సెప్టెంబరు నెల వచ్చేసింది. హైదరాబాదులో వినాయక చవితి ఉత్సవాల్ని చూడాలి. ఉత్సవాలకు ఆర్నెల్ల ముందునుంచే వినాయక విగ్రహాలను అచ్చేసి, వాటికి రంగులేసే పిల్లల్ని చూడాలి.

3-4 అంతస్తుల ఎత్తుండే వినాయక విగ్రహాల్ని, క్రేన్లలోఎత్తి చెరువులోవేసే దృశ్యాన్ని వీక్షించాలి. నిమజ్జనం తరువాత నెల రోజులవరకూ హుస్సేన్ సాగర్ చెరువులో మునిగి, అక్కడి ఇనుప చువ్వల్ని సేకరించి అమ్ముకొనే పిల్లల్ని గురించి ఆలోచించాలి.

అన్ని విగ్రహాల్లోని మట్టితో ఆ చెరువు పూడిపోతుంటే అలా కాకూడదని కార్పొరేషన్ వాళ్ళు ప్రతీ ఏడాదీ చేపట్టే పూడికతీత కార్యక్రమాన్ని చూడాలి. ఆ విగ్రహాలకు వాడే రంగుల కారణంగా చెరువు నీళ్ళలో సీసం, పాదరసం మొదలైన ప్రమాదకర రసాయనాలు మోతాదుకు మించి కనబడుతున్నాయని కంగారు పడుతున్న మేధావుల పలుకుల్ని వినాలి.

ఒకవైపున వినాయక చవితి ఊరేగింపులూ, మరోవైపున పవిత్ర రంజాన్ఉపవాసాల నమాజులు - "ఇవి రెండూ ప్రశాంతంగా గడచిపోతే చాలుదేవుడా " అని ప్రార్థించేవారి సంఖ్య ఎక్కువౌతుండటం గమనించాలి. వీటిని రెండింటినీ స్వార్థానికి వాడుకొనేదెలాగో బాగా తెలుసుకొన్న రాజకీయజ్ఞుల పాచికల్ని అర్థం చేసుకోవాలి.

పండుగలు చాలామంచివి. భక్తి శ్రద్ధలకు అవి ఆలవాలాలు. సంస్కృతీ, సహజీవనాలకవి పట్టుగొమ్మలు. వ్యక్తిజీవనానికీ, సంస్కృతికీ పండుగలు కేంద్రబిందువులే, సందేహంలేదు. అయితే యాంత్రికీకరణ, పర్యావరణ కాలుష్యం, పెరిగిపోతున్న పట్టణ జనాభాల నేపథ్యంలోంచి చూసి, ’ఈ పండుగల్ని ఇలాగే ఎందుకు జరుపుకోవాల’ని అందరూ ఆలోచించగలిగితే బాగుండు. ఇవన్నీ వేరేగా జరిగితే బాగుండు. నియాన్ బల్బుల ధగధగలూ, పోటీ బాజాలూ, ధనస్వామ్యపు ఊరేగింపులూ కాక భక్తి శ్రద్ధల వ్యక్తీకరణకు మరింత పవిత్రమైన మార్గాలు దొరికితే బాగుండు. తళుకుబెళుకుల్లో పట్టణాలు తమనితాము మరిచిపోకుండా ఒక్క క్షణం ఆలోచిస్తే చాలేమో....నిక్కమైన మంచి నీలాలు లభించక పోవు. కొత్తపల్లెలు తిరిగి జనించకపోవు.