రాత్రిపూట ఆకాశంలో చంద్రుడు ఒక ప్రక్కన వెన్నెల వెలుగులు కురిపిస్తున్నాడు. రెండో వైపున చుక్కలు మెరుస్తున్నాయి. రాముకిప్పుడు మూడేళ్లు. మంచం మీద పడుకుని ఆకాశాన్ని చూస్తుంటే నక్షత్రాల పువ్వులు అన్నీ కళ్లముందు పరచుకొని కనిపిస్తున్నాయి. కొన్ని నక్షత్రాల్ని కోసుకుంటే బాగుండుననిపిస్తోంది. తన జేబులో ఎన్ని నక్షత్రాలు పడతాయి? ఒకటి, రెండు, మూడు,.. పది..ఇరవై వరకు పట్టవచ్చేమో. తనొక ఇరవై నక్షత్రాలు కోసుకొని వస్తే బాగుండు. ఈ ఆకాశపు చెట్లో చాలా నక్షత్రాలున్నై, పరవాలేదు. వెళ్ళి కోసుకుంటే సరి. పోనీలే, ఒక రెండు నక్షత్రాలు తెస్తే చాలులే. ఊరికే వాడిపోతే ఏమి లాభం? సమస్యల్లా ఒక్కటే- ఎలా వెళ్ళాలి అనేదే.

రాముకి చెవిలో జుయ్ అని శబ్దం వినబడింది. దోమ. వెంటనే రాముకు ఒక ఆలోచన వచ్చింది.

"దోమా, దోమా, నీ రెక్కలిస్తావా నాకు కొంచెం సేపు? ఒక్కసారి ఆకాశంలోకి వెళ్లి రెండు నక్షత్రాలు కోసుకొస్తాను?" అడిగాడు రాము.

"అమ్మో! నేనివ్వను. అయినా నా రెక్కలు నీకు సరిపోవు. తూనీగ రెక్కలు బాగుంటాయి. అది నీకిస్తుందేమో మరి. అడిగిచూడు" అని రాముని కుట్టింది దోమ.

రాము దోమను తరిమి, తూనీగ దగ్గరకు వెళ్లాడు. మామూలుగా అటూ ఇటూ ఆగకుండా ఎగిరే తూనీగ ఇప్పుడు చెట్టు రెమ్మ మీద కూర్చుని నిద్రపోతున్నది. "దోమనడిగితే రెక్కలివ్వనంది. తూనీగా తూనీగా, నీ రెక్కలిస్తావా నాకు కొంచెం సేపు? ఒక్కసారి ఆకాశంలోకి వెళ్లి రెండు నక్షత్రాలు కోసుకొస్తాను?" అడిగాడు రాము.

"సరే, తీసుకో. కానీ అవి నీకు సరిపోతాయో సరిపోవో. నీ శరీరం చాలా పెద్దదిగదా" అన్నది తూనీగ.

"చూద్దాం" అని, తూనీగ రెక్కలు పెట్టుకున్నాడు రాము. కానీ చాలా వేగంగా రెపరెపలాడే ఆ చిన్న రెక్కలు రాము బరువును లేపలేకపోయాయి. తూనీగ అన్నది- "ఇవి చాలా చిన్నవి కదా, పిచ్చుక రెక్కలైతే సరిపోతాయి నీకు. అడిగిచూడు" అని.

"సరే" అని, రాము తూనీగ రెక్కలు వెనక్కి ఇచ్చి, పిచ్చుక దగ్గరకు వెళ్లాడు. "దోమ రెక్కలు ఇవ్వనంది. తూనీగ రెక్కలు చాలవంది. పిచ్చుకా పిచ్చుకా, నీ రెక్కలిస్తావా నాకు కొంచెం సేపు? ఒక్కసారి ఆకాశంలోకి వెళ్లి రెండు నక్షత్రాలు కోసుకొస్తాను?"

"సరే, చూడు" అంది పిచ్చుక. "కానీ ఇవికూడా సరిపోవేమో"

"చూద్దాం" అని పిచ్చుక రెక్కలు పెట్టుకున్నాడు రాము. కానీ ఆ బుల్లి రెక్కలు రాము బరువును లేపలేదు.

"నేను నీకు ముందే చెప్పానుకదా, కాకిని అడిగిచూడు" అంది పిచ్చుక.

"దోమ రెక్కలు ఇవ్వనంది. తూనీగ రెక్కలు చాలలేదు. పిచ్చుక రెక్కలు సరిపోలేదు. కాకీ కాకీ, నీ రెక్కలిస్తావా నాకు కొంచెం సేపు? ఒక్కసారి ఆకాశంలోకి వెళ్లి రెండు నక్షత్రాలు కోసుకొస్తాను?" అడిగాడు రాము, కాకి దగ్గరకెళ్లి.

"సరే, తీసుకో" అంది కాకి. కానీ ఆ రెక్కలు పెట్టుకుంటే రాము కోడిలాగా కొంచెం కొంచెం పైకి ఎగరగలిగాడు తప్ప, ఆకాశంలోకైతే పోలేదు.

కాకి అన్నది, "ఇవి నీకు నప్పలేదు. గద్ద రెక్కలు సరిపోతాయేమో, అడిగిచూడు."

"దోమ వినలేదు. తూనీగ రెక్కలు చాలలేదు. పిచ్చుక రెక్కలు సరిపోలేదు. కాకి రెక్కలు నప్పలేదు. గద్దా గద్దా, నీ రెక్కలిస్తావా నాకు కొంచెం సేపు? ఒక్కసారి ఆకాశంలోకి వెళ్లి రెండు నక్షత్రాలు కోసుకొస్తాను?" రాము అడిగాడు గద్దని.

"సరే తీసుకో అంది గద్ద. కానీ నేనే ఎప్పుడు నక్షత్రాలు కోసుకు రాలేదు. నా రెక్కలు అంత ఎత్తుకు పోతాయంటే సంతోషమే." రాము గద్ద రెక్కలు పెట్టుకొని శ్రమపడి ఎగిరాడు, కానీ చిన్న చిన్న చెట్లంత ఎత్తుకే ఎగరగల్గాడు.

"వీటికంటే గండభేరుండ పక్షి రెక్కలైతే మేలు. అడిగి చూడు" అంది గద్ద.

"సరే" అని రాము గండభేరుండ పక్షి కోసం వెతకటం మొదలు పెట్టాడు. చాలా సేపు వెతికిన తర్వాత గానీ గండభేరుండం దొరకలేదు. అప్పటికి తెల్లవారుతున్నది. నక్షత్రాలు మాయమయ్యాయి.

గండభేరుండం అంతా విని అన్నది, "అయ్యో, నేను సాయంత్రంకల్లా హిమాలయాలకు వెళ్ళాలి కదా, వచ్చాక ఇస్తాలే నీకు నారెక్కలు. అప్పటివరకు ఈ కలలు నీదగ్గర ఉంచుకో. ఈ కలల్లో ఎక్కి నువ్వు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఎక్కువ సమయం కూడా పట్టదు." అని చాలా కలలు ఇచ్చి వెళ్లింది. కానీ ఏమైందో ఏమో, అది ఈనాటికీ తిరిగిరాలేదు.

రాము మాత్రం రోజూ ఆ కలలెక్కి అన్ని నక్షత్రాలూ తిరిగి వస్తున్నాడు. మీకూ కావాలా కొన్ని కలలు? మా దగ్గర చాలానే ఉన్నై, కావాలంటే అడగండి మరి!