ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. ఒకసారి అది పాలు కలుపుకోబోతుంటే బూస్టు పొడి అయిపోయిందని గుర్తుకొచ్చింది. మరేం చేయాలి? అందుకని అది ప్రక్కింటి నక్కమ్మ దగ్గరికి వెళ్ళి " ఒక చెంచాడు బూస్టు పొడి ఇవ్వవా, నీకు మళ్ళీ తెచ్చి ఇస్తాను" అని అడిగింది.
నక్కమ్మ అంత మంచిదేమీ కాదు. మాములుగా అయితే ఇవ్వదు కదా! అదన్నది, "సరే అయితే- నీకో చెంచాడు ఇస్తాను, కానీ నువ్వు నాకు తిరిగి ఇచ్చేటప్పుడు రెండు చెంచాలు బూస్టు పొడి ఇవ్వాలి మరి. అలా అయితేనే నేను ఇచ్చేది" అన్నది. కుందేలు "సరే" అని చెప్పి బూస్టు పొడి తెచ్చుకున్నది.
తరువాతిరోజున కుందేలు రెండు చెంచాలు బూస్టు పొడిని తీసుకెళ్ళి నక్కమ్మకు ఇవ్వబోయింది. కానీ నక్కమ్మ ఆశపోతు కదా, అది తీసుకోలేదు. అన్నది, "నువ్వు నాకు ఇవ్వాల్సింది మూడు చెంచాల పొడి కదా, మరి రెండే ఇస్తున్నావేం? " అని!
ఆ మాటలు విన్న కుందేలు నిర్ఘాంతపోయింది. పాపం దాని దగ్గర ఎక్కువ బూస్టు లేదు. అందుకని అదన్నది "కాదు. మన ఒప్పందం ప్రకారం నేను ఇవ్వాల్సింది రెండు చెంచాల పొడే. మూడెందుకు ఇవ్వాలి?" అన్నది.
" కాదు, నేను ఆ రోజునే చెప్పాను. మూడు చెంచాల పొడి తిరిగి ఇవ్వాలని! ఇప్పుడు నన్ను మోసం చెయ్యకు" అని గొడవ చేసింది జిత్తుల మారి నక్క. గొడవ పెద్దదైంది. చివరికి ఇద్దరూ న్యాయం కోసం ఏనుగు రాజు గారి దగ్గరకు వెళ్ళారు. ఏనుగు రాజుగారు ఆ రోజున హడావిడిగా ఉన్నారు. వీళ్ళ గొడవ తేలేట్లు లేదు. రేపు "రండి" అని చెప్పారు. వాళ్ళు వెళ్తుండగా కుందేలును వెనక్కి పిలిచి చెవిలో ఏదో చెప్పారు గుసగుసగా ఏనుగుగారు.
మర్నాటి రోజున ఉదయమే కుందేలూ, నక్కా రెండూ రాజు గారి ముందుకొచ్చి నిలబడ్డాయి. " సమస్య ఏంటి కుందేలూ" అని అడిగారు రాజుగారు." ఏమీ లేదు ప్రభూ! ఈ నక్క మా పొరుగింట్లో ఉంటుంది. నేను తనకు మూడు చెంచాల బూస్టు పొడి ఇవ్వాలని గొడవ చేస్తున్నది. ఊరికే నేనెందుకు ఇవ్వాలి, మీరే చెప్పండి ప్రభూ " అన్నది కుందేలు.
"ఊరికే ఏమీ ఇవ్వనక్కరలేదు " అన్నారు రాజుగారు.
"కాదు ప్రభూ, కుందేలు నా దగ్గర ఒక చెంచా బూస్టు పొడి అప్పు తీసుకున్నది. ఇచ్చేటప్పుడు మూడు చెంచాల పొడి ఇస్తానన్నది. ఇప్పుడేమో మూడు ఇవ్వను, రెండే ఇస్తానంటున్నది " అన్నది నక్క .
" నేనెక్కడ అన్నాను? నేనసలు దీని దగ్గర ఏమీ తీసుకోలేదు. మహారాజా, దీనికి ఏమీ ఇవ్వనక్కర్లేదు " అన్నది కుందేలు. ఇప్పుడు నిర్ఘాంతపోవటం నక్క వంతైంది.
"ఏంటీ? నాదగ్గర ఏమీ తీసుకోలేదా?" అన్నది అది ఆశ్చర్యపోతూ.
" నేనెక్కడ తీసుకున్నాను? నేనేమీ తీసుకోలేదు. నేనేమీ నీకు ఇవ్వనక్కర్లేదు కూడా " అంది కుందేలు
"మీరే న్యాయం చెయ్యాలి రాజా. ఇది నా దగ్గర ఒక చెంచాడు బూస్టుపొడి అప్పు తీసుకున్నది. "నిజం!" అరిచింది నక్క.
"నాకేం తెలీదు ప్రభూ, నన్ను కాపాడండి" అన్నది కుందేలు. దీనంగా ముఖం పెట్టి.
" ఏయ్ కుందేలూ! నువ్వు నా దగ్గర ఒక చెంచాడు పొడి తీసుకోలేదూ? తిరిగి ఇచ్చేటప్పుడు రెండు చెంచాల బూష్టు పొడి ఇవ్వాలని నేనంటే" సరే" అని నువ్వనలేదూ? నిజం చెప్పు!" అని అరిచింది నక్క. ఒళ్లు తెలీని కోపంతో.
ఏనుగు రాజుగారు నవ్వారు. " ఇదే అసలు నిజం. దురాశ కొద్దీ నక్క రెండు చెంచాల బదులు మూడు చెంచాల పొడి కావాలని పోరు పెట్టింది. ఇప్పుడు నిజం బయటపడింది. కుందేలుది ఏ తప్పూ లేదు. మోసం చేయాలనుకున్నందుకుగాను నక్కకు నష్టం జరగాల్సిందే. కుందేలు నక్కకు ఏమీ ఇవ్వక్కర్లేదు." అని తీర్పు ఇచ్చారు.
సభలోని వారంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు.