ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఓసారి వడలు తినబుద్ధి అయ్యింది. ఆ అవ్వ ఒక రూపాయి ఇచ్చి నూనె, పిండి తీసుకొని ఇంటికెళ్ళి వడలలోకని ఒక వంకాయని కూడా తీసుకొని కొయ్యబోయింది.
అప్పుడా వంకాయ అవ్వతో, "అవ్వా! నన్ను కొయ్యవద్దు. నేను నువ్వు ఏది కోరుకుంటే అది ఇవ్వగలను, ఐదుసార్ల వరకూ" అని అంది. అప్పుడు ఆ అవ్వ "నాకు బంగారు గాజులూ, వెండీ కావాల"ని కోరుకుంది. తర్వాత "నేను అందమైన కుమారిలాగా మారాలనుకుంది. వంకాయ అవ్వ అడిగినవన్నీ ఇచ్చింది. "అబ్బా ఎంత హాయిగా ఉందో. ఇప్పుడు నేను గుడికి వెళ్లాల"నుకుంది ఆ అమ్మాయి. తనతో పాటుగా ఆ వంకాయనీ తీసుకొని పోయింది. గుడి నుండి తిరిగొస్తుండగా, "అమ్మా! నీకు ఇంకా ఏమి కావాలో అడుగు, నేను ఇంకో రెండు పనులవరకూ చేయగలను" అని అన్నది వంకాయ. ఆ పాప "నాకు మంచి మొగుడు కావాల"ని అడిగింది. వంకాయ వెంటనే మంచి అబ్బాయినీ ఇచ్చింది. అప్పుడు వాళ్లిద్దరూ పెళ్ళి చేసుకొని ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆ పాప ఆ వంకాయని- "నాకు పెద్ద భవనం ఇచ్చేయ్. ఇంకేమీ అడుగను" అంది. ఆ వంకాయ "సరే నీకు భవనం కావాలి అంతే కదా! సరే తీసుకోమ"ని ఒక పెద్ద భవనం ఇచ్చేసింది. ఇక ఆరోజంతా ఆ పాప, ఆమె భర్త, వంకాయ కలసి చాలా సంతోషంగా వున్నారు.
మరుసటి రోజున మొగుడికి వంకాయకూర తినబుద్ధి అయింది. తనకు ఆ వంకాయను కోసి వండి పెట్టమన్నాడా మొగుడు. భార్య వంకాయను తరగ బోయింది. వంకాయ కళ్ల నీళ్లు పెట్టుకుంది. తనను కోసెయ్యవద్దని ప్రాధేయపడింది. "నీకు అంత మేలు చేసాను కదా" అన్నది. అప్పుడా భార్య నవ్వి అన్నది, "వంకాయలు ఏమి చేసినా వంకాయలే, మనుషులు ఏమి చేసినా మనుషులే. ఎవరి రాతలు వారివే. ఎవరి బతుకులు వారివే. లేకపోతే వంకాయలు మనుషుల స్నేహాన్ని ఆశించటమేంటి?" అని పుటుక్కున వంకాయను తరిగేసింది- దానితో ఇంకేమి పని?