ఆరోజు రంగులన్నీ సమావేశమయ్యాయి. సభ చాలా అందంగా, ఆహ్లాదంగా శోభాయమానంగా వుంది. చిన్న చిన్న సింహాసనాల మీద తమ రంగు రాళ్ళు పొదిగిన కిరీటాలు జిగేలు జిగేలు మంటుంటే ఠీవిగా ఆసీనులయ్యాయి రంగుల మహారాణులు. ఆ రోజు సభలో ముఖ్యమైన చర్చనీయాంశం- 'ఏ రంగు గొప్పది' అని-
ముందుగా పచ్చరంగు లేచినుంచుంది. "అన్ని రంగులలోకి నేనే గొప్పదాన్ని, ఆకులు, చెట్లు, పైర్లు, పొలాలు అన్నీ పచ్చగానే ఉంటాయి. ప్రాణులన్నిటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నేనే ఆహారం, ఆధారం. నేను లేనిదే జీవకోటి మనుగడ కష్టం.
అంతేగాక నా రంగు కారణంగానే వృక్షాలు ఆహారాన్ని తయారుచేసుకుంటాయి. పైర్ల అందానికి ఏదీ సాటి రాదని మీకు తెలియదా? కాబట్టి నేనే గొప్పదాన్ని!" అన్నది ఆకు పచ్చరంగు.
వెంటనే నీలం రంగు లేచి మాట్లాడసాగింది. "ఆకు పచ్చరంగు వృక్షాలకే పరిమితం, కానీ అనంతమైన ఆకాశం నీలి రంగులోనే ఉందని ఎరుగరా? వృక్షాలు జీవి మనుగడకు ఆధారమే, కాదనను- కానీ ఆ చెట్లు బ్రతకాలన్నా అవరసమైన నీరు సదా ప్రతిఫలించేది ఆకాశపు నీలాన్నే. కాబట్టి నేనే గొప్పదాన్ని!" అని ముగించింది నీలం.
తర్వాత కాషాయ వర్ణం లేచి నిల్చున్నది: "నేను మీ అందరిలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమించక పోయినా, నా రంగు చాలా ముఖ్యం. క్యారట్, నారింజ, బొప్పాయి, మామిడి అన్నీ నా రంగులోనే ఉన్నాయి. నా రంగు బలానికి, పవిత్రతకు సంకేతం.
రోజంతా ఏ రంగులో ఉన్నా, ఉదయించే సూర్యుడు, అస్తమించే సూర్యుడు ఉండేది నా రంగులోనే. ఆ దృశ్యాలను చూసేవారెవరైనా ఇంక దేనినైనా చూసేందుకు ఇష్టపడతారా? పడరు. కాబట్టి నేనే గొప్ప!" అన్నది కాషాయ రంగు.
తన కిరీటాన్ని సవరించుకుంటూ పసుపు రంగు నిలబడ్డది. నేను ప్రపంచానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తెస్తాను.
సూర్యకాంతి పుష్పాన్ని చూడండి. ప్రపంచం అంతా మీతో కలిసి నవ్వుతున్నట్లు ఉండదూ? అందరికంటే నేనే గొప్ప!" అన్నది పసుపు రంగు.
"నేను రక్తానికి గుర్తు. మనిషి శరీరంలో ఎరుపు రంగు లేని నాడు మనిషే లేడు. విప్లవానికి గుర్తు ఎరుపు- అవసరం వచ్చినప్పుడు పోరాడి కావల్సింది సాధించటానికి అవసరమైన ఆ పటిమ రంగు ఎరుపు. అందుకని నేనే గొప్ప" అంది ఎరుపు రంగు.
"రాజసం ఒలకబోస్తూ నిలబడ్డది నీలి రంగు. నేను రాజసానికి రాచరికానికి గుర్తు. చక్రవర్తులు, రాజులు నన్ను తమ రంగన్నారు. వాళ్ళకు లోబడి అందరూ నడిచేవారు. నేను అందరిలోకీ గొప్ప రంగును" అన్నది నీలి రంగు.
అంతలో ఊదారంగు నెమ్మదిగా నిలబడ్డది.
"నేను ప్రశాంతతకు, నిశ్చలతకు చిహ్నాన్ని. రోజంతా ఎలా ఉన్నా, రాత్రి నిశ్శబ్దంగా, ప్రశాంతంగా నిద్రించనిదే మనిషి జీవితం సాగదు. అందుకని నేనే గొప్ప" అన్నది ఊదారంగు.
ఇంతలో హోరుమని వర్షం ప్రారంభమైంది. అన్ని రంగులూ భయంతో వణికిపోతూ దగ్గరికి జరిగాయి. మెరుపు మెరిసింది. ఉరుము-కుంటూ వర్షం రంగులతో అన్నది-
"రంగుల్లారా! మీలో మీరు 'నేను గొప్ప' అంటే 'నేను గొప్ప' అని కొట్టుకోవటం మంచిది కాదు. ప్రకృతి ప్రపంచంలో ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేకతనిచ్చింది. దేనికదే గొప్ప. అందుకని మీరంతా చేతులు కలపండి. శిరసు వంచండి. ఆ ప్రకృతికి నమస్కరించండి" అన్నది.
రంగులన్నీ సిగ్గుపడ్డాయి. అన్నీ చేతులు కలిపాయి. ఆకాశాంలోకి ఎగసి, ప్రకృతికి నమస్కరిస్తూ శిరసు వంచాయి. వానాకాలంలో మనకు కనిపించే ఇంద్రధనస్సు అదే!