అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద మోతుబరి రైతు ఉండేవాడు. ఆయనకు చాలా పొలం ఉండేది. పెద్ద ఇల్లూ, ఆ ఇంటికి వెనుకనే పెద్ద పెరడూ ఉండేది. ఆ పెరట్లో రకరకాల పూలమొక్కలు ఉండేవి. పెరడుకు పక్కగా ఒక పశువుల పాకకూడా ఉండేది. ఆ పాకలో వాళ్లు ప్రతిరోజూ తమ ఎద్దులను కట్టేసేవారు.
పగలంతా ఆ ఎద్దుల్ని పనికి తీసుకెళ్ళి, సాయంత్రానికిగానీ వాటిని ఇంటికి తీసుకు వచ్చేవారుకాదు పనివాళ్ళు. అలా పగలంతా పొలంలో పని చేసీ చేసీ సాయత్రానికి బాగా అలసిపోయి వచ్చేవి ఆ ఎడ్లు రెండూ. ఇలా రోజులు గడవసాగాయి.
ఇంతలో వేసవి వచ్చింది. రైతు పెరట్లోని మల్లెచెట్టు విరగపూసింది. రోజూ సాయత్రం అవగానే దాని పూలన్నీ వికసించి, వాటి వాసన పెరడంతా వ్యాపించి, ఆ వాసన అలా పాకుతూ వెళ్ళి రైతు ఇంటినికూడా తాకేది. అప్పుడు రైతు భార్యా, అతని కూతురూ వచ్చి ఆ పూలన్నింటినీ కోసుకొనే వాళ్ళు. ఆ పూలతో ఒక చిన్న బుట్ట నిండిపోయేది. ఆ పూలన్నింటినీ వాళ్ళు మాలలుగా కుట్టి, వారి జడలలో ముడుచుకొనేవారు. దేవాలయానికి పూజకుకూడా తీసుకెళ్ళేవారు. ఇంకా మిగిలిన పూలను వారి ఇంటి గుమ్మానికి వేలాడదీసేవారు. అందంగా.
తన పూలు అన్ని రకాలుగా ఉపయోగపడుతుండటం చూసిన ఆ మల్లె పొదకు ఎక్కడలేని ఆనందం కలిగింది. ఆ ఆనందం కాస్తా మూన్నాళ్లకు గర్వంగా మారింది.
"నా పూవులు మగువలకు అందాన్నిస్తాయి. దేవుని పూజకూ పనికి వస్తాయి. అలంకరణకూ ఉపయోగడతాయి. పైగా సువాసనను ఇస్తాయి. నా వలన ఎన్ని ఉపయోగాలో!" అని ఆ మల్లె చెట్టు తెగ సంబర పడిపోయేది. కానీ అక్కడితో ఆగిందా? ఆగలేదు! రోజూ పొలం పని చేసి అలసిపోయి తిరిగొచ్చే పశువులను చూసి, వాటి జీవితాన్నితన జీవితంతో పోల్చి చూడటం మొదలెట్టింది.
"అయ్యో! ఆ పేడ కంపు! వెధవ జీవితాలు చూడు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాయో! రోజూ పని చేసి చావాలి. ఏనాడూ సుఖమెరుగని బతుకులు! ఏం జన్మో ఏమో, వాటిది" అని వాటినీ, వాటి జన్మనీ, వాటి పరిసరాలనూ, వాటి పనినీ పదేపదే చిన్నచూపుచూస్తూ, ఏదో అవ్యక్తానందాన్ని పొందసాగింది అది.
కొన్నాళ్ళకు దాని ఆలోచనలు మాటల రూపం దాల్చాయి. ఒకనాటి సాయంత్రం మల్లెచెట్టు ఎద్దులతో ఇలా అన్నది. "ఓ మొద్దన్నలారా! ఎద్దన్నలారా! నేను, అందమైన మల్లె తీగను మాట్లాడుతున్నాను. మీరేనాడైనా సుఖంగా ఉన్నారా? అసలు సుఖమంటే ఏమిటో మీకు తెలుసునా?" అని అడిగింది వెటకారంగా.
ఆ వృషభరాజులు ఏమీ జవాబివ్వలేదు. మల్లెతీగకు వాటి మౌనం మరింత కుతూహలాన్ని కలిగించింది. అది ఇంకొన్ని ప్రశ్నలను సంధించింది. "మీరెప్పుడైనా గుడికెళ్ళారా? పూజలు చేశారా? గుడిలో దేవుణ్ణి తాకారా? ఆయన మెడలో ఊయలలు ఊగగలిగారా? అలాంటి పుణ్యకార్యమేదైనా, ఏనాడైనా చేయగలిగారా?" అని మరింత గట్టిగా అడిగింది.
అప్పుడు ఆ వృషభరాజులు రెండూ మల్లెతీగతో ప్రశాంతంగా ఇలా అన్నాయి. "ఓ మల్లెతీగా!‘ మేము ఏనాడూ ఏ గుడికీ వెళ్లలేదు. ఏ పూజలూ చేయలేదు. మా పనే మాకు దేవుడు. మేము పనిచేసే పొలమే మా దేవాలయం. అక్కడ మేము రోజంతా కష్టపడి పనిచేయడం ద్వారా ఎంతో పంట పండుతున్నది. దాంతో మేము ఎంతో మంది ఆకలిని తీర్చగలుగుతున్నాము, మా కష్ట ఫలాన్ని పదిమందికి పంచగలుగుతున్నాము. అదే మాకు పుణ్యం. బండరాళ్ళపైనా, గుమ్మాలపైన , జడలలోనూ కాసేపు వేలాడటంలో నువ్వనుకునేంత పుణ్యమేమీ మాకు కనబడటంలేదు. నీ పూలుండేది నాలుగు దినాలే! మిగిలిన కాలమంతా నిన్ను చూసేవాడే ఉండడు కదామ్మా, మల్లెతీగమ్మా? ఇవ్వటంలో ఆనందాన్ని పొందగలగాలి కానీ, ఇవ్వటంద్వారా గర్వాన్ని పెంచుకోకూడదమ్మా!" అన్నాయి అవి చల్లగా.