ఒకానొకప్పుడు ఒక కీకారణ్యంలో అనేక జంతువులు, పక్షులు జీవిస్తూ ఉండేవి. అదే అరణ్యంలో కొన్ని చిలుకల కుటుంబాలు జీవిస్తూ ఉండేవి. అందులో రెండు చిలుకలు చాలా నేస్తంగా ఉండేవి. ఒకదానికోసం మరొకటి ప్రాణం ఇచ్చుకోగలిగినంత గాఢమైన స్నేహం వాటిది. అవి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ వాగులలో స్నానం చేస్తూ, ఆ అడవిలో దొరికే ఫలాలు తింటూ ఉండేవి. ఆ అడవి వాతావరణంలో అవి ప్రకృతినియమాలు మినహా మరే నిబంధనలుగాని, నియంత్రణలుగాని లేకుండా స్వేచ్ఛగా పెరిగాయి. అంతే కాకుండా వాటికి తోచినమేరకు, వాటి సామర్ధ్యం మేరకు అవి ఇతర జంతువులకు, పక్షులకు, సాయం చేసేవి.
ఆ అరణ్యానికి సమీపంలోనే మునీశ్వరుల కుటీరాలు కొన్ని ఉండేవి. ఆ చిలుకలు రెండూ అక్కడక్కడ తిరుగుతూ ఆశ్రమవాసుల దినచర్యల్ని గమనించనారంభించాయి. ఆ మునీశ్వరులు జీవిస్తున్న పద్ధతి, పిల్లలకు విద్యనేర్పే విధానం వాటికి బాగా నచ్చింది. అవి తమలో తాము "అరే, ఈ మానవులు ఎంత అదృష్టవంతులు! వాళ్ళకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. దానితోబాటు విద్యనేర్చుకునే అవకాశాన్నిచ్చాడు. చూడు ఆ పిల్లలు గురువుగారి వద్ద ఎంత చక్కగా విద్యలు నేర్చుకుంటున్నారో!" అని ముచ్చటించుకునేవి.
అలా కాలం గడిచిపోతున్నది; రెండు చిలుకలకూ వయస్సు మీద పడుతున్నది. వాటి స్నేహం మరింత బలపడి కొనసాగింది. వాటిలో ఒక చిలుకకు తానూ చదువుకోవాలనే కోరిక మరింత బలంగా కలిగింది. కాలం గడచిపోయింది; రెండు చిలుకలూ చనిపోయాయి.
మరణానంతరం వాటి మంచి హృదయాలకు అనుగుణంగా వాటికి స్వర్గ ప్రాప్తి కలిగింది. అలా స్వర్గంలోకూడా వాటి మైత్రి కొనసాగింది. ఆ చిలుకల మైత్రికి సంతోషపడిన భగవంతుడు కొంతకాలం తరువాత వాటిని పిలిచి, "చిలుకల్లారా, మీ స్నేహం కారణంగా మీరు నాకెంతో ప్రియమైనవారైనారు. మీరు స్వర్గలోకాన్ని విడచి వెళ్తున్న సందర్భంగా కోరిన జన్మనొందేలా మీకు వరం ఇవ్వదలచాను. ఏజన్మ కావాలో కోరుకోండి" అన్నాడు.
ఒక చిలుక "మహానుభావా! నీ దర్శనంతో నా జన్మ పావనమైంది. నాకు ఇదివరకటిలాగానే చిలుక జన్మను ప్రసాదించు. అదే అరణ్యంలో నేను మళ్ళీ జన్మించేలా వరమివ్వు" అని అడిగింది. రెండవ చిలుక తనకు మనుష్యజన్మ ప్రసాదించమని వేడుకున్నది. భగవంతుడు "తథాస్తు" అని దీవించాడు. మరుక్షణం ఒకటి చిలుకలాగాను, ఒకటి మనిషిలాగాను భూమిమీద జన్మించాయి.
మొదటి చిలుక అరణ్యంలో జన్మించే సరికి అరణ్యం తగలబడుతున్నది. అక్కడ ఉండవలసిన ముని కుటీరాలు ఏనాడో శిధిలమైనాయి. అరణ్యంలోని చెట్లన్నీ ఏనాడో మనిషివాతనబడి గతించాయి. ఆ అరణ్యంలోంచి బయటపడి ఎంతో శ్రమతో తప్పించుకున్నాయి కొన్ని చిలుకలు. అలా ప్రాణాలతో మిగిలిన చిలుకలకు ఇక ఆహారం కరువైంది. తినేందుకు మధుర ఫలాలు లేవు; గూడు కట్టుకునేందుకు అనువైన చెట్లు కానరావటం లేదు. ఎక్కడ చూసినా కాలుష్యం. ’సుసంపన్నమై, తనను ఊరించి ’రా, రమ్మ’ని పిలిచిన గత జీవితం ఎక్కడున్నది? ’గతం గత:’ గతించిన కాలం మళ్ళీ రాదు. సర్వ సంపదలతో తులతూగే అలాంటి జీవితాన్ని తిరిగి సృజించుకోగలిగే సామర్ధ్యం ఈ చిలుక జన్మకు లేదు. ఇలాంటి జన్మనా, తను కోరుకున్నది?’ అని వగస్తూ చిలుక తన జీవితాన్ని అతి భారంగా నెట్టుకొచ్చింది.
రెండవ చిలుక మానవజన్మనెత్తింది కదా, దాని తల్లిదండ్రులు పల్లెలో జీవితాలు గడపలేక, పట్టణానికి వలస పోయారు. అక్కడ అది అనేకమంది పిల్లలలాగే మురికిగుంటల్లో, రోడ్ల మాటున, అర్ధాకలితో పెరగవలసి వచ్చింది. తనను ఊరించిన అద్భుత విద్యావిధానం కొందరికి మాత్రమే అందుతుందని దానికి ఆలస్యంగానైనా, అర్ధమైంది. భగవంతుడు మనిషికి ఇచ్చిన చింతనా శక్తితో అది ’ఎందుకిలా?’ అని ప్రశ్నించుకున్నది. ’భగవంతుని సృష్టిలో అందరూ ఒకటికాదూ? మానవులు సృష్టించుకున్న ఈ తారతమ్యాల్ని మనిషిగా తను రూపుమాపలేకపోతే తన జన్మ ఎందుకు?’ ఆ చిలుక స్వశక్తితో ఇక గొప్ప నాయకునిగా ఎదిగింది. మానవలోకంలో సత్యానికి, ప్రేమకు ఇంకా స్థానం ఉన్నదని, వాటిని మిగుల్చుకోకపోతే మనందరి జీవితాలూ శిలా సదృశాలే అవుతాయని ప్రవచించింది. దాని మాటలు మెల్లమెల్లగా దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. 'అసమానతలు అమానుషాలు' అన్న భావన పెరిగింది. మానవసమాజం మెల్లగా వెలుగువైపు పయనించింది. తన జీవితం సార్ధకమైందన్న సంతృప్తి దానికి కలిగింది.