధంలో పాల్గొనమని ఆదేశాలు అందసాగినై. ప్రతి సైనికుడూ వ్యక్తిగతంగా సైన్యాధికారిని కలిసి, తన వంతు ఆదేశాలను స్వయంగా అందుకోవలసి ఉంటుంది.
సోమిరాజుకు భయం వేసింది. "తన కుంటి గుర్రాన్ని తను ఎక్కేది ఎన్నడు, అది తనను సైన్యాధికారిని కలిసేది ఎన్నడు? యుద్ధం చేసేదెన్నడు?" అనుకొని, వాడు అందరికంటే వెనుక బయలుదేరి, అలస్యంగా గుర్రం ఎక్కాడు.
అటు వాడు ఇంకా ఎక్కాడో లేదో, పంచకళ్యాణి పరుగులు పెట్టింది. గబగబా సైన్యాధికారి ముందుకు పోయి నిలబడింది. మిగిలిన గుర్రాలన్నీ తప్పుకొని దానికి దారి వదిలాయి!
సోమిరాజుకు దిక్కుతోచలేదు. వాడికి తెలివి వచ్చేంతలో వాడు సైన్యాధికారి ముందు నిలబడి ఉన్నాడు. సైన్యాధికారి వాడిని మెచ్చుకొని, వెయ్యి మంది సైనికులను ముందుండి నడిపే బాధ్యతను అప్పగించాడు.
సోమిరాజు ఏడుపు ముఖం పెట్టుకొని తన గుర్రం ఎక్కీ ఎక్కగానే అది ఈసారి నేరుగా యుద్ధభూమికే పరుగు పెట్టింది. గుర్రాలన్నింటికంటే ముందుకు ఉరికింది. దాన్ని చూసి మిగిలిన గుర్రాలన్నీ వేగం పెంచి దాన్ని అనుసరించాయి.
సోమరిపోతు హడలిపోయాడు. ఎలాగైనా గుర్రం మీది నుండి కిందికి దూకేయాలనుకున్నాడు. వెంటనే గుర్రాన్ని సన్నగా, పొడవుగా ఉండే రెండు తాటి చెట్ల మధ్యకు పోనిచ్చాడు. "రెండు చెట్లనూ తన రెండు చేతులతో పట్టుకుంటే గబుక్కున గుర్రం దిగి పోవచ్చు" అనుకున్నాడు వాడు.
అయితే సోమిరాజు అలా ఆ చెట్లను పట్టుకోగానే, అవి రెండూ ఊడి అతని చేతుల్లోకి వచ్చేసాయి! మరుక్షణం అతని వెనక ఉన్న సైనికులందరూ కత్తులు, బల్లేలు పైకెత్తి "జయహో! శతృ కర్షణ సోమిరాజ బహద్దూర్‌కీ, జై!" అని అరిచారు.
అది చూసిన శత్రు సైన్యం వాళ్ళు,అంత బలవంతునితో యుద్ధం చెయ్యడం తమవల్ల కాదని భయంతో అక్కడినుండి పారిపోయారు! రాజుగారు తక్షణం సోమరిపోతు సోమిరాజుకు సైన్యాధికారిగా పదోన్నతి కల్పించారు. సోమిరాజుకు "సోమిరాజ బహద్దూర్" అని బిరుదుకూడా ఇచ్చారు!
దాంతో సోమిరాజుకు ఎంత అయిష్టం అయినా ఇక సైన్యంలో మరింత పని చేయక తప్పింది కాదు. పనిలో పడి-పడి, క్రమంగా వాడి సోమరిపోతుతనమూ పూర్తిగా వదిలింది!