ఒక ఊరిలో ఒక మొరటోడు ఉండేవాడు. అతను గొర్రెలు కాసేవాడు. ఒక రోజు మొరటోడు గొర్రెలు మేపడానికి వెళ్ళాడు. అప్పుడొకాయన ఆ దారిన వచ్చి, ’ఓయప్పో ! దామాజిపల్లికి ఇక్కడ నుండి ఏదారిన పోవాలప్పా?’ అని అడిగాడు. ’ఈ దారి పోతుందప్పా!’ అని మొరటోడు చూపిస్తూ, ’చేతిలో ఆ క్యారియర్ ఏందప్పా?’ అని తిరిగి అడిగాడు. ’ఇవి కుడాలు’ అని చెప్పాడు ఆ బాటసారి.
’ఏదీ, ఒకటీయప్పా! అని అడిగాడు మొరటోడు. ఆయన ఒకటిచ్చాడు ఇతనికి. అది తిన్న మొరటోడు ’భలే ఉంది, ఇదేమిటప్పా’ అని మరోసారి అడిగాడు. ’ఇవి కుడాలప్పా!’ అని చెప్పి వెళ్ళాడు ఆయన.
అవి బాగా నచ్చిన మొరటోడు, తను వాటి పేరు మర్చిపోకుండా ఉండేందుకని ’కుడాలు... కుడాలు.. కుడాలు’ అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. మరి, దారిలో ఒక కాలువ అడ్డం వచ్చింది. కాలువను దాటేందుకుగాను ’హుప్.... ’ అని ఎగరాల్సి వచ్చింది మొరటోడికి. ఆ ప్రయత్నంలో ’కుడాల’ను మరిచి పోయాడు వాడు.
ఇక ఇంటికి చేరుకొని తన భార్యతో ’ఏమేయ్ ! నాకవి చేసిపెట్టు, హుప్.. అనటం మొదలుపెట్టాడు. ’ఏవండీ?’ అని అడిగింది భార్య. ’అవేనే..హుప్. అవి’ చెయ్యమంటాడు మొరటోడు. ’అయ్యో, హుప్ అంటే ఏవండీ?’ అని మళ్ళీ అడిగింది భార్య. ’అవేనే, హుప్- అంటే ఏవంటావా?’ అని భార్యను చితకబాదాడు మొరటోడు. ఆమె కెవ్వుమన్నది.
ఇరుగు పొరుగు వారందరూ వచ్చి విషయం తెలుసుకొని, ’ఎందుకయ్యా నీ భార్యను అలా కొట్టావు? చూడు, తన శరీరం మీద ఎలా కుడాలు కాశాయో’ అన్నారు.
’ఆ...ఆ...అవే.. అవే..కుడాలు... కుడాలు, అవే నేను చేసిపెట్టమన్నది’ అన్నాడు మొరటోడు’అదేదో ముందుగానే చెప్పుంటే చేసిపెట్టేదాన్నికదా!’ అని తన భర్తకు కుడాలను చేసి పెట్టిందా భార్య.
పాపం, భార్య!!!