పచ్చని మొక్కల మధ్య విరపూయటానికి సిద్ధంగా ఉన్న ఎర్ర గులాబి పిల్లగాలికి చిరునవ్వులు చిందిస్తూ అటూ ఇటూ ఊగుతున్నది. ఆ దృశ్యాన్ని తన బుల్లి కళ్ళతో చూసింది సత్య. ఆ ఎర్ర గులాబి తన కళ్ళకు జిలేబీలా కనిపించింది. " భలే భలే గులాబీ, ఎర్ర ఎర్రని గులాబీ నాతో స్నేహం చేస్తావా? ముద్దుగ నిన్ను చూసుకుంటా". అంది సత్య .
"ఆహా ! ఓహో! భలే భలే, నీతో నేస్తం కడతా ఓపాపా! నిన్ను మురిపిస్తాను, మైమరిపిస్తాను." అన్నది ఎర్ర గులాబి.
సాయంత్రం తన తోటలోకి ఎర్ర గులాబి మొక్కని తెచ్చిపెట్టుకొని, ప్రతి రోజూ హాయిగా ఆడుతూ, పాడుతూ సంతోషంగా నీళ్ళు పోస్తూ పెంచుతున్నది సత్య. ఎర్రగులాబీని చూస్తూ అమ్మచేతి గోరుముద్దలు తింటూ హాయిగా గడపసాగింది ఆ పాప. మూన్నాళ్ళకు తన రేకులన్నింటినీ చూపిస్తూ పెద్దగా వికసించింది గులాబీ.
ఆ ఉదయం పాప గులాబీని కోయబోయింది ఆత్రంగా.. పువ్వును తాకిందో లేదో అంతలోనే "అమ్మా" అంటూ తన చేతిని వెనక్కు తీసేసుకుంది బాధగా. వేలిమొన చురుక్కుమన్నది. చూస్తే ఎర్రని గులాబీని పోలిన రక్తపు బొట్టు ఒకటి నేలరాలింది. దాన్ని చూసిన పాపాయి గాబరాపడిపోయింది.
అది చూసిన గులాబి, "అయ్యో నా నేస్తమా! నన్ను జాగ్రత్తగా కొయ్యాలమ్మా. ఓ బుల్లి పాపాయీ! నా రక్షణకోసం నేను కనపడని సిపాయిలలాంటి ముళ్ళను కలిగి ఉన్నాను. అవి లేకపోతే దొంగలు నన్ను సులభంగా తన్నుకుపోగలరు. అందుకని ఆత్మరక్షణ కోసం కొన్ని చిన్న ఏర్పాట్లు చేసుకొన్నాను" అని చెప్పింది గులాబి, పాపతో.
"అబ్బో! ఇలాంటి ఏర్పాటు కూడా చేసుకున్నావా! ఇంత చిన్న బుర్రలో ఎన్ని తెలివితేటలో. అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం. నిన్ను చూస్తుంటే నాకెంత ముచ్చటేస్తున్నదో! మన దేశ నాయకులు కూడా నీలా ఆలోచించి అప్రమత్తంగా ఉండిఉంటే ఏ తీవ్రవాదులు గానీ, మరే విధ్వంశకర శక్తులుగానీ అమాయక జనాలను బలిగొనే పరిస్థితి ఉండేదికాదు. కానీ అలా జరగలేదే! మన దేశానికి పెద్ద గాయమే తగిలింది. అలా జరగకుండా ఆపడానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలనే పోగొట్టుకొన్న వీర జవానుల పాదాల దగ్గర నిన్ను ఉంచి వారికి మన జోహారులు అర్పిద్దామనుకున్నాను. అందుకే నిన్ను కోయబోయాను. నన్ను క్షమించు." అన్నది సత్య.
"అవునా! అలాంటి చోటుకు వెళ్ళడంకంటే నాకు ఇంకేం కావాలి? త్వరగా నన్ను కోసుకో పాపా! అక్కడికి వెళదాము" అన్నది ఎర్ర గులాబీ ఆత్రంగా.