2008 పోయి 2009 వచ్చేసింది. ఇంకో రెండు మూడు నెలల్లో పరీక్షల కాలం మొదలవుతుంది.

రకరకాల పరీక్షలు.

చిన్న చిన్న పిల్లలకు యల్. కె. జి పరీక్షలు.

పెద్ద పిల్లలకు యంసెట్ పరీక్షలు, జేయీయీలూ.

మరింత పెద్ద పిల్లలకు మరిన్ని రకాల సెట్లు.

ఇవన్నీ పిల్లల తల్లిదండ్రులకు పరీక్షలు.

వీటన్నిటికోసం దీక్షగా చదవటం మొదలెట్టి వుంటారు అందరూ, ఈ పాటికే.

గతంలో ఒక ప్రశ్న తరచు అడుగుతుండేవారు- " ఒరే! నువ్వెందుకు చదువుతున్నావురా?" అని. "విజ్ఞానాభివృద్ధికి" అని చెప్తే మెచ్చుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అదే నమ్మకం: " చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుంది; అలా మనకు, విజ్ఞానానికీ రెండందాలా మేలు జరుగురుతుంది" అని.

తర్వాత్తర్వాత, చదువుకునేది "ఉద్యోగం సంపాదించుకునేందుకు" అని చెప్పడం రివాజైంది. ’ఎలాంటి ఉద్యోగంకావాలంటే అలాంటి చదువు చదవాలి.’

ఇప్పుడు పరిస్థితి ఇంకా మారింది. పొట్టకూటికోసం చదవాలి. బ్రతకాలంటే చదవాలి. చదువులేకపోతే బ్రతకలేం గనుక చదవాలి. ఏం చదివితే బ్రతకొచ్చో అది మాత్రం చదివితే చాలు. ప్రస్తుతం కంప్యూటర్లది రాజ్యం- కనుక పిల్లల్ని ఆరేళ్ల వయసులోనే కంప్యూటర్ పండితులుగా తయారుచేస్తే సరిపోతుందన్న భావన! సాంఘిక శాస్త్రాలు, భాషా విజ్ఞానాలు, సంగీత వాయిద్యాలు, కథలు-కాకరకాయలు, ఇంట్లో పని, పశువుల్నీ- పంట మొక్కల్నీ జాగ్రత్తగా చూసుకోవటం- ఇవన్నీ వృధా అన్న భావన!

అందుకేనేమో, ఈ మధ్యచాలా మంది మనుషులే మృగాల మాదిరి తయారవుతున్నారు. యాసిడ్లూ, బాంబులూ, తుపాకులూ అంటూ మారణకాండలకు ఒడిగట్టగల్గుతున్నారు.

చాలా మంది నవ్వటం కూడా మరచిపోతున్నారు. ఎప్పుడూ ఏవేవో ఆలోచనలతో కొట్టు మిట్టాడుతూ భారంగా బ్రతుకుతున్నారు.

మీరెవరూ అలా కాకూడదనీ, ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లోనూ సంతోషపు జల్లుల్ని కురిపించి, నవ్వులు పండించాలనీ ఆకాంక్షిస్తూ-

మీ కొత్తపల్లి బృందం