సుబ్బరాయునిపల్లిలో మారుతి, అనిల్ అనే అల్లరి పిల్లలు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరూ అల్లరి పిల్లలే గానీ, బలే తెలివైనవాళ్ళు. ఇతరుల పట్ల మర్యాదగానూ, సమాజంపట్ల బాధ్యతతోనూ ఉండేవాళ్ళు కూడా.
సుబ్బరాయునిపల్లిలో బడి ఐదో తరగతి వరకే ఉంది. ఆరవ తరగతి చదవాలంటే దగ్గర్లో ఉన్న ధర్మవరానికి వెళ్లాల్సిందే. ఆ సంవత్సరం మారుతి, అనిల్ ఇద్దరూ ఆరవ తరగతికి వచ్చారు- రోజూ ధర్మవరం వెళ్ళి, రావాలి. మిత్రులిద్దరూ రోజూ ధర్మవరం వెళ్ళేవాళ్ళు- అయితే ఈ మధ్య రోజూ వాళ్ళు వెళ్తున్నది బడికి కాదు! బడికి బదులు, సినిమాలకి-షికార్లకు పోవటం మొదలు పెట్టారు! మెల్లగా చెడు మార్గం‌ పట్టారన్న మాట!

ఒక రోజున వాళ్ళిద్దరూ సినిమా హాలువైపుకు నడిచిపోతున్నారు. దారంతా ఏవేవో బ్యానర్లు కట్టి ఉన్నాయి. ఐదారు పోలీసు వాహనాలు కూడా వాళ్ళకు ఎదురయ్యాయి.

ఒక వాహనం అయితే వాళ్ళకు చాలా దగ్గరనుండి దూసుకు పోయింది. అన్ని పోలీసు వాహనాల్ని చూసిన మారుతి కొంచెం కంగారుపడి, పక్కనే ఉన్న మురికి కాలువలోకి జారిపడబోయాడు!

అయితే వెంటనే తేరుకుని పైకి ఎక్కి, పక్కనే ఉన్న మోరీవైపు చూశాడు మారుతి. అక్కడ రంగు రంగుల వైర్లు ఉన్న గుండ్రటి వస్తువు ఒకటి, మెరుస్తూ కనబడింది అతనికి. వాడు కొద్దిసేపు అక్కడే నిలబడి దానికేసే ఆశ్చర్యంగా చూశాడు. వాడిని చూసి అనిల్ కూడా అక్కడికి వచ్చి నిలబడ్డాడు- ఇద్దరూ మోరీ చివర్న బురద అంటుకొని ఉన్న ఆ వస్తువునే చూస్తూ నిలబడ్డారు.

అంతసేపూ ఆ పక్కనే ఉండి, వీళ్ళిద్దరినీ గమనిస్తున్న వ్యక్తి ఒకడు, వీళ్ళిద్దరూ అలా ఆశ్చర్యంగా నిలబడిపోగానే ఎవరికో ఫోన్ చేశాడు. క్షణాల్లో ఒక జీఫు అక్కడికి రావడం, దానిలోంచి ఎవరో బయటికి దూకటం, వీళ్ళిదరినీ పట్టుకొని గబుక్కున జీపునెక్కించి తీసుకెళ్ళడం జరిగిపోయింది!

వీళ్లని ఎత్తుకెళ్ళిన జీపు వేగంగా పోయి, ఊరి చివరన ఉన్న పాడుబడ్డ బంగళా ముందు నిలబడింది. వస్తాదుల్లాంటి మనుషులు కొందరు అందులోంచి దిగారు. వీళ్ళిద్దరినీ లోపలికి తీసుకెళ్లి కట్టిపడేశారు.

కాసేపయ్యాక, భయంకరమైన ముఖంతో ఉన్న వాడొకడు అక్కడికి వచ్చి చూశాడు వీళ్లిద్దరినీ. "సరేలెండి, ఏమీ పర్వాలేదు. ఎలుకలే. ఓసారి ఆ బాంబు పేలాక, ఈ రెండు ఎలుకల్నీ చంపేసి, చెరువులో పడెయ్యండి సరిపోతుంది" అని చెప్పి వాడు అక్కడినుండి వెళ్ళిపోయాడు.

అక్కడున్న రౌడీలు మారుతిని, అనిల్ ని బాగా కొట్టారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు అనిల్‌ ఐతే నిజంగా స్పృహ తప్పి పడిపోయాడు. మారుతి మాత్రం స్పృహ తప్పినట్లు నటిస్తూ పడిపోయాడు.

పిల్లలిద్దరూ పడిపోయారని అనుకున్న రౌడీలు వాళ్ల ప్రక్కనే కూర్చొని, సారాయి త్రాగటం మొదలు పెట్టారు. సారాయి ప్రభావంతో వాళ్లంతా ఒక్కరొక్కరుగా మత్తులోకి జారుకున్నారు.

అదంతా గమనించిన మారుతి "ముందు అక్కడి నుండి బయటపడేది ఎలాగ..?" అనుకున్నాడు. పండ్లు కోసుకుని తినడానికి ఎప్పుడూ తన వెంట తెచ్చుకునే కత్తి ఉందో లేదో చూసుకున్నాడు. ఎంతయినా అల్లరివాడు కదా! సమయానికి అది జేబులోనే ఉంది.

మెల్లగా తన నోటితోనే దాన్ని తీసి, ముందు చేతి కట్లు; ఆ తర్వాత నడుముకు-కాళ్ళకు కట్టిన కట్లను విడిపించుకున్నాడు. చప్పుడు చెయ్యకుండా అక్కడి నుండి పోలీసు స్టేషను వైపుకు పరుగు తీశాడు.

ఆ రోజున ఊరంతా ఒకటే జనాలు. రోడ్లన్నీ చాలా రద్దీగా ఉన్నాయి. మారుతి అట్లానే అందరినీ తప్పించుకుంటూ పరుగుపెట్టి, పోలీసు స్టేషను చేరుకున్నాడు. సంగతంతా పోలీసులకు గబగబా చెప్పేశాడు.

మారుతి మాటలు విన్న పోలీసులంతా వెంటనే అప్రమత్తమయ్యారు. పై అధికారులందరికీ విషయం ఫోన్ల ద్వారా చెప్పేశారు. కొందరు మారుతిని వెంటపెట్టుకుని బాంబు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. మరి కొందరు అనిల్ ని కట్టి పడేసిన భవనం దగ్గరకు చేరున్నారు.

ఒకవైపున వీళ్ళు బాంబును నిర్వీర్యం చేశారు; మరొకవైపున వాళ్ళు అనిల్‌ని కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్ళారు. రౌడీలను అందరినీ అరెస్టుచేసి స్టేషనుకు తీసుకెళ్ళారు.

కాసేపటికి జిల్లా పోలీసు ఉన్నతాధి-కారులందరూ చేరుకున్నారు అక్కడికి. వచ్చీ రాగానే వాళ్లంతా మారుతిని, అనిల్‌ని చూస్తూ "వీళ్ళేనా, మన ముఖ్య మంత్రిగారిని కాపాడింది!?" అని అడిగారు ప్రశంసా-పూర్వకంగా.

అప్పటికి అర్థమయ్యింది మారుతి, అనిల్ లకు- తెలీకుండానే తాము చేసిన గొప్ప పని ఏంటో! ముఖ్యమంత్రి గారిని లక్ష్యంగా చేసుకొని ఎవరో పెట్టిన బాంబుని తాము చూశామన్న మాట! ఆ సంగతిని పోలీసులకు తెలియపరచి, ఆ బాంబుని నిర్వీర్యం చేయించామన్న మాట! తాము లేకపోతే ముఖ్యమంత్రిగారికే కాక, ఇంకా అనేకమంది ప్రాణాలకు హాని కలిగేది!

అధికారులంతా మిత్రులిద్దరినీ చాలా ప్రశంసించారు. వాళ్ళిద్దరి వివరాలనూ అడిగి తెలుసుకున్నారు. ఇద్దరినీ జీపులో ఎక్కించుకుని, వాళ్ల ఇళ్ళ దగ్గర వదిలి రమ్మని ఒక పోలీసుని పంపారు.

కొన్ని రోజుల తర్వాత "సాహసబాలల అవార్డుకు మారుతి, అనిల్‌లను ఎంపిక చేసినట్లు" ఉత్తరం వచ్చింది. క్రొత్త సంవత్సరం జనవరి 26వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా వాళ్ళిద్దరికీ సాహసబాలల పురస్కారం అందించారు. అల్లరి మూకలు పెట్టిన బాంబును నిర్వీర్యం చేయించి అనేక మందిప్రాణాలను కాపాడినందుకుగాను వాళ్లను దేశమంతా గౌరవించింది.

అయితే, అప్పటినుండి మిత్రులిద్దరిలోనూ చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరూ బుద్ధిగా చదువుకుంటున్నారు!

అల్లరి పనులు చేయటం పూర్తిగా మానేశారు. బాధ్యత తెలిసి వచ్చింది. ఊరికే అనుకున్నంత మాత్రాన పోలీసులు కాలేరు కదా,

ముందు బాగా చదవాలి మరి!