నిజం నోటే!!

రవి: అమ్మా చూడు, నాకు రోడ్డు మీద పది రూపాయల నోటు దొరికింది!

తల్లి: ఇది నిజంగా దొరికిన నోటేనా, లేకపోతే అబద్ధం చెబుతున్నావా?

రవి: నిజంగా దొరికిందేనమ్మా! కావాలంటే చూడు, ఆ నోటు పడేసుకున్న ముసలాయన ఇంకా దీనికోసం వెతుకుతూనే ఉన్నాడు!

తల్లి: ఆ!!

జాలి చీమలు

దారివెంట రెండు చీమలు వెళ్తున్నాయి. వాటికి ఎదురుగా ఒక ఏనుగు వస్తున్నది.

మొదటి చీమ: ఒరేయ్! మనం దాన్ని గుద్దేసి చంపేద్దామా?

రెండవ చీమ: ఒద్దులేరా, పాపం! మనమైతే ఇద్దరం ఉన్నాం, అది ఒక్కతే గదా!

అగ్నిహోత్రుడు

భర్త: ఏమనుకుంటున్నావో ఏమో! నాకు గనక కోపం వస్తే ఈ ప్రపంచం అంతా మాడి మసైపోక తప్పదు!

భార్య: అంత వద్దులే గానీ, ముందు కాస్త ఈ పొయ్యి వెలిగించి చూపండి చాలు!

అభినవ ఐన్స్టీన్!

రాము: ఒరేయ్ రాజూ! నువ్వు పట్టుకున్న గొడుక్కి రంధ్రం పడిందిరా!

రాజు: అది దానంతట అది పడలేదురా, నేనే రంధ్రం పెట్టాను.

రాము: నువ్వే పెట్టావా!? ఎందుకు?!

రాజు: లేకపోతే వర్షం తగ్గిందో లేదో ఎలా తెలుస్తుంది?

మంచి బాలుడు!

తల్లి: ఏంట్రా! అప్పుడే వచ్చేశావు?

బన్నీ: టీచరు అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేశానమ్మా! దాంతో ఆవిడ వెంటనే ఇంటికి పంపించేసింది.

తల్లి: (ముచ్చట పడుతూ) మా నాయనే, ఇంతకూ టీచరు ఏం ప్రశ్న అడిగిందిరా?

బన్ని: తనమీదికి రాయి విసిరిందెవరు, అని అడిగింది. నేనే అని సరిగ్గా చెప్పేశా. వెంటనే పంపించేసింది!

తల్లి! ఆ!!!!!!


B. నాగార్జున, ఎనిమిదవ తరగతి, Z.P.H.స్కూలు, చెన్నేకొత్త పల్లి, అనంతపురం జిల్లా చెప్పిన జోకులు:

చెంబట్టుకు

(ఒక అధికారి తన అసిస్టెంటు ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోనును అసిస్టెంటు భార్య ఎత్తింది.)

అధికారి: ఏమ్మా! మీ ఆయన ఎక్కడికెళ్ళాడమ్మా?

అసిస్టెంటు భార్య: ఆయన ఇప్పుడు లేరండీ! చెమ్బట్టుకు పోయారండీ.

అధికారి: (మరో మనిషితో) అయ్యో! నాకిప్పుడు ఆ మనిషితో అర్జెంటు పనిఉందే! ఏమయ్యా! నువ్వా చెమ్బట్టు ఎక్కడుందో కాస్త కనుక్కోవయ్యా.

(సరేనని ఆయన వెళ్లి, మరో ఐదు నిమిషాలకు తిరిగొచ్చాడు.)

అధికారి: ఆ, ఏమయ్యా! కనుకున్నావా?

అవతలి మనిషి: ఆ కనుకున్నానండీ! చెమ్బట్టుకు వెళ్ళడమంటే, చెంబు పట్టుకొని బహిర్భూమికి వెళ్ళడమని అర్థమటండీ!

ఫూల్ బాల్!

చదువురాని మంత్రిగారు ఒకాయన, ఒక పాఠశాలలో జరిగే ఆటల పోటీలను చూడటానికి వెళ్ళారు ఒకసారి. అక్కడ మైదానంలో పుట్ బాల్ ఆడుతున్నారు పిల్లలు. ఆటలో భాగంగా వాళ్ళంతా మైదానంలో బంతిని తన్నుకుంటూ, తోసుకుంటున్నారు. అది చూసిన మంత్రి మైకు దగ్గరికెళ్లి, "ఏమర్రా పిల్లలూ! ఆగండి. ఎందుకలా ఒక్క బంతికోసం అంతమంది తగువులాడుకుంటున్నారు? నేను మీకందరికీ సరిపోయేటన్ని బంతుల్ని తెప్పించే ఏర్పాటు చేస్తానుగానీ, అంతవరకూ మరో ఆటను ఆడండి, చూద్దాం" అన్నాడు.

పిల్లలంతా పక్కున నవ్వారు. అర్థం కాని మంత్రిగారు తలగోక్కున్నారు.

ఒక అంగుళం క్రింద!

పరదేశస్తులు ఇద్దరు ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

వారిలో మొదటివాడన్నాడు: ఒరేయ్! మా దేశంలో విమానాలు చందమామ మీదినుండి పోతాయిరా!

రెండవ వాడు: అవునా, నిజమా!? చందమామ మీదినుండి పోతుంటాయా?

మొదటివాడు: ఒక అంగుళం అటూ ఇటూ అవుతుంటుందేమో, అంతే!

రెండవవాడు: మా దేశంలో అందరూ ముక్కుతో తింటారు తెలుసా?

మొదటివాడు: నిజమా!? అదెలాగ?

రెండవ వాడు: పూర్తిగా ముక్కుతో కాదు; దానికి కాస్త కిందుగా ఉన్న నోటితో తింటారంతే!

ఒన్ మినిట్!

గురువుగారు: శిష్యా! నేను ఢిల్లీకి వెళ్ళాలి, రైలెంతకుందో ఫోన్ చేసి కనుక్కో!

శిష్యుడు: సరేనండీ. (స్టేషన్ కు ఫోన్ చేసి-) అయ్యా! ఢిల్లీకి రైలెంతకుందో చెప్తారా అండీ?

రైల్వే క్లర్కు: వన్ మినిట్ ప్లీజ్

శిష్యుడు: (మరుక్షణం, ఫోన్ పెట్టేసి గురువుగారి దగ్గరికెళ్ళి) వన్ మినిట్లో ఉందట స్వామీ!

గురువుగారు: ఆ!!!