మా ఊళ్ళో ఒక పేదాయన ఉండేవాడు. అతనికి కనీసం ఒక పూట భోజనం పెట్టేవారు కూడా ఎవ్వరూ లేరు. పైగా అతను ఎప్పుడు చూసినా అనారోగ్యంతో చాలా కష్టంలో ఉండేవాడు. తన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమీ చేయలేక, అష్టకష్టాలు అనుభవిస్తూండేవాడు.

అందరూ అతన్ని అసహ్యించుకునేవాళ్ళు. ఎవ్వరూ అతనుండే గుడిసె ముందు అడుగుకూడా పెట్టేవారుకాదు. అతని దగ్గరికెళ్లి ఒక మాట మాట్లాడేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అక్కడ.

అతన్ని చూసినప్పుడల్లా నాకు చాలా బాధ కలిగేది. అప్పుడే నాకు అర్థమయ్యింది- 'పేదవారంటేనూ, వాళ్ళ బతుకులంటేనూ ఇలా ఉంటాయి' అని.

"ఓ దేవుడా ! ఎందుకయ్యా , ఇలా సృష్టించావు వీళ్లని?" అని దేవుణ్ణి ప్రశ్నించాను నేను.

"నేను కాదుగా, వీళ్ళని ఇలా తయారు చేసుకున్నది మీరే. మీ సమాజంలో లోపాలన్నీ‌ మీరు స్వయంగా సృష్టించుకున్నవే! మీకు మీరే బాధ్యులు" అన్నాడు దేవుడు గాలిలోంచి మాట్లాడుతున్నట్లు.

"ఇలాంటివారి కోసం ఎవరూ ఏమీ చెయ్యలేరా? పేదలు ఇంత కష్టం అనుభవిం-చాల్సిందేనా? ప్రభుత్వాలు ఏమీ చెయ్యలేవా, ఇట్లాంటి వారికోసం?" అని అనేక ప్రశ్నలు వచ్చాయి నాకప్పుడు.

"అప్పుడే నాకు అనిపించింది - బాగా చదువుకోవాలని; మంచి ఉద్యోగం సంపాదించి, పేదవారికోసం ఏదైనా చెయ్యాలని!"
అప్పటినుంచీ నేను బాగా కష్టపడి చదివాను. పెద్ద ఉద్యోగం సంపాదించాను. పేదవాళ్ళకు నా వంతు సాయం చేశాను.