అనగనగా ఓ తోట- అసలది తోటో, కాదో తెలీదు. ఏవో కొన్ని చెట్ల లాంటివి, తుప్పల లాంటివి ఉన్నై తప్ప, దానికి నిజంగా తోటకుండాల్సిన లక్షణాలు వేరే ఏమీ లేవు. తోటలో ఎక్కడ చూసినా ఎండి మ్రోడులై పోయిన చెట్లు. ఎండుటాకులు ఇరుక్కున్న బోడి కొమ్మలు. కాలిబాటల్లో నిండా ఒత్తుగా రాలి పడిపోయిన గోధుమరంగు ఆకులు. ఎటు చూసినా దుమ్ము. ఎడారిలో వీచినట్లు వేగంగా వీస్తున్న పొడిగాలి.

నీరసించి పోయిన చెట్లు తమ ఆకుల బరువును కూడా మోయలేక పోతున్నై. ఎండిపోయిన రెమ్మలు గాలికి కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడా ఒక పిట్టగాని, ఒక జంతువు గాని కానరావట్లేదు.

ప్రాణంలేని ఆ తోటలో, ఒకరోజున పుట్టిందో చిట్టి గడ్డి పువ్వు. పుట్టగానే కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసింది. తోడుగా ఒక్క పువ్వూ కనబడలేదు.

చూసి చూసి చిట్టి పువ్వు తన చుట్టూ ఎగిరే ఎండుటాకులను పలకరించింది. "ఏంటన్నలూ, బాగున్నారా?!" అని.
జీవంలేని ఆకులు మూలిగాయి-" ఏం బాగు చెల్లీ, ఇదిగో ఇట్లా కొట్టుకుపోతున్నాం. నువ్వూ వచ్చావే పాపం, ఈ‌ పాడు ప్రపంచంలోకి!" అంటూ అది ఇచ్చే జవాబు వినకనే ఎగిరిపోయాయి.

ఆకుల్ని ఎగరేసుకుపోతున్న సుడి గాలి చిట్టిపువ్వుని చూసి ఎగతాళిగా నవ్వింది-"ఏంటే, మిడిసి పడుతున్నావ్? కాలం కాని కాలంలో పుట్టింది చాలక, ఇంకా ముచ్చట్లు కావాలటనే,నీకు?" అని ఉరిమింది.

చిట్టి గడ్డి పువ్వు పాపం, చిన్నబోయింది. క్రిందికి వాలి తన ముఖాన్ని తల్లి రెమ్మల్లో దాచుకున్నది. తల్లి మొక్క దాన్ని చూసి నిట్టూర్చింది "పాపం, పిచ్చిది- కాలం కాని కాలంలో పుట్టింది. దీనికి ఒక్కతోడు కూడా లేదు" అనుకుంది.

అంతలోనే ఏమైందో మరి- చల్లటి పిల్ల గాలులు వీచాయి. ఆ గాలికి, అంతకు ముందున్న గాలికి ఎంత తేడా!? ఈ గాలి గుసగుసలాడింది- కొమ్మ కొమ్మనూ ఊపి చెప్పింది-"లేండమ్మా! లేండి! నిద్ర చాలించి లేవండి! గొప్ప సమయం వచ్చేసింది- ఇంకా నిద్రపోతారా, ఎక్కడన్నా, గలీజుగా?!" అంది.

మరునాడు చిట్టి గడ్డి పువ్వు లేచి చూసేసరికి కొమ్మలన్నీ కొత్త కొత్త చిగుళ్ళు తొడుక్కొని సిగ్గు పడుతున్నాయి. రెమ్మ రెమ్మా సంతోషంతో మొగ్గలు వేస్తున్నది.

"ఏమైంది, ఏమైంది" అంది గడ్డి పువ్వు.

"పండగొచ్చేసింది! పండగొచ్చేసింది!" అన్నది తల్లి చెట్టు సంబరంగా. అంతలోనే తుమ్మెదలూ, తేనెటీగలూ 'ఝుం..ఝుం.." అంటూ ఎగిరొచ్చి తిరగటం మొదలు పెట్టాయి. నిద్రపోతున్న చిట్టి చిట్టి మొగ్గలు ఒక్కొక్కదాన్నీ అవి తట్టి లేపాయి- "శుభోదయం! లేవండి లేవండి! పండగ రోజులు వచ్చేశాయి లేవండి!" అన్నాయి. వాటి మాటలు విని వికసించిన పువ్వుల్లోంచి వెలువడిన సువాసనల్ని మోసుకెళ్తూ కొత్తగాలి మహా బరువెక్కి మత్తెక్కించింది. చిట్టి గడ్డి పువ్వుకి మహా సంబరంగా ఉంది ఇదంతా.

అంతలోనే ఓ మూలగా వేపచెట్టు మీదికొచ్చి వాలిందో కోయిల. మరొకటి ఎగిరొచ్చి మామిడి చెట్టు మీద కూర్చున్నది. వచ్చీ రాగానే రెండూ పాటల పోటీ మొదలెట్టాయి.

"కొత్త యుగం వచ్చేసింది-లేవండోయ్-లేవండోయ్!
సంతోషంగా మీరందరూ కళకళలాడండోయ్! గలగల నవ్వండోయ్!" అని అవి పాడే కొత్త పాటలు వింటూ చిట్టి గడ్డిపువ్వుతో సహా తోటలోని పూలన్నీ పరవశించి పోయాయి. ఎక్కడెక్కడినుంచో ఎగిరొచ్చిన పిట్టలు కిలకిలమంటూంటే, కొమ్మలన్నీ గలగలమన్నాయి. 'కొత్త చిగుళ్ళు తొడుగుదాం, నిజంగానే పండగ వచ్చేసింది!' అని ఒక్కటొక్కటిగా అన్ని చెట్లూ తొందరపడ్డాయి.

వసంతుడు చేసిన ఈ మాయాజాలంతో చిట్టి పొట్టి పిల్లలు, వాళ్ల అమ్మానాన్నలు అందరూ ఇప్పుడు తోటల బాట పట్టారు. వాళ్ల నవ్వులతో కలగలసిపోయిన పూల సొగసులు మాగొప్పగా అనిపిస్తున్నాయి.

వసంతుడు కురిపించిన మంత్రపు జల్లులో తడిసి, తోటలన్నీ చివురించాయి; ముగ్ధమనోహరంగా తయారయ్యాయి. ఆశలు మోసులు వేసే ఈ సమయంలో మరి మీరేం చేస్తున్నారు? ఇంట్లోనే ఉన్నారా, పదండి, తోటబాట పట్టండి!