సమస్యలు

  1. ఒకతను ఒక మేకనూ, ఒక పులినీ, ఒక ఆకుల కట్టనూ తీసుకొని దారి వెంట వెళుతుండగా ఒక నది అడ్డంవచ్చింది. నదిని దాటడానికి అక్కడ ఒక్క పడవ మాత్రమే ఉన్నది. అందులో, అతనూ, ఇతర వస్తువు ఏదయినా ఒకటి మాత్రమే అవతలికి తీసుక వెళ్ళడానికి వీలవుతుంది. అయన లేకపోతే, మేకేమో, ఆకులకట్టను తింటుంది. పులేమో, మేకను తింటుంది. మరి ఆ మూడింటినీ ఎలా అవతలికి చేర్చుతాడో చెప్పుకోండి.

  2. సంధ్య, వీణ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. సంధ్య వాళ్ళ ఇంటికి బందువులు వచ్చారు. సంధ్యకు నాలుగు లీటర్ల పాలు కావాలి. వాళ్ళింట్లో మూడులీటర్లు పట్టే పాత్ర మాత్రమే ఉన్నది. అపుడు సంద్య వీణ వాళ్ళ ఇంటికి పోయి ’నాలుగు లీటర్లు పట్టే పాత్ర’ ఉన్నదా ? అని అడిగింది.”నాకూ నాలుగు లీటర్ల పాలు కావాలి. కానీ మాఇంట్లో కూడా ఐదు, ఎనిమిది లీటర్లు పట్టేపాత్రలే ఉన్నాయి, పద ఇద్దరంపోయి ఎనిమిది లీటర్ల పాత్రలోకి పాలు తెచ్చుకొందామ’ని, వెళ్ళారు. తిరిగొచ్చి, వారిద్దరూ ఆ పాలను ఎలా పంచుకుంటారు ?

పొడుపు కథలు

1. 
    అమ్ములో జమ్ములో పుడితివాకొడకా !
    అరచేతి పట్నానికి వస్తివా కొడకా !
    గోరంత తిరునాళలో చస్తివా కొడకా !
    ఇంతకీ నువ్వెవరు ఓ కొడకా?    
2. 
    గజిబిజి నీళ్ళలో శ్రీరాముడు పుట్టె
    శ్రీరాముని కడుపులో వైరాముడుపుట్టె 
    వైరాముని కడుపులో వజ్రము పుట్టె.
    ఎవరది, చెప్పండి?
3. 
    ఆదోని అరిటాకు
    బళ్ళారి బాణకట్టె
    గుత్తి ముత్యాల చెండు.
    ఏమిటా మూడూ?
 

జవాబులు:

మొదటి సమస్య:

అతను ముందుగా మేకను తీసుకవెళ్ళి, దాన్ని అవతలి ఒడ్డుకు చేర్చి, వెనక్కి వస్తాడు. తరువాత ఆకుల కట్టను తీసుక పోయి, దాన్ని అక్కడ ఉంచి, మేకను వెనక్కి తీసుక వస్తాడు. ఈసారి మేకను ఇవతలి ఒడ్డునే ఉంచి, పులిని అవతలి ఒడ్డుకు తీసుకపోతాడు. తర్వాత వచ్చి, మేకను అవతలి ఒడ్డుకు తీసుకపోతాడు.

రెండవసమస్య:

మొదట మూడు లీటర్ల పాత్ర నిండా పాలను పోశారు. ఆ మూడు లీటర్లనూ, ఐదు లీటర్ల పాత్రలోకి మార్చారు. ఇపుడు మూడు లీటర్ల పాత్ర ఖాళీగా ఉన్నది. ఎనిమిది లీటర్ల పాత్రలో, ఐదు లీటర్ల పాలుమాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఆపాలను మూడు లీటర్ల పాత్ర నిండా పోశారు. ఇపుడు ఎనిమిది లీటర్ల పాత్రలో రెండు లీటర్ల పాలుమాత్రమే మిగిలున్నాయి. ఇపుడు మూడు లీటర్ల పాత్రలోని పాలనూ తిరిగి ఐదులీటర్ల పాత్రలోనికి పోశారు. ఇంతకుముందే పోసిన మూడు లీటర్ల పాలున్న కారణంగా, ఇప్పుడు అందులోకి రెండు లీటర్ల పాలుమాత్రమే పట్టాయి. మిగిలిన ఒక్క లీటరు పాలు మూడు లీటర్ల పాత్రలో ఉన్నాయి. ఐదు లీటర్ల పాత్రలోని పాలను , తిరిగి ఎనిమిది లీటర్ల పాత్రలోకి పోశారు. మూడులీటర్ల పాత్రలోని పాలను ఐదు లీటర్ల పాత్రలోకి మార్చారు. మూడు లీటర్ల పాత్రలోకి ఎనిమిదిలీటర్ల పాత్రలోనుంచి పాలు పోశారు. మూడు లీటర్ల పాలను ఐదు లీటర్ల పాత్రలోకి పోశారు. ఐదు లీటర్ల పాత్రలో ముందుగా ఒక లీటరు పాలు ఉంటాయి. ఇప్పుడు మూడు లీటర్ల పాలను పోశారు. ఐదు లీటర్ల పాత్రలో నాలుగు లీటర్లు, ఎనిమిది లీటర్ల పాత్రలో నాలుగు లీటర్ల పాలున్నాయి. భలే సులభంగా ఉన్నది కదా, జవాబు!

మొదటి పొడుపుకథకు జవాబు: పేను

రెండవ పొడుపుకథకు జవాబు: వరి

మూడవ పొడుపుకథకు జవాబు: జొన్నఆకు, జొన్న దంటు, కంకి.