భారతదేశం సర్వమతాల సమ్మేళనం. ప్రతి మతానికి కులానికి ఏవో కొన్ని ఆచారాలు, పద్దతులు, వ్యవహార శైలులు వుంటాయి. అందులో భాగంగా ప్రజలు ఆయా సంప్రదాయ వ్యవహారాలను పాటిస్తూ ఆనందిస్తూవుంటారు. అలా ఇస్లాం మతస్తులు జరుపుకునే పండుగలలో ముఖ్యమైనవి రెండు. అవి 1. ఈదుల్ ఫితర్ , 2. ఈదుల్ జుహా.

ఈదుల్ ఫితర్ ముస్లింలకు అతి పవిత్రమైన పండుగ. దీని అర్థం ఉపవాస దీక్ష తరువాత జరుపుకునే సంబరం అని. ఈ పండుగను ముస్లిం క్యాలండర్ ప్రకారం తొమ్మిదవ నెలలో జరుపుకుంటారు. ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాస దీక్షలను ప్రారంభించి, మాసంపాటు వాటిని అమలు పరచి, దైవ ప్రార్థనలు చేస్తారు.

ఈదుల్ ఫితర్ తరువాత రెండునెలలకు ఈదుల్ జుహా వస్తుంది. ఈదుల్ జుహా మనిషి యొక్క త్యాగ నిరతిని గురించి తెలియజేసే పండుగ. అందుకే దీనిని ’త్యాగాల పండుగ’ అనికూడా అంటారు. దీనికే మరో పేరు ’బక్రీద్’. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందనటానికి ఒక కథ చెబుతారు. హజ్రత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లా కనిపించి "నీ కుమారుని నాకు బలి ఇవ్వమ"ని కోరాడు. నిద్రనుండి మేలొన్న ఇబ్రహీం తన కుమారుడైన ఇస్మాయిల్ కు ఈ సంగతి తెలియజేశాడు. దైవ భక్తుడైన ఇస్మాయిల్ అందుకు ’సరే’ నన్నాడు. ఇక బలి ఇవ్వబోయే ముందు దేవుడు అతని త్యాగనిరతికి సంతోషించి, ఆయన స్థానంలో ఒక గొర్రెను సృష్టించాడు. ఆనాడు ఇబ్రహీం దేవునికి గొర్రెను సమర్పించినందుకు గుర్తుగా ఈ పండుగను బక్రీద్ అని పిలవటం జరిగింది. (బక్రా అనగా గొర్రె)

బక్రీద్ రోజుకు ముందురోజున చనిపోయినటువంటివారి గోరీలవద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలు, వస్తువులను ఉంచుతారు. వారు స్వర్గంనుండి వచ్చి వాటిని భుజిస్తారని, స్వీకరిస్తారని, స్వీకరించి తమను ఆశీర్వదిస్తారని నమ్ముతారు. ఈ పండుగ సందర్భంగా ధనికులు పొట్టేలు మాంసాన్ని పేదలందరికీ ’కుర్బానీ’ అనే పేరుతో పంచటం ఆనవాయితీ. మరీ ధనవంతులు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అతి పవిత్రమైన మక్కాను సందర్శిస్తారు. ఈ యాత్రనే హజ్ యాత్ర అని అంటారు. ఈ ఏడాది హజ్ యాత్రకు మనదేశంనుండి దాదాపు ఒక లక్షా ముఫ్ఫైరెండువేల మంది ముస్లిములు వెళ్ళారని అంచనా.

బక్రీద్ పండుగ రోజున ముస్లిం సోదరులందరు కలిసి ’ఈద్ గా’ అనే ప్రత్యేక ప్రార్థనా స్థలంలో ప్రార్థనలు జరుపుతారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు "ఈద్ ముబారక్" అంటూ పండుగ శుభాకాంక్షలను తెలుపుకుంటారు.

మీకందరికీ కూడా "ఈద్ ముబారక్".